♦ 22 నెలల్లో రూ. 44 వేల కోట్ల అవినీతి
♦ నెలకో కుంభకోణమే నారావారి ప్రగతి
♦ గత తొమ్మిదేళ్ల ఆర్జన కలిపితే రెండులక్షల కోట్లుపైనే...
 
 సాక్షి ప్రత్యేక ప్రతినిధి:
 వేలికి ఉంగరం లేని మాట నిజం..
 చేతికి వాచీ లేని మాటా నిజం..
 జేబులో రూపాయి పెట్టుకోరన్నమాటా నూటికి నూరుపాళ్లు నిజమే కావచ్చు...
 కానీ సమస్య వాచీ ఉంగరాలది కాదు బాబూ.. వెనకేసిన వేలకోట్లకు సంబంధించిం ది. ఎవరో ఒకరిద్దరు అంటున్నది కాదు.. రాష్ర్టమంతా కోడై కూస్తోంది. ఈ 22 నెలల్లో మీరు జారీ చేసిన అవినీతి జీవోలు, మీ డెరైక్షన్‌లో ‘చినబాబు’ చేసిన వసూళ్ల గురించి రాష్ర్టప్రజలు చర్చించుకుంటున్నారు. 22 నెలల్లో మీరు దాదాపు 44 వేల కోట్ల రూపాయలు ఆర్జించడం నిజం కాదా? పట్టిసీమ నుంచి గాలేరు-నగరి వరకు, ఇసుక దందాల నుంచి డిస్టిలరీల డిస్ట్రిబ్యూషన్ వరకు మీ వసూళ్లకు ఆకాశమే హద్దు కదా బాబూ? ఇదంతా మీ తాజా ఆర్జన మాత్రమే.. గత తొమ్మిదేళ్ల పాలనలో మీరు వెనకేసిందంతా కలిపితే మీ అక్రమార్జన లెక్క రెండు లక్షల కోట్లను దాటడం నిజం కాదా? సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం నోటివెంట ఈ రెండు లక్షల కోట్ల లెక్క ఎలా బైటకొచ్చింది? ఆయన ఒకప్పుడు మీ పార్టీలో మిమ్మల్ని, మీ చాకచక్యాన్ని అత్యంత సన్నిహితంగా చూసిన నాయకుడు కాబట్టే కదా? మీ రాజకీయ జీవితం ప్రారంభమైంది రెండెకరాలతోనే కదా..? అది కూడా మీ తండ్రిగారైన ఖర్జూరనాయుడిది కాదని... మీ తల్లిగారికి పసుపుకుంకుమల కింద వచ్చిందేనని నారావారిపల్లెలో ఎవరినడిగినా చెబుతారు.. మరి ఈ రెండెకరాలతో రెండు లక్షల కోట్లెలా సంపాదించారు బాబూ? ఇక పక్క జిల్లాకు వెళ్లాలన్నా మీరు ఉపయోగిస్తున్న ప్రత్యేక హెలికాప్టర్లు.. పదేపదే ఢిల్లీ టూర్లకు, విదేశీ విహారాలకు వాడుతున్న ప్రత్యేక విమానాలు.. మీ రెంత డబ్బున్న మారాజులో చెప్పకనే చెబుతున్నాయి. ఇక మీ కార్యాలయాలు, ఇళ్ల  సోకుల కోసం చేస్తున్న దుబారా.. కొత్త రాజధానిలో అక్రమస్థలంలో మీ నివాసం మీ నీతిమంతమైన జీవితాన్ని ఆవిష్కరిస్తుంది..

