Menu

Thursday, December 31, 2015

రాజమౌళి టైటిల్ వాడేస్తున్నాడు

రాజమౌళి టైటిల్ వాడేస్తున్నాడు
బాహుబలి సినిమాతో ఒక్కసారిగా అంతర్జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించిన రాజమౌళి, ప్రస్తుతం బాహుబలి సీక్వెల్ ను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో మరోసారి సంచలనం సృష్టించటం ఖాయమని నమ్ముతున్నారు సినీజనాలు. దీంతో ఇంతటి భారీ విజయం తరువాత రాజమౌళి చేయబోయే నెక్ట్స్ సినిమా ఏంటి అన్న చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. ముఖ్యంగా గరుడ పేరుతో ఓ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించాలని భావిస్తున్నాడన్న వార్త బలంగా వినిపించింది.

అంతేకాదు మహేష్ బాబు, మోహన్ లాల్, ఎన్టీఆర్ లాంటి స్టార్లు ఈ సినిమాలో నటిస్తున్నారంటూ కూడా రూమర్స్ వినిపించాయి. ఈ వార్తలు ఖండించిన రాజమౌళి గరుడ పేరుతో  భారీ చిత్రం చేసే ఆలోచనైతే ఉందంటూ చెప్పాడు. అయితే ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో రాజమౌళి గరుడకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. ఇప్పుడు మరోసారి గరుడ సినిమా వార్తల్లోకి వచ్చింది.

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీగా తెరకెక్కిద్దామనుకున్న గరుడ పేరుతో తమిళ హీరో విక్రమ్ సినిమా చేయబోతున్నాడట. తిరు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా త్వరలోనే వస్తుందంటున్నారు చిత్రవర్గాలు. మరి తన సినిమాకు అనుకుంటున్న టైటిల్, విక్రమ్ వాడేయటం పై జక్కన్న ఎలా స్పందిస్తాడో చూడాలి.

గౌతం పోజిచ్చి.. మహేశ్‌ క్లిక్‌ చేస్తే.. ఖలీఫా అదృశ్యం!

గౌతం పోజిచ్చి.. మహేశ్‌ క్లిక్‌ చేస్తే.. ఖలీఫా అదృశ్యం!
నిజమే మన హీరోలకు సినిమాల్లో ఏదైనా సాధ్యమే. వారు తలుచుకుంటే ప్రపంచంలో అతిపెద్ద నిర్మాణమైనా బూర్జు ఖలీపానైనా కనపించకుండా కనుమరుగు చేయగలరు. కానీ నిజజీవితంలోనూ అలాంటి రేరెస్ట్‌ ఫీట్‌ను టాలీవుడ్ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, ఆయన తనయుడు గౌతం ఆల్మోస్ట్‌ సాధించారు! విషయమేమిటంటే షూటింగ్లతో బిజీగా ఉన్న మహేశ్‌బాబు కాస్తా తీరిక చేసుకొని.. కుటుంబంతో కలిసి దుబాయ్‌ విహారానికి వెళ్లారు. దుబాయ్‌ ఆయన ఫేవరెట్‌ హాలీడే స్పాట్‌. ప్రస్తుతం అక్కడ ఎంజాయ్‌ చేస్తున్న మహేశ్‌బాబు ఓ అరుదైన ఫొటోను తన అభిమానులతో ట్వీట్టర్‌లో పంచుకున్నారు.

ప్రపంచంలో అతిపెద్ద నిర్మాణమైన బూర్జు ఖలీఫా వాతావరణ ప్రభావంతో మేఘాలలో కలిసిపోగా.. దాని ఎదురుగా గౌతం పోజును మహేశ్‌ ఫొటోలో బంధించారు. ఆ ఫొటోను ట్విట్టర్‌లో పెట్టి.. 'అరుదైన దృశ్యం. బూర్జు ఖలీఫా మేఘాలలో అదృశ్యమైంది. అవాస్తవిక వాతావరణం దుబాయ్‌లో ఇది. లవ్‌ ఇట్‌' అంటూ ఆయన పంచుకున్నారు. అన్నట్టు మహేశ్‌బాబు తాజా సినిమా 'బ్రహోత్సవం' టీజర్‌ శుక్రవారం ఉదయం 9.30 గంటలకు విడుదల కానుంది.

ఇంగ్లండ్‌లో... జాలీగా!

ఇంగ్లండ్‌లో... జాలీగా!
ఐదేళ్లుగా బిజీ బిజీగా సినిమాలు చేసిన శ్రుతీహాసన్‌కి వెకేషన్ తీసుకునే ఛాన్స్ దక్కలేదు. ఇప్పుడు కూడా బిజీగా ఉన్నప్పటికీ షూటింగ్ షెడ్యూల్స్‌లో ఏర్పడిన వెసులుబాటు వల్ల శ్రుతికి కొంత గ్యాప్ దొరికింది. దాంతో ఆమె ఈ సెలవులను ఇంగ్లాండ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. కొత్త సంవత్సరానికి అక్కడే ఆహ్వానం పలుకుతున్నారు. విశేషం ఏంటంటే.. చిన్నప్పుడు శ్రుతీహాసన్ ఇంగ్లండ్‌కు వెళ్ళారు. ఆ తర్వాత షూటింగ్స్ కోసం వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు ఇంగ్లండ్‌నే హాలీడే ట్రిప్‌కి ప్లాన్ చేశారు. చిన్నప్పుడు వెళ్లినప్పుడే ఇంగ్లాండ్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఏర్పడి ఉంటుంది.
 

