Menu

Friday, January 29, 2016

4 గంటల్లో 23 సార్లు ఆగిన గుండె....!!


కొచ్చి :
ఆయన వయసు 60 ఏళ్లు. ఎంచక్కా తన ఏడేళ్ల మనవడితో కలిసి క్రికెట్ ఆడుకుంటున్నారు. అయితే ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. ఆయనకు కేవలం 4 గంటల వ్యవధిలో 23 సార్లు గుండె ఆగింది. అయినా తట్టుకుని నిలబడ్డారు!! విపరీతంగా సిగరెట్లు కాల్చే అలవాటున్న ఆ పెద్దాయన గుండెల్లో బాగా నొప్పిగా ఉందని చెప్పినప్పుడు.. ఆయన్ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి ఈసీజీ తీయిస్తే, గుండెపోటు వచ్చినట్లు తేలింది. ఆయనకు చికిత్స చేసేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించకపోగా.. పదేపదే చాలాసార్లు ఆయన గుండె ఆగిపోయింది. తర్వాత ఆయనను ఆస్టర్ మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు.

తొలిసారి గుండెపోటు వచ్చినప్పుడే పెద్ద ఆస్పత్రికి తీసుకురాకపోవడంతో.. తొలి గంటలో అందించాల్సిన చికిత్స అందలేదని.. అయినా అసలు నాలుగు గంటల్లో 23 సార్లు గుండె ఆగడం చిన్న విషయం కాదని సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ అనిల్ కుమార్ చెప్పారు. స్టెంటు వేయడం ద్వారా బ్లాకు క్లియర్ చేశామని తెలిపారు. సాధారణంగా గుండెపోటు వస్తే గుండెలో ఒక భాగానికి రక్తసరఫరా ఆగుతుందని, కానీ.. ఇక్కడ ఏకంగా గుండె కొట్టుకోవడమే ఆగిందని (కార్డియాక్ అరెస్ట్) ఆయన వివరించారు. ఆయన ఇక జీవనగమనంలో వేగాన్ని తగ్గించుకోవాలని, ఇప్పుడు కేవలం 30 శాతం పంపింగ్‌తోనే గుండె పనిచేస్తోందని తెలిపారు.

No comments:

Post a Comment