 ఎమ్మెల్యేలను కొనే అవినీతి లెగసీ...
 లెగసీ గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా అని ఓసారి వెనక్కు చూసుకోవాల్సింది. అయినా మన లెగసీ గురించి మనం చెప్పుకోవడమేమిటి? ఆ విషయం జనం కదా చెప్పాల్సింది. ఎవరి లెగసీ ఏమిటో ప్రజలకు బాగా తెలుసు. డబ్బు, పదవులు ఎరవేసి, నియోజకవర్గ నిధుల ఆశచూపి ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొనడమే లెగసీనా? 67 మంది ఎమ్మెల్యేలున్న ఓ రాజకీయ పార్టీ నుంచి ముగ్గురో నలుగురో ఎమ్మెల్యేలను ఆకర్షించడం ఏదో గొప్ప ఘనకార్యమా? మిగతావారంతా ప్రతిపక్షపార్టీలోనే ఉండడం నిజం కాదా? జనంలో మీ విశ్వసనీయత పూర్తిగా అడుగంటింది. అందుకే మీరెంత ప్రలోభపెట్టాలని చూసినా ఎమ్మెల్యేలు విచక్షణ కోల్పోలేదు. పక్కరాష్ర్టంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకి రూ.5 నుంచి రూ.20 కోట్ల వరకు ఇచ్చి కొనడానికి ప్రయత్నించిన చరిత్ర మీది. ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని దేశమంతా ఛీకొట్టిన లెగసీ మీది. ఇక ‘చినబాబు’ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇంటర్మీడియెట్ అత్తెసరు మార్కులతో గట్టెక్కిన ‘ఇంటెలిజెంట్’ స్టుడెంట్‌కు స్టాన్‌ఫోర్డ్ సీటు ఎలా లభించిందో ప్రపంచానికి తెలియదా? ‘సత్యం’ చదివింపులే లెగసీనా? జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఒక్కసీటు.. రాజకీయాల్లో చినబాబు లెగసీకి అద్దం పడుతుంది.

 మీ జమానా అవినీతి ఖజానా కదా!
 అవినీతికి పర్యాయపదం చంద్రబాబు అన్న సంగతిని వామపక్ష పార్టీలు ఎప్పుడో సిద్ధాంతీకరించాయి. పాత తొమ్మిదేళ్ల సంగతలా ఉంచితే తాజాగా ఈ 22 నెలల్లో అవినీతి విశ్వరూపాన్ని మీరు ఆవిష్కరించారు. నెలకో అవినీతి వ్యవహారం చొప్పున మీ కుంభకోణాల పురాణం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒకటా రెండా అనేక స్కాములు.. అవినీతి దందాలు.. అయినవారికి, కమీషన్లిచ్చే బడాబాబులకు దోచిపెడుతూ మీరు జారీ చేసిన నయవంచక జీవోలు, నిర్ణయాలు అందుకు నిదర్శనం. వాటిలో ముఖ్యమైన కొన్నింటిని పరిశీలిద్దాం..

 పట్టిసీమ కుంభకోణం: చంద్రబాబు అడ్డంగా దొరికిపోయిన కుంభకోణం ఇది. పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో నిబంధనలకు విరుద్ధంగా 21.9 శాతం ఎక్సెస్ ఇవ్వడమే కాక గడువులోగా పూర్తి చేస్తే కాంట్రాక్టర్‌కు అదనంగా 16.9శాతం చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ. 1400 కోట్ల ప్రాజెక్టులో సగం పైగా దోచుకున్న మాట వాస్తవం కాదా?

 జీవో 22తో ధనయజ్ఞం: చంద్రబాబు ధనయజ్ఞాన్ని కళ్లకు కట్టే జీవో ఇది. జలయజ్ఞం ప్రాజెక్టు పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు అడగకుండానే వరాలిచ్చారు. 2013 నుంచి ఇనుము, సిమెంట్‌ధరల్లో పెరుగుదల తీసుకోండి.. అది కూడా 2013 నుంచి ఎంతైందో అంతా తీసుకోండి అంటూ ఈ జీవో జారీ చేశారు. రూ. 20 వేల కోట్ల స్కామ్‌ఇది. కాంట్రాక్టర్ల నుంచి భారీగా పర్సంటేజీలు మెక్కడానికి జారీ చేసిన జీవో ఇది. 2014 డిసెంబర్ 31న ప్రతిపాదనలు పెడితే 2015 జనవరి 1న అంటే ఒక్క రోజులో జీవో పుట్టుకొచ్చిందంటేనే అర్ధమౌతుంది ఎంత పవిత్రమైనదో...