హాస్పటల్ లో చేరిన విద్యాబాలన్

హాస్పటల్ లో చేరిన విద్యాబాలన్
ముంబయి: బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ఆస్పత్రిలో చేరింది. కిడ్నీ సంబంధింత సమస్యతో ఆమె ముంబయిలోని హిందుజా ఆస్పత్రిలో చేరగా,  పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెకు కిడ్నీలో రాళ్లు ఉన్నట్టు వైద్యులు నిర్దారించారు. ఈ విషయంపై ఆమె సన్నిహితులు స్పందిస్తూ... 'విద్యాబాలన్ కోలుకుంటోంది. ప్రస్తుతం  ఆమె ఆరోగ్యం బాగానే ఉంది. బహుశా విద్యాని శనివారం డిశ్చార్జ్ చేయవచ్చు' అని  తెలిపారు. కాగా విద్యాబాలన్ న్యూ ఇయర్ వేడుకలతో పాటు, తన పుట్టినరోజును భర్త సిద్ధార్థ రాయ్ కపూర్ తో కలిసి అబ్రాడ్ లో జరుపుకునేందుకు ప్లాన్ చేసింది. అయితే విద్యాబాలన్ ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆ టూర్ ను అర్థాంతరంగా క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

సుప్రీమ్'గా ఇరగదీశాడు

'సుప్రీమ్'గా ఇరగదీశాడు
మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ లు సాధిస్తున్న యంగ్ హీరో సాయిధరమ్ తేజ్. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలతో ఆకట్టుకున్న సాయి, 2016లోనూ అదే జోరు కొనసాగించడానికి ట్రై చేస్తున్నాడు. మెగా ఇమేజ్ కు తగ్గ మాస్ కథతో మరోసారి ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. అందుకే కొత్త సంవత్సరం కానుకగా తన కొత్త సినిమాను టీజర్ ను అభిమానులకు గిఫ్ట్ గా అందించాడు. ఫుల్ ఎనర్జీతో నిండిన ఈ టీజర్ మెగా అభిమానులను ఖుషి చేస్తోంది.

సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంతో సుప్రీమ్ సినిమాలో నటిస్తున్నాడు. మామయ్య చిరంజీవి స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలో ఉన్న ట్యాగ్ ను ఇప్పుడు తను సొంతం చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే మాస్ లుక్స్ తో పాటు కామెడీ టైమింగ్ తోనూ ఆకట్టుకున్న సాయి మరోసారి తన మార్క్ చూపిస్తున్నాడని భావిస్తున్నారు. న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ అయిన టీజర్ తోనే అదే సిగ్నల్స్ ఇచ్చాడు. స్టైలిష్ యాక్షన్ సీక్వన్స్ లతో రూపొందిన సుప్రీమ్ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

స్వీట్ షాక్...

స్వీట్ షాక్...
న్యూ ఇయర్‌ను ఎంజాయ్ చేయడానికి మాల్దీవుల కన్నా బెస్ట్ ప్లేస్ ఉండదేమో అంటున్నారు నటి సోనమ్ కపూర్. కొంతమంది స్నేహితులతో, చెల్లెలు రియా కపూర్‌తో కలిసి నాలుగు రోజుల క్రితమే ఆమె అక్కడికి చెక్కేశారు. అక్కడి బీచ్‌లో స్నేహితులతో సందడి చేస్తున్న సోనమ్‌కి అర్జున్ కపూర్ స్వీట్ షాకిచ్చాడు. అర్జున్ తండ్రి బోనీకపూర్, సోనమ్ తండ్రి అనిల్ కపూర్ అన్నదమ్ములనే విషయం తెలిసిందే. చెల్లెలిని సర్‌ప్రైజ్ చేయాలనుకున్న అర్జున్ ముందుగా చెప్ప కుండా మాల్దీవుల్లో వాలిపోయాడు. ఆ తర్వాత అన్నాచెల్లెలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

ప్రముఖ టీవీ నటిపై మరదలి వేధింపుల కేసు

ప్రముఖ టీవీ నటిపై మరదలి వేధింపుల కేసు
ప్రముఖ టీవీ నటి స్మితా బన్సల్‌కు కొత్త సంవత్సరం వేధింపుల కేసుతో ప్రారంభమైంది. ఆమె తనను వేధించిందంటూ మరదలు మేఘాగుప్తా కేసు పెట్టింది. స్మితా బన్సల్ తన అభరణాలు, రూ. 50 లక్షలు సైతం చోరీచేసిందని ఆమె ఆరోపించింది. అయితే  తనను ఈ కేసులోకి అనవసరంగా లాగుతున్నారని స్మితా బన్సల్ చెప్తోంది.

స్మితా బన్సల్‌పై సెక్షన్ 498 (ఏ) కింద గుర్గావ్‌లోని మహిళా ఠాణాలో కేసు నమోదైంది. 'ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు. ఎఫ్‌ఐఆర్ కాపీ కూడా నా దగ్గర లేదు. ఎఫ్‌ఐఆర్‌ నాకు అందిన తర్వాత నాపై మోపిన అభియోగాలేమిటో తెలుసుకొని నేను స్పందిస్తాను. నన్ను ఎందుకు ఈ కేసులోకి లాగారో అర్థం కావడం లేదు' అని స్మితా బన్సల్‌ తెలిపింది. 'అమానత్', 'ఆశిర్వాద్' వంటి ప్రముఖ హిందీ సీరియళ్లలో నటించిన స్మితా బన్సల్ సోదరుడు సౌరభ్ బన్సల్‌ 2009లో మేఘా గుప్తాను పెళ్లాడారు.

ఆ తర్వాత దంపతులు లండన్‌ వెళ్లిపోయారు. దంపతుల మధ్య గొడవలు రావడంతో ఈ ఏడాది ప్రారంభంలో మేఘా గుప్తా గుర్గావ్‌ తిరిగొచ్చేసింది. మేఘా గుప్తాతో తనకు పెద్దగా సంబంధాలు లేవని, ఆమెతో ఎప్పుడూ గడిపింది కూడా లేదని, పెళ్లికాగానే తన సోదరుడు, మరదలు లండన్ వెళ్లిపోయారని స్మితా బన్సల్ వివరించారు.

