కుర్రాళ్లు అద్భుతంగా రాణించారు
ఫైనల్ ఓటమి నుంచి  నేర్చుకోవాలి
అండర్-19 జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్

 
ముంబై: అండర్-19 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకెళ్లిన యువ భారత్ ఆఖరి మెట్టుపై బోల్తా పడిన విషయం తెలిసిందే. అయితే టోర్నీ ఆద్యంతం ఆటగాళ్లు చూపించిన ప్రదర్శన తనకు సంతోషాన్ని కలిగించిందని కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపారు. మున్ముందు ఈ టోర్నీ వారికి మంచి అనుభవంగా ఉపయోగపడుతుందని చెప్పారు. భవిష్యత్‌లో అనేక సవాళ్లు ఎదురవుతాయని, వాటిని అధిగమించి మంచి క్రికెటర్లుగా రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉందని కుర్రాళ్లకు సూచించారు. అలాగే టోర్నీకి ముందే యువ ఆటగాళ్ల ముందు రెండు పాయింట్ల అజెండాను కోచ్ రాహుల్ ద్రవిడ్ ఉంచారు. ఒకటి.. టోర్నీలో అద్భుత ప్రదర్శన కొనసాగించడం.. మరోటి అదే జోరును భవిష్యత్‌లోనూ కొనసాగేలా చూడడం. వీటిని ఈ వర్ధమాన క్రికెటర్లు కొనసాగిస్తారని ఆశిస్తున్నట్టు చెబుతున్న రాహుల్ ద్రవిడ్ ఇంటర్వ్యూ
 
ఫైనల్ అనంతరం నిరాశలో ఉన్న కుర్రాళ్లకు ఎలాంటి సందేశాన్నిచ్చారు?
ద్రవిడ్: నిజంగా కుర్రాళ్లు ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టమే. అయితే వారికి ఈ ఓటమి కూడా పాఠంలాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ప్రతీ అనుభవం నుంచి మనం నేర్చుకోవాల్సిందే. జయాపజయాల నుంచి మనం ఎంతో కొంత నేర్చుకుంటే భవిష్యత్‌లో ఉత్తమ క్రికెటర్‌గా నిలవగలం.
 
టైటిల్ గెలిచిన వెస్టిండీస్‌పై మీ అభిప్రాయం?
విండీస్ జట్టు ప్రదర్శన నన్ను అమితంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా వారి బౌలింగ్ విభాగం. ఇద్దరు ఓపెనింగ్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌ను పాటిస్తూ మా జట్టును తీవ్రంగా ఇబ్బందిపెట్టారు. నాకౌట్స్‌లో మూడు కఠిన మ్యాచ్‌లు ఆడి వారు విజయాలు సాధిం చారు. ఇక్కడి పిచ్‌లు వారి బౌలింగ్‌కు చక్కగా సహకరించాయి.
 
భారత బ్యాట్స్‌మెన్ విండీస్ పేస్‌ను సమర్థంగా ఎదుర్కోగలిగారని భావిస్తున్నారా?
వాస్తవానికి ఈ విషయంలో విండీస్ బౌలర్లకు క్రెడిట్ దక్కుతుంది. చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు విసిరి ఇబ్బంది పెట్టారు. మ్యాచ్ మొత్తం ఒత్తిడిని పెంచారు. పరుగులు చేసేందుకు వారు సులువైన బంతులను విసిరింది లేదు. మేం 15-20 ఓవర్లలోనే చాలా వికెట్లను కోల్పోయాం. ఇది వారికి మరింత హుషారునిచ్చింది. వెనక్కి చూసుకుంటే ఆరంభంలో మేం మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సిందనిపించింది. అయినా కుర్రాళ్లు పోరాడి మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకు తేగలిగారు. ఇది నన్ను గర్వపడేలా చేసింది.
 
భారత జట్టు పోరాటపటిమపై మీ అభిప్రాయం?
గత మూడు నెలల నుంచి మేం చాలా ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కొన్నాం. భారత్.. శ్రీలంక.. వరల్డ్‌కప్‌లోనూ.. అయినా ఇలాంటి వాటి నుంచి ఎలా బయపడాలో కూడా నేర్చుకున్నాం. జట్టులో మంచి టీమ్ స్పిరిట్ ఉంది. కఠిన పరిస్థితులకు ఎదురొడ్డి నిలిచే అంకితభావం ఆటగాళ్లలో ఉంది. దురదృష్టవశాత్తూ ఫైనల్లో మాకు ఎదురైన అలాంటి పరిస్థితి నుంచి బయటపడలేకపోయాం. ఈ వికెట్‌పై 146 పరుగులు చేసి నెగ్గడం అంత సులువు కాదు. మరి కాస్త పరుగులు చేయాల్సింది.
 
సూపర్ ఫామ్‌లో ఉన్న సర్ఫరాజ్ ఆటను ఎలా విశ్లేషిస్తారు?
పరుగుల పరంగా, గణాంకాల పరంగా అతడికి ఈ టోర్నీ ప్రత్యేకమైనది. అయితే ఆరు మ్యాచ్‌ల్లో ఐదు అర్ధసెంచరీలు చేసినా వీటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. కనీసం రెండు సెంచరీలైనా చేసుండాల్సింది. ఆదివారం నాటి ఫైనల్ అతడి ఆటను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. కష్టసాధ్యమైన వికెట్‌పై 50కి పైగా పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. జట్టులోని మరికొంతమంది ఆటగాళ్లలో నైపుణ్యానికి కొదవ లేదు. ఇలాంటి టోర్నీలు వారికి మంచి అనుభవంగా ఉపయోగపడతాయి.
 
అండర్-19 జట్టుతో మీ అనుభవం?
మూడు నెలలుగా వీరితో కలిసి సాగుతున్నాను. నాలాగే వారు కూడా నా సాన్నిహిత్యాన్ని ఆస్వాదించారని భావిస్తున్నాను. కొన్ని ఆలోచనలతో పాటు నేర్చుకునేందుకు అనువైన పరిస్థితులను వారికి కల్పించాలని భావించాను. కప్ గెలుచుకోవాలనే ఇక్కడికి వచ్చాం. అది నెరవేరకపోయినా తమకు దక్కిన అనుభవాలను మున్ముందు ఉత్తమ క్రికెటర్లుగా మారేందుకు దోహదపడతాయని అనుకుంటున్నాను.
 
కుర్రాళ్ల భవిష్యత్ ఎలా ఉండబోతోంది?
ప్రతీ ఆటగాడిలో క్రికెట్ పట్ల అంకితభావం కనిపిస్తోంది. వారు మరింత ఎత్తు ఎదిగేందుకు చాలా అవకాశాలున్నాయి. అయితే అన్నింటికన్నా పెద్ద సవాల్ ఏమిటంటే ఇక వారు బాలుర క్రికెట్ కాకుండా పురుషుల క్రికెట్ ఆడాల్సి ఉంది. గతంలోనే వారికి చెప్పాను... అండర్-19లో చోటు కోసం మీకన్నా టాలెంట్ లేని వారితో పోటీ పడి జట్టులోకొచ్చారు. కానీ ఇకనుంచి రోహిత్, విరాట్ కోహ్లిలాంటి సీనియర్లతో పోటీ పడాల్సి ఉంటుందని అన్నాను. నిజంగా వారికిది సవాలే. భారత సీనియర్ జట్టులో వీరిలో అందరికీ చోటు దక్కకపోవచ్చు. దీనికోసం అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

Post a Comment

Powered by Blogger.