 బెరైటీస్ కొల్లగొట్టే జీవో: వైఎస్‌ఆర్ జిల్లా మంగంపేట ప్రాజెక్టులోని బెరైటీస్ ఖనిజం లీజులను ప్రైవేట్‌పరం చేయడానికి, అయినవారికి అప్పగించడానికి జీవో 163 తీసుకురావడం నిజం కాదా? టెండర్లలో పాల్గొనే సంస్థలకు 30 నుంచి 35శాతం లాభం ఉండేలా నిబంధనలను సడలించారు. బడా కాంట్రాక్టర్లతో కుమ్మక్కు అయిన కారణంగానే ఈ జీవో పుట్టుకొచ్చినమాట వాస్తవం కాదా?

 ‘చినబాబు’కు కమీషన్ల కోసమే రాయితీలు: బడా పారిశ్రామిక వేత్తలకు వేల కోట్ల రూపాయల మేర రాయితీలు ఇచ్చేందుకు వెంటవెంటనే మూడు జీవోలు ఎందుకు జారీ చేశారో తెలియని విషయమా? రాయితీలు విడుదల చేస్తే చినబాబుకు 30 శాతం కమిషన్లు నేరుగా అందేలా డీల్ కుదరడం వల్లనే కదా ఈ జీవోలు పుట్టాయి? ఈ డీల్‌లో బాబుగారి కుటుంబానికి రూ.700 కోట్లు దక్కాయని పరిశ్రమల శాఖలో అధికారులు వ్యాఖ్యానించడం నిజం కాదా?

 కొత్త డిస్టిలరీలెందుకు బాబూ?: రాష్ర్టంలో ప్రజలకు తాగడానికి మద్యం చాలడం లేదంటూ మరింత మద్యం ఉత్పత్తి చేయండి అంటూ జీవో 369 జారీ చేయలేదా?  ఉన్న బెల్టుషాపులు యథాతథంగా కొనసాగిస్తూ మద్యం ఉత్పత్తిని మరింతగా పెంచడం కోసం 4 కంపెనీలకు కొత్తగా అనుమతులు జారీ చేశారు. 12 సంస్థలు దరఖాస్తు చేసుకుంటే కేవలం నాలుగు డిస్టిలరీకు మాత్రమే అనుమతులివ్వడం వెనక ‘కోట్ల’ సందేహాలుండడం నిజం కాదా? ఆ జీవోపై మీరు స్వయంగా సంతకం చేయడం వల్ల ఈ సందేహాలు మరింత పెరగడం వాస్తవం కాదా?

 ఇసుక దందాల్లోనూ కమిషన్లు: రాష్ర్టంలో ఇసుక మాఫియాను తయారు చేసిందెవరు బాబూ? డ్వాక్రా మహిళల పేరుతో తెరవెనుక చక్రం తిప్పింది తమ్ముళ్లేగా.. వారి నుంచి నేరుగా చినబాబుకు కమీషన్లు అందడం బహిరంగ రహస్యమేగా? అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులే ఇసుక మాఫియాగా తయారవడం, దాదాపు రూ.1500 కోట్లకు పైగా నొక్కేయడం నిజంకాదా? ఇసుక వ్యవహారాలపై మీ సర్కారుకు హైకోర్టు తలంటడం వాస్తవం కాదా?

 గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్లకు నజరానా: ప్రజలకు ఎలాంటి ప్రయోజనమూ లేకపోయినా గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలకు రూ. 2,300 కోట్ల మేర లబ్ధి చేకూర్చడం కోసం జీవో 182 జారీ చేయలేదా? ఈ కంపెనీలకు ఇస్తున్న వ్యాట్ రాయితీ మొత్తం ఇది. ఇందులో మీకు ఎంత వాటా లేకపోతే ఖజానాకు ఇంత నష్టం జరగడానికి మీరు అనుమతిస్తారు?

 ఇద్దరు సీఎస్‌లు వద్దన్నా...: గాలేరు-నగరి, హంద్రీనీవా ప్రాజెక్టుల్లో అంచనాల పెంపు ప్రతిపాదనలపై సంతకం చేయడానికి ఇద్దరు ప్రభుత్వ ప్రధానకార్యదర్శులు (సీఎస్‌లు) నిరాకరించినా రెండుసార్లు మంత్రివర్గం ఆమోదించడం నిజం కాదా? దాదాపు రూ. 6వేల కోట్ల కుంభకోణం ఇది. ఇరిగేషన్‌లో మీరు సాగిస్తున్న అవినీతి కుంభకోణాలకు ఇది ప్రత్యక్ష నిదర్శనం. అసలు సీఎస్ నిరాకరించినా ఆయనకు తెలియకుండా కేబినెట్ ముందుకు రావడం, కేబినెట్ ఆమోదించడం చూస్తేనే ఇందులో ఎంత అవినీతి ఇమిడి ఉందో అర్ధమౌతోంది. రెండుసార్లు కేబినెట్ చేత ఆమోదింపజేశారంటేనే అందులో మీకెంత ప్రయోజనం ఉందో తెలుస్తూనే ఉంది.
 
  దుబారా రూ.200 కోట్లకు పైనే
 ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి  ప్రత్యేక విమానాలకు, కార్యాలయాల సోకులకు, ప్రచార ఆర్భాటాలకు చంద్రబాబు  రూ. 200 కోట్లకు పైగా వెచ్చించారు. ప్రత్యేక విమానాల్లో ప్రయాణించడంలో చంద్రబాబు రికార్డు సృష్టించారు. దేశంలోని ఏ ముఖ్యమంత్రి కూడా ఈ తరహాలో ప్రత్యేక విమానాల్లో తిరిగిన దాఖలాలు లేవు. హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లాలన్నా..  జిల్లాల నుంచి హైదరాబాద్‌కు రావాలన్నా..  ఢిల్లీ వెళ్లాలన్నా  ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలోనే ప్రయాణిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ముఖ్యమంత్రి ప్రత్యేక విమానాల ఖర్చులకు ఆర్థిక శాఖ గతంలోనే రూ.15 కోట్లు చెల్లించింది.  మరో రూ. 15 కోట్లు చెల్లించాల్సి ఉంది.  హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కార్యాలయం కోసం లేక్‌వ్యూ అతిధి గృహానికి 10 కోట్ల రూపాయలను ఖర్చు చేయగా, మదీనాగుడా ఫాం హౌస్, జూబ్లిహిల్స్‌లోని అద్దె ఇళ్లకు ఏర్పాట్లు చేయడానికి 5.87 కోట్ల రూపాయలు వ్యమైంది. 

జిల్లాల పర్యటనలకు, ఢిల్లీ, సింగపూర్ పర్యటనలకు రెగ్యులర్ విమానాలున్నా.. ప్రత్యేక విమానాల్లో విహరిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి  63 సార్లు ప్రయాణాలకే ఏకంగా 15 కోట్ల రూపాయలు వ్యయం చేశారు. ై హెదరాబాద్‌లోని సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయాల సోకుల కోసం, ఫర్నీచర్ కోసం ఏకంగా 45 కోట్ల రూపాయలు,  విజయవాడలోని ఇరిగేషన్ అతిధి గృహంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ సోకులు, ఏర్పాట్ల కోసం ఏకంగా 42 కోట్ల రూపాయలను వ్యయంచేశారు. కొత్త భవనం నిర్మించినా ఇంత వ్యయం కాదని, ఉన్న భవనానికి ఇన్ని కోట్లు పెట్టడంపై ఉద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్-విజయవాడ మధ్య  ఉన్నతాధికారులు  విమానాల్లో ప్రయాణిస్తున్నందున ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం టీఏ, డీఏలకు 120 కోట్ల రూపాయలను వ్యయం చేసింది. 