2016 ఆశలు-ఆశయాలు

2016 ఆశలు-ఆశయాలు
నూతన సంవత్సరం రోజున ప్రభుత్వ యంత్రాంగంలో కీలకమైన అధికారులు ఏమనుకుంటున్నారు.. కొత్త సంవత్సరంలో వారి ఆశలు, ఆశయాలు ఏమిటి..?
ఈ ప్రశ్నలకు వారి నుంచి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది సాక్షి.
కొత్త సంవత్సరంలో అయినా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని అందరూ కాంక్షించారు. పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలు పరిష్కారం కావాలని అన్నారు. అధికారులు ఏమన్నారో వారి మాటల్లోనే.. 


రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి
జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి, ఉమ్మడి రాష్ట్రాల లోకాయుక్త

కొత్త సంవత్సరంలో రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి. వరుణ దేవుడు కరుణించాలి. మంచి వర్షాలు కురవాలి. పాడిపంటలు సమృద్ధిగా పండాలి. ప్రజలు సుఖ సంతోషాలతో మెలగాలి. శాంతి సామరస్యాలు వెల్లివిరియాలి. అవినీతి రహిత, నిర్లక్ష్య రహిత పాలన ఉండాలి. ప్రభుత్వాలు జవాబుదారీతనంతో పనిచేయాలి. ఎక్కడ అవినీతి జరుగుతుందో గుర్తించి కట్టడి చేయాలి. లంచం ఇచ్చే వారికి శిక్షలు వేయాలి. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కాకుండా చూడాలి.

తిరుపతిలోనే న్యూ ఇయర్ : భన్వర్‌లాల్, ఇరు రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారి
ప్రతి ఏడాది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనంతో కొత్త సంవత్సరం ప్రారంభిస్తాను. దాదాపు 20 ఏళ్లుగా డిసెంబర్ 31 లేదా జనవరి 1న తిరుపతికి వెళ్తున్నా. ఈ ఏడాది కూడా కొత్త సంవత్సర వేడుకలు అక్కడే. కుటుంబ సభ్యులతో పాటు తిరుపతిలోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్. రెండు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

కొత్త ఏడాదిలో ఎన్నికల కమిషన్ ముందున్న లక్ష్యాలన్నీ నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటాం. ఏపీలో చిత్తూరు ఎమ్మెల్సీ సీటు ఒకటి ఖాళీగా ఉంది. హైకోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉన్నందున ఎన్నిక నిర్వహించలేదు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఈ ఎన్నిక జరుపుతాం. ఫిబ్రవరి 25 లోపు తెలంగాణలో ఖాళీగా ఉన్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే సీటుకు ఎన్నికలు నిర్వహిస్తాం. 2016 మార్చి 11న తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లో కొత్త ఓటర్ల జాబితాను ప్రచురిస్తాం. జనవరి 25న రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా ‘జాతీయ ఓటర్ల దినోత్సవం’ నిర్వహిస్తాం.

బెస్ట్ పోలీసింగ్.. ఇదే మా విజన్ : అనురాగ్ శర్మ, డీజీపీ
రాష్ట్ర పోలీసు విభాగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాం. కొత్త రాష్ట్రానికి మొదటి డీజీపీగా అరుదైన అవకాశం దక్కింది. దీన్ని సద్వినియోగం చేసుకొని దేశంలోనే తెలంగాణ పోలీస్ బెస్ట్ అనేలా చేయాలన్నదే ఆకాంక్ష. బంగారు తెలంగాణలో శాంతిభద్రతలు కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. అందరినీ కలుపుకొని ముందుకెళ్తాం. పట్టణీకరణ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాలు అదుపు చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. సైబర్‌క్రైం అదుపు చేయడం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మావోయిజం, ఉగ్రవాదం అభివృద్ధికి ప్రధాన విఘాతంగా మారినట్లు ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైంది. వీటి  విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. అంతిమంగా మా లక్ష్యం ప్రజా శ్రేయస్సు.. ఫ్రెండ్లీ పోలీసింగ్.

ప్రజల సహకారంపైనే ఆశలు

బి.జనార్దన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్
నూతన సంవత్సరంలో హైదరాబాద్ నగర ప్రజల సహకారంపైనే ఆశలు, ఆకాంక్షలు పెట్టుకున్నా. పురపాలనలో ప్రజల సహకారం లేనిదే ఏ పని విజయవంతం కాదు. ప్రజల భాగస్వామ్యాన్ని పొందడమే ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన పని. కొత్త ఏడాదిలో ప్రజల నుంచి మంచి భాగస్వామ్యం పొందుతామని ఆశిస్తున్నాం. ట్రాఫిక్ నియమాలను పాటించడం, ఎక్కువగా ప్రభుత్వ రవాణా వాహనాలను వినియోగించటం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, క్రీడా మైదానాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవటం, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించటం.. తదితర అంశాల్లో ప్రజల భాగస్వామ్యం కావాలి. ‘స్వచ్ఛ హైదరాబాద్’ కోసం అందరూ కృషి చేయాలి. ఆరోగ్యకరమైన హైదరాబాద్‌ను తీర్చిదిద్దటమే నా ప్రధాన ధ్యేయం.

నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం
రవీంద్ర గుప్తా, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్
దక్షిణ మధ్య రైల్వే అంటే ప్రయాణికులకు ఓ భరోసా. వారి మనోగతానికి తగ్గట్టుగా రైళ్లను నడపడంతోపాటు ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయనే నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మరింత పెంచటమే కొత్త సంవత్సరంలో మా కర్తవ్యం. సకాలంలో భద్రంగా వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఇందుకు 24 గంటల పర్యవేక్షణకు మరింత పదును పెడతాం. సౌరశక్తి లాంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులతో విద్యుత్‌ను ఆదా చే స్తూ, పర్యావరణానికి మేలు చేసే చర్యలకు ప్రాధాన్యమిస్తాం. మన ఇల్లు, పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూస్తే దేశం మొత్తం పరిశుభ్రంగా మారుతుంది. అందుకే అంతా స్వచ్ఛభారత్‌ను విజయవంతం చేద్దాం. హరిత భారత నిర్మాణంలో పాలు పంచుకుందాం. రైల్వే ఉద్యోగుల కుటుంబాలతో కలిసి రైల్వే క్లబ్‌లో కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొంటా.

