అగ్రిగోల్డ్‌తో అధికార పార్టీ కీలక నేతల దోపిడీ బంధం
అందుకే ఆ సంస్థ యాజమాన్యం అరెస్టుల్లో ఆలస్యం
ఈలోగా అగ్రిగోల్డ్ ఆస్తులు ఆ కీలక నేతల అధీనంలోకి..
ఎన్నికల ముందు మదుపుదారులకు న్యాయం చేస్తామని హామీ
అధికారంలోకి వచ్చాక డీల్ సెట్ చేసుకున్న నేతలు
కిరణ్ ప్రభుత్వ హయాంలోనూ అగ్రిగోల్డ్‌కు బాసటగా ఓ ఎమ్మెల్యే
 
హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఫార్మ్ ఎస్టేట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ. 30 వేల కోట్లకుపైగా ఉన్న స్థిర, చరాస్తులు ఏమయ్యాయి? విపక్షంలో ఉన్నప్పుడు మదుపుదారులకు మద్దతుగా ఉద్యమాలు చేసిన టీడీపీ.. అధికారం చేపట్టాక అగ్రిగోల్డ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేమిటి? 32 లక్షల మంది మదుపుదారుల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన సర్కారు ఉదాసీనంగా వ్యవహరించడంలో మర్మమేమిటి? అన్న ప్రశ్నలకు అగ్రిగోల్డ్ యాజమాన్యంతో అధికారపక్ష నేతల ‘కుమ్మక్కు’ సంబంధాలే కారణమని సమాధానం వినిపిస్తోంది.

ప్రభుత్వ కీలకనేతల తరఫున ఓ సీనియర్ పోలీసు అధికారి అగ్రిగోల్డ్ యాజమాన్యంతో భేరసారాలు జరిపి.. డీల్ సెట్ చేశారనే అభిప్రాయం పోలీసు వర్గాల నుంచి తెలుస్తోంది. హైకోర్టు కన్నెర్ర చేయడంతో ఇటీవల అగ్రిగోల్డ్ చైర్మన్‌తో పాటు మరో నలుగురిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఈలోగా అగ్రిగోల్డ్ స్థిర, చరాస్తుల్లో సింహభాగం ప్రభుత్వ కీలకనేతల అధీనంలోకి వెళ్లాయనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి.
 
అగ్రిగోల్డ్ ప్రస్థానం.. పతనం
విజయవాడ కేంద్రంగా 1995లో అవ్వా వెంకట రామారావు అగ్రిగోల్డ్ ఫార్మ్ ఎస్టేట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను ప్రారంభించారు. మదుపుదారుల నుంచి ప్రతి నెలా డిపాజిట్లు సేకరించి.. వాటిని రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టేవారు. అలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో 32 లక్షల మంది మదుపుదారులు నుంచి రూ. 6,850 కోట్ల మేర డిపాజిట్లు సేకరించారు. ఆ డబ్బుతో అగ్రిగోల్డ్ ఇన్‌ఫ్రా, అగ్రిగోల్డ్ ఫార్మ, అగ్రిగోల్డ్ పవర్ ప్రాజెక్ట్స్‌ను ప్రారంభించారు. 2012 నవంబర్ వరకూ మదుపుదారులకు గడువు తీరేలోగా డిపాజిట్లను చెలిస్తూ వచ్చారు.

ఆ తర్వాత గడువు తీరినా డిపాజిట్లను యాజమాన్యం చెల్లించలేక పోయింది. భూములు కొన్నామని.. వాటిని అమ్మాక డబ్బులు చెల్లిస్తామంటూ పోస్టు డేటెడ్ చెక్‌లతో మదుపుదారులను మభ్యపెడుతూ వచ్చింది. ఆ చెక్‌లు కూడా చెల్లకపోవడంతో 2013లో అగ్రిగోల్డ్ మదుపుదారులు భారీ ఎత్తున ఆందోళనలు చేశారు. అప్పటి కిరణ్ సర్కారులో, సీఎంకు సన్నిహితంగా ఉండే ఓ ఎమ్మెల్యే అగ్రిగోల్డ్‌కు బాసటగా నిలిచారు. ఆ శాసనసభ్యుడి ఒత్తిడి మేరకు అగ్రిగోల్డ్ యాజమాన్యంపై కిరణ్ సర్కారు చర్యలు తీసుకోలేకపోయింది.

ప్రభుత్వ తీరుకు నిరసనగా అప్పట్లో టీడీపీ నేతలు దేవినేని ఉమా, బొండా ఉమా తదితరులు ఉద్యమాలు చేశారు. ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు అగ్రిగోల్డ్ మదుపుదారులకు న్యాయం చేస్తానంటూ హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్ మదుపుదారుల ప్రయోజాలను పరిరక్షించడంలో పూర్తిగా విఫలమయ్యారు.
 