నూతన రాజధాని ప్రాంతంలో అవసరమైన డాక్యుమెంట్ల రూపకల్పన కోసం విదేశీ కన్సల్టెంట్లకు ఏకంగా రూ.150 కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నారు. నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని హంగూ ఆర్బాటాలతో నిర్వహించడంతో తాత్కాలిక ఏర్పాట్లకు 100 కోట్ల రూపాయలకు పైగా వ్యయం చేశారు.  విజన్ 2029 డాక్యుమెంట్ తయారీ బాధ్యతను మెసర్స్ ఎర్నెస్ట్ యంగ్ కన్సల్టెన్సీకి అప్పగిస్తూ 12.62 కోట్ల రూపాయలు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. విచిత్రంగా ఈ సంస్థకు 1.12 కోట్ల రూపాయలు మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా చెల్లించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల్లో అంతర్గత పర్యటనల కోసం ప్రత్యేకించి 5.50 కోట్ల రూపాయలతో అత్యాధునిక సకల సౌకర్యాలు గల ప్రత్యేక బస్సును కొనుగోలు చేశారు.
 

 సాక్షి ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సంబంధించి ఈడీ జారీ చేసినవి కేవలం మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే. ఈడీ ఉత్తర్వులను సవాలు చేస్తూ అటు హైకోర్టులోనూ, ఇటు ప్రాధికార సంస్థలోనూ అప్పీళ్లు దాఖలు చేయడం జరిగింది. ఈడీ మధ్యంతర అటాచ్‌మెంట్ ఉత్తర్వులపై న్యాయస్థానాలు స్టే ఇచ్చాయి. విచారణ న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉంది. అటాచ్‌మెంట్ ఉత్తర్వులను ఏ కోర్టూ ఇప్పటి వరకు ఖరారు చేయలేదు. మధ్యంతర అటాచ్‌మెంట్‌కు ఉత్తర్వులు ఇచ్చినంత మాత్రాన ఆస్తులు జప్తు అయినట్లు కాదు. మొత్తం కేసులో ట్రయల్ పూర్తయి శిక్ష పడిన తరువాతనే ఆస్తులు జప్తు అయినట్లు లెక్క. మధ్యంతర అటాచ్‌మెంట్ ఉత్తర్వులు ఉన్నప్పటికీ సాక్షి యథాతథంగా నడిచేందుకు వీలుగా హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్తులపై మధ్యంతర అటాచ్‌మెంట్ ఉత్తర్వులు జారీ అయినంత మాత్రాన ఆ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు కావు.
 
 ప్రతిపక్షనేత చెప్పిందేమిటి?
 ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్న అస్తవ్యస్థ పాలనపై గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు నివేదించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా చంద్రబాబు వక్రీకరించారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ జగన్ ఇలా అన్నారు... ‘‘మాకు ప్రభుత్వాన్ని పడగొట్టేంత బలం లేదు తల్లీ.... అంతమంది ఎమ్మెల్యేలు మా పక్షానికి వస్తే ముందు మీకే చెబుతాను. మీకు చెప్పిన గంటలోగా ఈ ప్రభుత్వం కూలిపోతుంది’’ అని అన్నారు. వాస్తవం ఇది కాగా.. ప్రతిపక్షనేత ప్రభుత్వాన్ని కూల్చబోతున్నారంటూ కొన్ని ఎల్లో చానళ్లలో అభూతకల్పనలు ప్రచారం కావడం గమనార్హం.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

Post a Comment

Powered by Blogger.