2016.. ఇయర్ ఆఫ్ టెక్నాలజీ
మహేందర్‌రెడ్డి, నగర పోలీస్ కమిషనర్
నగర పోలీసు విభాగం వచ్చే ఏడాదిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగించుకుంటుంది. పోలీసు విధి నిర్వహణను మరింత పారదర్శకంగా చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నాం. నేరాలను అరికట్టేందుకు, జరిగిన నేరాలకు కొలిక్కి తీసుకురావడంలో టెక్నాలజీని మరింతగా వినియోగించుకుంటాం. ట్రాఫిక్ విభాగంలో ఇప్పటికే కాప్ లెస్ జంక్షన్స్ విధానాన్ని అమలు జరుగుతోంది. పోలీసు ప్రమేయం లేకుండా వాహనచోదకులు తమంతట తామే నిబంధనలు పాటించేలా చేయడం దీని ప్రధాన ఉద్దేశం. భవిష్యత్తులో హైదరాబాద్ రోడ్లపై ట్రాఫిక్ పోలీసులే కనిపించకుండా పూర్తి స్థాయిలో టెక్నాలజీ వాడతాం. నగర పోలీసుకు సంబంధించి 2016 ఈజ్ ఏ ఇయర్ ఆఫ్ టెక్నాలజీ.

అన్ని రంగాల్లోనూ దూసుకెళ్లాలి
రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
తెలంగాణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో గడపాలి’ అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ ఆకాంక్షించారు. ‘కొత్త సంవత్సరంలో ఉద్యోగులు మరింత అంకితభావంతో పని చేయాలి. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులు, ఉద్యోగులు మరింత సమర్థంగా విధులు నిర్వహించాలి. ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం కొత్త సంవత్సరంలో మరింత అభివృద్ధి సాధించాలి. అన్ని రంగాల్లోనూ అప్రతిహతంగా దూసుకెళ్లాలి. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలన్నీ క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులందరికీ చేరేలా ఉద్యోగులు నిబద్ధతతో పని చేయాలి.

అంతుబట్టని లాజిక్!

వల్లూరు లాజిస్టిక్ పార్కు భూములకు అడ్డగోలుగా నష్టపరిహారం పంపిణీ
రెవెన్యూ మంత్రి వరకూ ఫిర్యాదులు
బాధితులకు  లభించని ఊరట    


అనకాపల్లి: వల్లూరు లాజిస్టిక్ పార్కు కోసం సేకరించిన భూములకు ఏ ప్రాతిపదికన నష్టపరిహారం  చెల్లించారో అంతుబట్టని వ్యవహారంగా మారింది. లబ్ధిదారుల ఖాతాల్లోకి పరిహారం సొమ్ము వేసే ప్రక్రియ పూర్తయినప్పటికీ ఆర్థిక వివాదాలు ఇంకా కొనసాగుతున్నాయి.  ఈ వివాదం ఇప్పుడు స్వయంగా రెవెన్యూ మంత్రి దృష్టికి కూడా వెళ్లింది. సుమారు 374 మంది లబ్ధిదారులను మూడు కేటగిరీల్లో గుర్తించి 286 ఎకరాల భూమిని రెవెన్యూ యంత్రాంగం సేకరించింది. ఈ భూమి ఏపీఐఐసీ ద్వారా పోర్టుట్రస్టుకు దఖలుపరిచే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.

అంతు చిక్కని పీటముడి : ప్రస్తుతం వల్లూరు లాజిస్టిక్ పార్కు భూసేరణ అనంతరం నష్టపరిహారం తంతు ముగిసినా ఇంకా వేధిస్తున్న ఒక చిక్కుముడి ఇప్పుడు అధికారుల్ని, రైతుల్ని, దళారుల్ని వెన్నాడుతోంది.  చినికిచినికి గాలి వానలా మారిన ఈ ఆర్థిక వివాదం ఒక ఎమ్మెల్యే, కీలకమైన అధికారులు, రెవెన్యూ మంత్రి దృష్టికి కూడా వెళ్లింది.   ఏమిటా చిక్కుముడి?: వల్లూరు లాజిస్టిక్ పార్కు భూసేకరణకు ముందు స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి  ఇద్దరు  రైతుల నుంచి సుమారు మూడెకరాల  డీపట్టా భూమిని 99 సంవత్సరాలకు లీజుకు తీసున్నాడు. అప్పటికే ఆ భూమిని అసలు రైతు దగ్గర నుంచి మరో మహిళ  కొనుగోలు చేశారు.  అప్పట్లో వల్లూరు డీ పట్టా భూములకు పెద్దగా విలువ లేకపోవడంతో భూముల క్రయవిక్రయాలను ఎవరూ పెద్దగా పట్టించుకొనే వారు కాదు. ఇప్పుడు ఎకరాకు 14 లక్షల 75 వేల రూపాయిల నష్టపరిహారం రావడంతో ఆర్థిక వివాదాలు పెరిగిపోయాయి. నష్టపరిహారం అసలు రైతుల ఖాతాలో పడిపోవడంతో అధికార పార్టీకి చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి రంగంలోకి దిగారు. బ్యాంకు నుంచే సదరు నష్టపరిహారాన్ని తన ఖాతాలోకి మళ్లించుకొని భూమిని కొనుగోలు చేసిన వారికి అం దించి ఒరిజినల్ డాక్యుమెంట్లు తెస్తానని నమ్మబలికాడు. తీరా భూమిని లీజుకి తీసుకున్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగికి నష్టపరిహారం అందకపోవడంతో వివాదం మొదలయింది. లీజుకి తీసుకున్న భూమి లాజిస్టిక్ పార్కులో పోవడం, పైసా నష్టపరిహారం అందకపోవడంతో ఆ ఉద్యోగి ఈ వివాదాన్ని విశాఖ సిటీకి చెందిన ఒక ఎమ్మెల్యేకు, రెవెన్యూ ఉన్నతాధికారులకు, చివరకు రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆర్డీవో లేఖ రాసినా..? ఈ వివాదం రెవెన్యూ మంత్రి దృష్టికి వెళ్లడంతో ఆర్డీవో రంగంలోకి దిగి స్థానిక తహశీల్దార్‌కు సమస్య పరిష్కరించాలని లేఖ రాశారు. అయినప్పటికీ బాధితులకు ఊరట లభించలేదు.