సీనియర్ ఐపీఎస్ రాయ‘భేరం’
టీడీపీ అధికారం చేపట్టాక ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తోన్న నేతలు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని అగ్రిగోల్డ్ యాజమాన్యంతో భేరసారాలకు పురమాయించారు. స్థిర, చరాస్తుల్లో సింహభాగాన్ని వాటాగా ఇస్తే కేసుల నుంచి పూర్తిగా రక్షిస్తామంటూ ఆ కీలక నేతలు ఇచ్చిన హామీకి అగ్రిగోల్డ్ యాజమాన్యం అంగీకరించింది. డీల్ కుదరడంతో ఆ మేరకు స్థిర, చరాస్తులను ఆ కీలక నేతలకు అప్పగించింది. వాటిని బినామీ పేర్లతో కీలక నేతలు ఇప్పటికే సొంతం చేసుకున్నారు.

ఇది పసిగట్టిన మదుపుదారులు అగ్రిగోల్డ్ మోసంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ  ఆగస్టు, 2015లో ఉమ్మడి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. దీంతో భయపడ్డ కీలక నేతలు ముందు జాగ్రత్తగా తమ చెప్పుచేతుల్లో ఉండే సీఐడీకి దర్యాప్తు బాధ్యతలను అప్పగించారు. అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ఆదిలోనే సీఐడీ అధికారులు అరెస్టు చేసి ఉంటే.. స్థిర, చరాస్తులు భారీగా అందుబాటులో ఉండేవి. వాటి ద్వారా మదుపుదారులకు చెల్లింపులు చేసే అవకాశమూ ఉండేది. కానీ.. ప్రభుత్వ కీలకనేతల ఒత్తిళ్లతో అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని అరెస్టు చేయడంలో సీఐడీ అధికారులు విఫలమాయ్యారని మదుపుదారులు ఆరోపిస్తున్నారు.
 
ఎట్టకేలకు అరెస్టులు..
పశ్చిమ గోదావరిజిల్లా పెదపాడు మండలం వడ్డిగూడేనికి చెందిన ఘంటసాల వెంకన్నబాబు వేసిన కేసులో ఎట్టకేలకు వారం క్రితం అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకటరామారావు, ఎండీ శేషు నారాయణరావులను అరెస్టు చేశారు. రెండు రోజల క్రితం వైస్ చైర్మన్ సదాశివవరప్రపాద్, డెరైక్టర్లు కామిరెడ్డి శ్రీరామచంద్రరావు, లాల్ అహ్మద్ ఖాన్‌లను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. సీఐడీ అధికారులు అరెస్టు చేసే నాటికి అగ్రిగోల్డ్ యాజమాన్య ఖాతాలో రూ. ఆరు లక్షల నగదు మాత్రమే ఉండటం గమనార్హం. ప్రభుత్వ కీలక నేతలు ఒత్తిడి చేయకపోతే మొదట్లోనే అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకుని.. ఆస్తులను రికవరీ చేసి, మదుపుదారులకు న్యాయం చేసే వారమని సీఐడీ విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో చెప్పారు.
 
ఎవరీ అవ్వా వెంకట రామారావు?
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం అల్లూరుకు చెందిన అవ్వా వెంకటరామారావు ఎంబీఏ ఉత్తీర్ణులయ్యారు. ఆది నుంచి ఆకర్షణీయ పథకాలతో ప్రజలను మస్కా కొట్టించడంలో ఆరితేరిన ఆయన 1984 నుంచి అనేక ఆర్థిక సంస్థల్లో పనిచేశారు. ఆ సంస్థలన్నీ మూతపడటంతో 1989లో చండీగఢ్ కేంద్రంగా గోల్డెన్ ఫారెస్ట్ ఇండియా లిమిటెడ్ సంస్థలో మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టారు. తక్కువ మొత్తంతో ఎక్కువ రాబడి చూపుతామంటూ ఆకర్షణీయ పథకాలతో ఆ సంస్థ రూ. నాలుగు వేల కోట్లకుపైగా డిపాజిట్లను సేకరించి బోర్డు తిప్పేసింది.

గోల్డెన్ ఫారెస్ట్ ఇండియా లిమిటెడ్‌లో దోచుకున్న సొమ్ముతోనే అవ్వా వెంకటరామారావు విజయవాడలో అగ్రిగోల్డ్ సంస్థలను ఏర్పాటుచేసి వేల కోట్ల రూపాయల డిపాజిట్లను సేకరించారు. ఆ డబ్బులతో భారీ ఎత్తున స్థిర, చరాస్తులు కొనుగోలు చేశారు. 2014 నాటికి వాటి మార్కెట్ విలువ రూ.30 వేల కోట్లకుపైగా ఉంటుందని ఒకానొక సందర్భంలో అవ్వా వెంకటరామారావే ప్రకటించారు.


When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

Post a Comment

Powered by Blogger.