యాజమాన్యంతో కుమ్మక్కై భూములు కొల్లగొట్టిన ప్రజాప్రతినిధులు
  హైదరాబాద్: చిరుద్యోగులు, సామాన్య ప్రజలు.. పైసా పైసా కూడబెట్టుకున్నారు. అధిక వడ్డీ వస్తుందనే ఆశతో అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్ చేశారు. జనం సొమ్ముతో అగ్రిగోల్డ్ యాజమాన్యం వేలాది ఎకరాలను కొనుగోలు చేసింది. ఎన్నో ఆస్తులను కూడబెట్టింది. చివరకు డిపాజిట్‌దారులకు డబ్బు చెల్లించకుండా చేతులెత్తేసింది. తమకు న్యాయం చేయాలని బాధితులంతా హైకోర్టును ఆశ్రయించారు. వాస్తవానికైతే భూములను, ఆస్తులను అమ్మి డిపాజిట్‌దారులకు డబ్బు చెల్లించాలి. మరి విక్రయించడానికి ఆ భూములన్నీ అగ్రిగోల్డ్ యాజమాన్యం చేతుల్లోనే ఉన్నాయా? లేవనే సమాధానం చెప్పక తప్పదు. (చదవండి: 70 ఆస్తుల వివరాలు దాచిపెట్టారు)

నేతల గుప్పిట్లోకి విలువైన భూములు
డిపాజిటర్ల నెత్తిన శఠగోపం పెడుతూ అగ్రిగోల్డ్ యాజమాన్యంతో కుమ్మక్కైన ప్రభుత్వ కీలక నేతలు ఆ సంస్థకు చెందిన విలువైన ఆస్తులను ఎప్పుడో కాజేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఆస్తులను జప్తు చేస్తారన్న సమాచారం అందుకున్న ఓ కేంద్ర మంత్రి, కొందరు రాష్ట్ర మంత్రులు, టీడీపీ ప్రజాప్రతినిధులు అగ్రిగోల్డ్ ఆస్తులను అందినకాడికి దోచేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేయడానికి సరిగ్గా 32 రోజుల ముందు 14.81 ఎకరాల భూమిని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సొంతం చేసుకున్నారు. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) పరిధిలో 156.92 ఎకరాలను ఓ కేంద్ర మంత్రి తన అధీనంలోకి తీసుకున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అగ్రిగోల్డ్‌కు చెందిన విలువైన భూములను కీలక ప్రజాప్రతినిధులు, నేతలు తమ గుప్పిట్లో ఉంచుకున్నారు. ఆస్తులను జప్తు చేయడానికి ముందే అగ్రిగోల్డ్ ఆస్తులను 70 మంది పేర్లపై బదలాయించినట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడి కావడమే ఇందుకు తార్కాణం.

ఇతర రాష్ట్రాల్లోని ఆస్తులకు మినహాయింపు
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులకు న్యాయం చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు పదే పదే హామీలు ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చాక ఆ సంస్థ ఆస్తులపై కన్నేశారు. ప్రభుత్వ పెద్దలు తమకు సన్నిహితుడైన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారా అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని లొంగదీసుకున్నారు. విజయవాడ-గుంటూరు జాతీయ రహదారికి సమీపంలో 83.15 ఎకరాల్లో విస్తరించిన రూ.415 కోట్లకుపైగా విలువ చేసే ‘హాయ్‌ల్యాండ్’ను ఆ సంస్థ నుంచి చేజిక్కించుకున్నారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. అగ్రిగోల్డ్ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తు తీరును హైకోర్టు తప్పుపట్టింది. న్యాయస్థానం నాలుగుసార్లు మొట్టికాయలు వేయడంతో చేసేది లేక ఇతర రాష్ట్రాల్లోని అగ్రిగోల్డ్ ఆస్తులను మినహాయించి, ఏపీలో ఆ సంస్థకు చెందిన 16,587.81 ఎకరాలను ప్రభుత్వం జప్తు చేసింది.