 ఎందుకో ఉలికిపాటు : అనకాపల్లి మండలంలోని వల్లూరు భూసేకరణ నష్టపరిహార  వివాదం ఒక రెవెన్యూ అధికారికి ఉలికిపాటు కలిగిస్తోంది. ఆర్థిక లావాదేవీలపై కాల్‌మనీ కేసు పెడతామని, ప్రొబెషనర్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్(పీవోటీ) యాక్ట్ ప్రయోగించి కేసు పెడతామని భూములు దక్కించుకున్న స్టీల్ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ అయ్యాయి. చట్టం, నిబంధనల వరకూ బాగానే ఉన్నా ఈ ఉదంతంలో వల్లూరు భూసేకరణ తీరునే ప్రశ్నించే అనేక అనుమానాలు ఇప్పుడు అందరి మదిలో తలెత్తుతున్నాయి.

వీటికి సమాధానం ఎవరు చెబుతారు?
ఒరిజినల్ పట్టాలు లేకుండానే నష్టపరిహారం  ఎలా మంజూరయింది? భూములు సర్వే చేసిన సర్వేయర్  అక్కడ ఒరిజినల్ పట్టాలు లేకుండానే ఎలా గుర్తించారు?  ఒక వేళ డీపట్టా ఒరిజినల్ లేకపోయినా  డూప్లికేట్ తయారు చేసి ఉంటే ఇలా అన్నింటికి ఇదే తరహా తతంగాన్ని నడిపారా?  బ్యాంకులోని రైతు ఖాతా నుంచి లక్షల్లో పరిహారం మధ్యవర్తికి ఎలా బదిలీ అయింది?  రెవెన్యూ మంత్రి నుంచే సిఫారసు వచ్చిందంటే ఈ వివాదంలో విశ్వసనీయత లేనట్లా..?  ఎవరికి కాపాడేందుకు.. ఏ రహస్యాన్ని దాచేం దుకు  ఈ తతంగం?

కొత్త సంవత్సర వేడుకల్లో అపశ్రుతి

కొత్త సంవత్సర వేడుకల్లో అపశ్రుతి
దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం
 బుర్జ్ ఖలీఫాకు సమీపంలో ఘటన.. 63 అంతస్తుల ఫైవ్‌స్టార్ హోటల్‌లో మంటలు


 దుబాయ్:
 యూఏఈలో నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తై బుర్జ్ ఖలీఫా ఆకాశ హర్మ్యం సమీపంలోని 63 అంతస్తుల అడ్రస్ డౌన్‌టౌన్ హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. హోటల్‌లో 20వ అంతస్తులో ముందుగా మంటలు చెలరేగాయని చెప్తున్నారు. ఆ మంటలు హోటల్ వెలుపలి వైపు నుంచి 40వ అంతస్తు వరకూ పైకి ఎగసిపడుతున్నాయి. దీంతో హోటల్ పై అంతస్థుల నుంచి దాదాపు 300 మీటర్ల ఎత్తు నుంచి శకలాలు కిందకు పడుతున్నాయి. ఈ హోటల్‌లో నివాస గదులు (రెసిడెన్షియల్ రూమ్స్) కూడా ఉన్నాయి.

కొత్త సంవత్సరం వేడుకల కోసం.. పెద్దమొత్తంలో టపాసులను భవనంపైకి తీసుకు వెళ్లినట్లు చెప్తున్నారు. మంటలు మొదలైన వెంటనే గుర్తించి హోటల్‌లోని అందరినీ ఖాళీ చేయించటంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. అయితే మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో అందులో ఉన్న వారంతా బయటకు రావడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో 14 మందికి చిన్న గాయాలు కాగా, ఓ వ్యక్తికి గుండె పోటు వచ్చినట్టు అధికారులు చెప్పారు. హోటల్ లోపలి వైపు మంటలు విస్తరించలేదని అధికారులు పేర్కొన్నారు.

ఆరు నెలలకే ఫ్రెండ్స్ అయ్యారు ఎలా ?


ఆరు నెలలకే  ఫ్రెండ్స్  అయ్యారు ఎలా ?
రహస్యం 2015
అంతు చూస్తామని .. ఆరు నేలలకే  ఫ్రెండ్స్  అయ్యారు ఎలా ?
ఈ ఏటి మేటి మిస్టరీగా తెలంగాణ, ఏపీ సీఎంల వ్యవహార శైలి


హైదరాబాద్:
 ‘నిన్ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు.. నగ్నంగా, పచ్చిగా పట్టపగలే దొరికిన దొంగవు నువ్వు.. ఇంకా ఎక్కువ మాట్లాడితే తగిన శాస్తి జరుగుతుంది..’

 ‘నేను కళ్లు తెరిస్తే కష్టాలే.. నన్ను అరెస్టు చేస్తే నీ ప్రభుత్వానికి అదే ఆఖరి రోజు. నా ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం నీకెవరిచ్చారు? ట్యాపింగ్ కేసులో నువ్వు జైలుకు వెళ్లకతప్పదు..' ...ఈ తిట్లు, భీకర హెచ్చరికలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు! ఎవరు, ఏ సందర్భంలో అన్నారో రెండు రాష్ట్రాల ప్రజలందరికీ సుపరిచితమే!! కేసుల మీద కేసులు.. టేపుల మీద టేపులు.. నువ్వు తమలపాకుతో ఒకటంటే నేను తలుపు చెక్కతో రెండంటా అన్నట్టుగా ఉండేది ఇరువురి నేతల వ్యవహారం.
 
ఏదేమైనా ఆ ఇద్దరూ చెప్పిందొకటే.. ‘చట్టం తన పని తాను చేసుకుపోతుందని..(?)’ కానీ ఏమైంది? ‘ఓటుకు కోట్లు’ కేసులో అడ్డంగా దొరికిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పినట్టు ‘తగిన శాస్తి’ జరిగిందా? చంద్రబాబు హెచ్చరించినట్టు ట్యాపింగ్ కేసులో కేసీఆర్ జైలుకు వెళ్లారా? ఏదీ జరగలేదు. 2015 మొదటి అర్థభాగం వరకు రెండు రాష్ట్రాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనేలా చేసిన ఇరు రాష్ట్రాల చంద్రుల మధ్య అదే ఏడాది చివరికి వచ్చేసరికి ‘సఖ్యత’ చోటుచేసుకుంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు పక్కనపెట్టారు. నోటికి వచ్చినట్లు తిట్టుకున్న కొద్ది కాలానికే మాటలు కలిశాయి. మర్యాదలు పెరిగాయి. కేసుల అలజడి అసలే లేదు. పెపైచ్చు తమ తమ రాష్ట్రాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ ఇరువురు ఒకరి నివాసానికి మరొకరు వెళ్లి ఆహ్వానాలు ఇచ్చుకున్నారు. అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ సీఎం వెళ్తే.. కేసీఆర్ తలపెట్టిన అయుత చండీయాగానికి ఏపీ సీఎం హాజరయ్యారు.

గడచిన ఏడాదిలో సగ భాగం కంటే ఎక్కువ కాలం ఉప్పు-నిప్పుగా ఉన్న బాబు-కేసీఆర్ ఇప్పుడు పాలు-నీళ్లలా కలిసిపోయారు. కలిస్తే చాలు పరస్పరం అభివాదాలు, నవ్వులు, సరదా ముచ్చట్లు. ఇంతవరకు బాగానే ఉన్నా తెలంగాణలో ఓటుకు కోట్లు కేసు, ఏపీలో ఫోన్ ట్యాపింగ్ కేసులు ఏమైపోయాయన్నదే సామాన్యుల మదిని తొలుస్తున్న ప్రశ్న! తన పని తాను చేసుకుపోవాల్సిన చట్టం ఎవరికి చుట్టంగా మారింది? ఏలికలు ఒక్కటవగానే కేసులెందుకు మూలన పడ్డాయి?! అందరినీ సమానంగా చూడాల్సిన చట్టం కొందరిని ఎందుకు ఎక్కువ సమానంగా చూస్తోంది? పదేళ్లు హైదరాబాద్ మాదే అని హూంకరించిన చంద్రబాబు 2016 జూన్ నాటికి హైదరాబాద్‌లో ఏపీ సచివాలయానికి తాళాలు వేయాలని ఎందుకంటున్నారు? ఇవ న్నీ గతేడాది మిగిల్చిన శేష ప్రశ్నలు! మొత్తంగా 2015.. జనం చెవిలో పాలకులు పెట్టిన పూలకు తార్కాణంగా నిలిచిపోయింది!!
 ‘ట్యాపింగ్’ గోల ఇదీ..
 తెలంగాణలో ఓటుకు కోట్లు కేసుకు ప్రతిగా ఏపీలో ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు ఐపీఎస్, ఐఎఎస్ అధికారులను ఈ కేసులో నిందితులుగా చేర్చారు. తెలంగాణలో తన ను అప్రతిష్టపాలు చేశారని గమనించిన చంద్రబాబు ఏపీలో కొత్త డ్రామాకు తెరతీశారు. నామినేటెడ్ ఎమ్మెల్యేకు లంచం ఇవ్వజూపిన కేసును రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అది కాస్త బెడిసికొట్టడంతో లాభం లేదనుకుని ట్యాపింగ్ కేసు పెట్టి కేసీఆర్‌పై చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ సర్కారు ఇరుక్కుంటుందని అంతా భావించారు. కాల్ డేటా సమర్పించాలని విజయవాడలో పోలీ స్ కమిషనర్ సెల్‌ఫోన్ కంపెనీలను ఆదేశిం చారు. పోలీసులు అడిగిన వివరాలు ఇవ్వాల్సిందేనని విజయవాడ కోర్టు తేల్చిచెప్పింది. సీఎం కేసీఆర్ సహా ముగ్గురు ఐపీఎస్, ఒక ఐఎఎస్ అధికారి జైలుకేనంటూ ఏపీ మంత్రులు మండిపడ్డారు. కొన్నాళ్లు పోతే గానీ అసలు విషయం బోధపడలేదు. కేసుల సంగతి దేవుడెరుగు చంద్రబాబు హైదరాబాద్ రావడమే మానేశారు. అసెంబ్లీ సమావేశాలు జరిగితేనో లేదా ముఖ్యమైన కార్యక్రమం ఉంటే తప్ప హైదరాబాద్ రావడం లేదు. పదేళ్ల పాటు రాజధాని అంటూ గొప్పలకు పోయిన సీఎం చంద్రబాబు ఇప్పుడు.. అబ్బే హైదరాబాద్ నుంచి ఉద్యోగులంతా అమరావతి రావాల్సిందేనని హుకుం జారీ చేశారు.