అరెస్టులు చేయకుండా ఒత్తిళ్లు
అగ్రిగోల్డ్ యాజమాన్యంతో కుదిరిన ఒప్పందం మేరకు వారిని కేసుల బారి నుంచి రక్షించి.. ఆ సంస్థ ఆస్తులను కొల్లగొట్టేందుకు ప్రభుత్వ పెద్దలు వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఈ కేసులో సీఐడీ  దర్యాప్తు చేయకుండా అడుగడుగునా అడ్డుపడ్డారు. సీఐడీ తీరుతో విసుగెత్తిపోయిన అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, ఏజెంట్లు హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని అరెస్టు చేసి, బ్యాంకు ఖాతాలను జప్తు చేసి, ఆస్తులను విక్రయించి డిపాజిటర్లకు న్యాయం చేయాలని గతేడాది ఫిబ్రవరిలో సీఐడీని హైకోర్టు ఆదేశించింది. అగ్రిగోల్డ్ యాజమానులు విచారణకు సహకరిస్తున్నారని, వారిని అరెస్టు చేయాల్సిన అవసరం లేదంటూ సీఐడీ అధికారులు హైకోర్టుకు వివరించారు. ప్రభుత్వ కీలక నేతల ఒత్తిడి మేరకే అగ్రిగోల్డ్ యాజమాన్యం అరెస్టులో జాప్యం చేశారని డిపాజిటర్లు ఆరోపించారు. హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో యాజమాన్యాన్ని అరెస్టు చేయకుండా, అగ్రిగోల్డ్ ఆస్తులను 2015 ఫిబ్రవరి 20న జప్తు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వందలాది ఎకరాలు పరాధీనం

► అగ్రిగోల్డ్ ఫార్మ్స్, ఎస్టేట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఆస్కా లీజర్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ.
► ఆస్కా లీజర్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పూర్తిస్థాయి డెరైక్టర్ కనుకొల్లు ఉదయ్ దినకర్ పేరుతో ప్రకాశం జిల్లా సంతమాగలూరు మండలం గురిజేపల్లిలో 104/1, 104/2, 104/3, 104/4, 104/5, 104/6, 103/2, 101/1 సర్వేనెంబర్లలో 14.81 ఎకరాల భూమి ఉంది. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కళ్లు పడ్డాయి. అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేయడానికి  సరిగ్గా 32 రోజుల ముందు.. అంటే 2015 జనవరి 19న ఆ భూమిని తన భార్య ప్రత్తిపాటి తేనే వెంకాయమ్మ పేరుతో ఎకరం రూ.4.04 లక్షల చొప్పున కొనుగోలు చేసినట్లు ఒప్పంద పత్రం రాసుకున్నారు. ఆ భూములను అగ్రిగోల్డ్ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి ప్రత్తిపాటి సొంతం చేసుకున్నారని డిపాజిటర్లు ఆరోపిస్తున్నారు.
► సీఆర్‌డీఏ పరిధిలో కృష్ణా జిల్లా నూజివీడు మండలం రామన్నగూడెంలో 110.65 ఎకరాలు, వీరులపాడు మండలం చత్నవరంలో 56.27 ఎకరాలు.. మొత్తం 166.92 ఎకరాల భూమిపై ఓ కేంద్ర మంత్రి కన్ను పడింది. అగ్రిగోల్డ్ యాజమాన్యంతో కుమ్మక్కై ఆ భూమిని తన అధీనంలోకి తీసుకున్నారు.
► కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో అగ్రిగోల్డ్‌కు చెందిన వందలాది ఎకరాలను అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు సొంతం చేసుకున్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొల్లగొట్టడం ముగిశాక సంస్థ భూములను జప్తు చేస్తూ 2015 ఫిబ్రవరి 20న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఐదుగురే అరెస్టు

హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో కొద్దిరోజుల క్రితం అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావుతోసహా ఐదుగురిని అరెస్టు చేశారు. మరో తొమ్మిది మందికిపైగా డెరైక్టర్లను ఇప్పటికీ అరెస్టు చేయలేదు. అగ్రిగోల్డ్ అనుబంధ సంస్థ డెరైక్టర్ కనుకొల్లు ఉదయ్ దినకర్‌ను కూడా అరెస్టు చేయలేదు. ఆయన నుంచే మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భూములు దక్కించుకోవడం గమనార్హం. ఓ కేంద్ర మంత్రి ఒత్తిడి మేరకు అగ్రిగోల్డ్‌కు చెందిన ఇద్దరు కీలక డెరైక్టర్లను సీఐడీ అరెస్టు చేయడం లేదని డిపాజిటర్లు ఆరోపిస్తున్నారు. వారు సంస్థ ఆస్తులను ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే తమకు న్యాయం జరగదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

Post a Comment

Powered by Blogger.