 ‘ఓటుకు కోట్లు’లో హడావుడి ఇలా..
 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ద్వారా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇచ్చారు. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని రేవంత్‌రెడ్డిని అరెస్టు చేశారు. అంతే కాదు కేసును చాలా స్పీడ్‌గా నడిపించారు. స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన చంద్రబాబు ఫోన్ సంభాషణల టేపులు బయట పెట్టారు. ఇంకేముంది చంద్రబాబుకు కష్టకాలమే అనుకున్నారు. దానికి తగ్గట్టే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అదే స్థాయిలో చంద్రబాబుపై చెలరేగిపోయారు. ఓటుకు కోట్లు కేసులో బాబుకు ఇబ్బందులు తప్పవని అందరూ అనుకున్నారు. చంద్రబాబుకు నోటీసులు జారీ చేసి ఏసీబీ విచారిస్తుందని భావించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఫోన్ సంభాషణ టేపులు బయటపడ్డ వెంటనే ఈ కేసు కీలక దశకు చేరుకుందని ఏసీబీ అధికారులు హడావుడి చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని గంభీరమైన ప్రకటనలు చేశారు.

 నేను కళ్లు తెరిస్తే...: చంద్రబాబు
‘‘నేను కళ్లు తెరిస్తే కష్టాలే. నన్ను అరెస్టు చేస్తే నీ ప్రభుత్వ పతనం తప్పదు. నీకు ఎన్ని అధికారాలు ఉన్నాయో నాకూ అన్ని అధికారాలు ఉన్నాయి. రాష్ట్రాల మధ్య తగవులు వద్దు. నువ్వు కాదని మొండికేస్తే విషయం చాలా దూరం వెడుతుంది. సమయం వచ్చినప్పుడు ఒక్కో అస్త్రం వదులుతా. స్టింగ్ ఆపరేషన్ పేరుతో ప్రభుత్వానికి చెందిన వారు ఫోన్లు ట్యాప్ చేస్తావా..? ఇది నీచాతి నీచం. మాకూ ఏసీబీ ఉంది. మీ ఏసీబీ హైదరాబాద్‌లో ఉంటే మా ఏసీబీ కూడా హైదరాబాద్‌లోనే ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నువ్వు జైలుకు వెళ్లక తప్పదు.
 ఠి జూన్ 9న గుంటూరులో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్‌పై చంద్రబాబు విసుర్లు

 బాబును బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేడు: కేసీఆర్
 ‘‘చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే తగిన శాస్తి జరుగుతుంది. నగ్నంగా, పచ్చిగా పట్టపగలే దొరికిన దొంగవు నీవు. అరచి పెడబొబ్బలు పెట్టి ఏదో చేయాలనుకుంటున్నావు. కేసులో ఇరికిస్తే ఇరికే మనిషివా నువ్వు చంద్రబాబూ..? హైదరాబాద్ నీ అబ్బ జాగీరా, నీ తాతదా... కేసీఆర్ నీ లెక్క దొంగ కాదు, లత్కోరు పని చేయడు...’’
 జూన్ 9న నల్లగొండ ఎన్‌జీ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగసభలో కేసీఆర్ వ్యాఖ్యలివీ!
 

పూటుగా తాగితే ఇంటికి చేరుస్తారు

పూటుగా తాగితే ఇంటికి చేరుస్తారు
‘మిషన్ స్మార్ట్ డ్రైవ్’పారంభించిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: డ్రంకన్ డ్రైవ్ ప్రమాదాలను నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త డ్రైవ్ షురూ చేసింది. ఫుల్లుగా మద్యం సేవించి, వాహనాన్ని నడపలేని స్థితిలో ఉన్నవారిని సురక్షితంగా ఇంటి వద్ద దిగబెట్టేందుకు దేశంలోనే తొలిసారిగా ‘మిషన్ స్మార్ట్ డ్రైవ్’ను గురువారం అమల్లోకి తెచ్చింది. అది కూడా పూర్తి ఉచితంగా! పెలైట్ ప్రాజెక్టుగా మొదట హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చింది. ‘డ్రింక్ సేఫ్ అండ్ స్మార్ట్ రైడ్’ నినాదంతో రూపొందించిన ఈ ప్రాజెక్టును రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌రంజన్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు గురువారం హోటల్ తాజ్‌కృష్ణాలో ప్రారంభించారు.

మద్యం మత్తులో వాహనాలను నడపడం వల్ల జరుగుతున్న ప్రమాదాలు, ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించాలన్నది ఈ డ్రైవ్ ఉద్దేశం. సామాజిక కోణంలో ఈ సేవలు అందించేందుకు  ఉబర్ క్యాబ్, నార్నే ఎస్టేట్స్ ముందుకొచ్చాయి.

సేవలిలా: ఈ ప్రాజెక్టులో భాగంగా క్యాబ్ సేవలు 25 కి లోమీటర్ల పరిధి లోపు ఉంటాయి. ‘స్మార్ట్ రైడ్ 4 జీరో డీయూఐ క్యాబ్ సర్వీసెస్’ పేరుతో సేవలు అందిస్తారు. బార్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లలో మద్యం మత్తులో ఉండే కస్టమర్ల సమాచారాన్ని వాటి యాజమాన్యాలు సదరు క్యాబ్ సంస్థకు చేరవేస్తాయి. ఆటోమేటెడ్ కాల్ ఫార్వాడింగ్ పద్ధతిన పరిసర ప్రాంతాల్లోని క్యాబ్ అక్కడికి చేరుకుంటుంది. మత్తులో ఉన్నవారిని ఇంటి వద్ద విడిచిపెడుతుంది. 25 కిలోమీటర్ల వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించక్కర్లేదు.

ఆ పరిధి దాటితే చార్జీలు వర్తిస్తాయి. బార్/రెస్టారెంట్‌లోకి రాగానే కస్టమర్ల చిరునామాను ముందుగానే అక్కడ ప్రత్యేకంగా నియమించిన వ్యక్తికి తెలియజేయాలి. లేదంటే ప్రత్యేకంగా రూపొందించిన... ‘వన్ టచ్’ కాల్ రూటింగ్ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో పేర్కొన్న ప్రకారం వివరాలను ఫార్వార్డ్ చేస్తే క్యాబ్ వస్తుంది. ఈ సేవలు విస్త్రత స్థాయిలో అమల్లోకి రావాలంటే ముందుగా బార్లు, రెస్టారెంట్లు, హోటళ్ల యాజమాన్యాలు ముందుకు రావాలి. ఇలాంటి వారి కోసం ఓ క్లబ్ ఏర్పాటు చేశారు.

ఇప్పటికే 28 రెస్టారెంట్లు/బార్లు తమ వివరాలు ఇందులో నమోదు చేసుకున్నాయి.  ఇది ఉత్తమ ప్రాజెక్టు: సామాజిక కోణంలో ఏ కార్యక్రమం చేపట్టడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేకే చెప్పారు. స్మార్ట్ డ్రైవ్ ఉత్తమ ప్రాజెక్టుగా నిలుస్తుందన్నారు. రోడ్డు భద్రతను పటిష్టం చేసేందుకు ఇదెంతో ఉపయోగపడుతుందని జయేష్‌రంజన్ అన్నారు. పలు దేశాల్లో పాటిస్తున్న విధానాలను అధ్యయనం చేసి  దీన్ని రూపొందించామని మిషన్ స్మార్ట్ డ్రైవ్ సీఈఓ నందశాండిల్య చెప్పారు. రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ డెరైక్టర్ అకున్ సబర్వాల్, మాజీ క్రికెటర్ వెంకటపతిరాజు, ఉబర్ క్యాబ్ జీఎం సిద్ధార్థ్ శంకర్ ఇందులో పాల్గొన్నారు.

సీఎం ఎందుకు వస్తున్నట్టో!

సీఎం ఎందుకు వస్తున్నట్టో!
 సాక్షి ప్రతినిధి, ఏలూరు : ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఏలూరు పర్యటన ఓ ప్రసహనంలా మారనుంది. గతేడాది జనవరి 1న ఏలూరు సమీపంలోని చాటపర్రులో పర్యటించి సంక్రాంతి సంబరాలను లాంఛనంగా ప్రారంభించిన సీఎం ఈ ఏడాదిలో తొలి రోజైన శుక్రవారం కూడా ఏలూరులోనే పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆయన పర్యటనకు ఎంచుకున్న ఏలూ రు ప్రభుత్వాసుపత్రిలోని మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ (ఎంసీహెచ్) ప్రారంభోత్సవ కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ఎంసీహెచ్ భవన నిర్మాణం పూర్తయింది.

  అయితే, ఆసుపత్రిలో రోగులకు వైద్యం అందించేందుకు ఒక్క పరికరాన్నీ ఏర్పాటు చేయలేదు. కనీసం మంచాలు కూడా లేవు. తల్లీబిడ్డలకు వైద్యసేవలు అందించేందుకు వైద్యు లు, సిబ్బంది నియామకం పూర్తి కాలేదు. ఇక్కడ నెలకొల్పాల్సిన టెలీ రేడియోలజీ విభాగం, 60 రకాల రోగనిర్ధారణ ల్యాబ్, ప్రత్యేక కార్డియాలజీ విభాగం ఇంతవరకు ఏర్పాటు కాలేదు. ఇవేమీ లేకుండా ఖాళీ భవనాలను సీఎం ప్రారంభించడం వల్ల ప్రయోజనమేమిటన్న వాదనలు ఆసుపత్రి వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. అయితే, సీఎం రాకను పురస్కరించుకుని కొన్ని మంచాలను రాత్రికి రాత్రికి ఆసుపత్రిలో వేసినా సౌకర్యాల కల్పన మాత్రం ఇంకా పూర్తికాలేదు.

 వైఎస్ హయాంలో అంకురార్పణ
 జిల్లా కేంద్రంలో రూ.10 కోట్లతో నిర్మించిన ఈ నూతన ఆసుపత్రి భవనానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 ప్రథమార్థంలో అంకురార్పణ చేశారు. జిల్లా నలుమూలల నుంచి త రలివచ్చే రోగులకు ఆధునిక వైద్య సేవలందించే లక్ష్యంతో ఈ ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన నిధులను అప్పట్లోనే వైఎస్ మంజూరు చేశారు. ఆయన హఠాన్మరణం తర్వాత బాలారిష్టాల మధ్య ఎట్టకేలకు నిర్మాణం పూర్తి చేసుకున్న ఆసుపత్రిలో అన్ని ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం నేటికీ మాటలకే పరిమితమైంది.

 ముఖ్యమంత్రి పర్యటన ఇలా
 ఏలూరు (మెట్రో) : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పర్యటన ఖరారైంది. నూతన సంవత్సరంలో తొలి రోజైన శుక్రవారం మధ్యాహ్నం 3.50 గంటలకు ఏలూరు ఇండోర్ స్టేడియంకు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. సాయంత్రం 4.10 గంటలకు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో నూతనంగా నిర్మించిన తల్లీబిడ్డల ఆసుపత్రిని ప్రారంభిస్తారు. అనంతరం అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలలో అందుబాటులోకి వచ్చే ఉచిత ఆరోగ్య పరీక్షల సౌకర్యాన్ని, 102 కాల్ సెంటర్‌ను, టెలీ మెడిసిన్, త ల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ పథకాలను ముఖ్యమంత్రి ఏలూరు ప్రభుత్వాసుపత్రి నుంచి లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం విలేకరులతో మాట్లాడతారు. సాయంత్రం 4.45 గంటలకు ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు చేరుకుని మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఏలూరు ఇండోర్ స్టేడియం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి విజయవాడ వెళతారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి కామినేని శ్రీనివాస్ పాల్గొంటారు.
ARMY FIGHTER FORMAL SHIRTS 3SHIRTS ONLY RS.1000/- ONLY HURRY 

OFFER TODAY AND TOMMAROW ONLY PLS VISIT::http://www.freshdeals365.com/

FOR MORE COLOURS Whats Ap MAHESH::9966392211