జట్టు ధోరణిలో మార్పొచ్చింది అనుభవం ఎంతో నేర్పింది : రోహిత్ శర్మ
భారత్ డాషింగ్‌ ఓపెనర్‌ రోహిత్ శర్మ కెరీర్‌ ఇప్పుడు ఎత్తుపల్లాలు, ఘాట్‌ రోడ్లను దాటుకుని మలుపుల్లేని రహదారిపైకెక్కిన ఫెరారీ కారులా రయ్‌మంటూ దూసుకెళ్తోంది! వాస్తవానికి గతేడాది చివర్లో రితిక సజ్‌దేను పెళ్లాడిన తర్వాత ఈ ముంబైకర్‌ కెరీర్‌ జెట్‌ స్పీడ్‌ అందుకుంది. 2016 సీజన్‌ ఆరంభంలో ఆస్ర్టేలియా పర్యటన, ఇటీవల శ్రీలంకతో సిరీస్‌లో రోహిత్ బ్యాట్‌ పరుగుల ప్రవాహాన్నే సృష్టించింది. గత తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకుని తన సామర్థ్యానికి తగిన న్యాయం చేస్తున్న ఈ డేర్‌ బుల్లెట్‌.. ఇప్పుడు ఎలాంటి బెరుకూ లేకుండా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. తానే కాదు ప్రస్తుత టీమిండియా బ్యాట్స్‌మెన్‌ ఎవరూ ప్రత్యర్థులకు భయపడే పరిస్థితి లేదని బల్లగుద్ది చెబుతున్నాడు

ఇంకా అతని ఆటతీరు, టీమిండియాలో మార్పుల గురించి రోహిత్ చెబుతున్న విశేషాలు అతని మాటల్లోనే..
అనుభవమే నేర్పింది: ఆటలో నేనిప్పుడు చూపిస్తున్న పరిణతి సహజ సిద్ధంగా వచ్చింది కాదు. అనుభవమే నాకు పాఠాలు నేర్పింది. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ పురోగతి సాధించా. మైదానంలోకి దిగిన తర్వాత పరిస్థితులను విశ్లేషించుకుని వ్యూహాలను అమలు చేయడంపైనే దృష్టి పెడుతున్నా. జట్టులో నా బాధ్యత ఏమిటి? విజయం కోసం ఏమి చేయగలనని ఎక్కువగా ఆలోచిస్తున్నా. 2012లో ఇవేమీ ఆలోచించేవాడిని కాదు. చెత్త షాట్లకు అనవసరంగా వికెట్‌ పారేసుకునేవాడిని. కానీ ఇప్పుడు జట్టు అవసరాలను తగ్గట్టుగా, జాగ్రత్తగా ఆడడం నేర్చుకున్నాను. 
ఆ ఘనతంతా బంగర్‌దే : టీమిండియా విజయాల్లో సహాయక సిబ్బంది పాత్ర అమోఘం. అలాగే టీమ్‌ డైరెక్టర్‌ రవిశాస్ర్తి కూడా ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. ఇక బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ అయితే మా కోసం నెట్స్‌లో ఎక్కువ కష్టపడతాడు. జట్టులో ఎప్పుడూ సానుకూల వాతావరణం ఏర్పరచేందుకు ప్రయత్నిస్తాడు. బ్యాట్స్‌మెన్‌తో ఎక్కువ సమయం గడుపుతాడు. భారత బ్యాటింగ్‌ విభాగం నిలకడగా రాణిస్తుందంటే ఆ క్రెడిట్‌ అంతా బంగర్‌దే. 
భయపడడం లేదు..: మా అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పే స్వేచ్ఛ జట్టులో ఉంది. అలాగే ప్రస్తుత టీమిండియా బ్యాట్స్‌మెన్‌కు భయమనేదే లేదు. బరిలోకి దిగిన తర్వాత విజయం కోసమే ఆడాలన్న ధోరణి జట్టులో స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో ఇది ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. అలాగని జనం దాన్ని అతి విశ్వాసంగా అర్థం చేసుకోకూడదు. 
ముంబై కెప్టెన్సీ మేలు చేసింది: తొమ్మిదేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్నాను. కొత్తగా జట్టులోకొచ్చిన ఎవరైనా తొలి 3-4 ఏళ్లలో నేర్చుకునే దశలోనే ఉంటారు కాబట్టి వారికి ఆట తప్ప మరో ఆలోచనే ఉండదు. అయితే అనుభవం వచ్చే కొద్దీ ఆటను జట్టు దృక్పథంతో చూడడం మొదలెడతారు. అప్పుడు జట్టు కోసం మరింత శ్రమించాలని అనిపిస్తుంది. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ కూడా నన్ను ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా తీర్చిదిద్దింది. జట్టు కోణం నుంచి ఆలోచించడం అప్పు డే నేర్చుకున్నా. ఇప్పుడు జట్టులోని చాలామందిలాగే నేను కూడా ధోనీ కెప్టెన్సీని నిశితంగా గమనిస్తున్నా. ఫలానా చోట ఫలానా సమయంలో ఫీల్డర్‌ ఉండాలా వద్దా లాంటి ప్రశ్నలతో బుర్రకు పదును పెడుతూనే ఉంటా. 
తొలి బంతిని ఎదుర్కోవడం ఇష్టం: ఇన్నింగ్స్‌లో తొలి బంతిని ఎదుర్కోవడమంటే నాకెంతో ఇష్టం. అభిమానుల కేరింతల నడుమ బౌలర్‌ క్రీజువైపు పరిగెత్తుకుంటూ వస్తుంటే.. తొలి బంతికి ఏమవుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంటుంది. ఈ అనుభూతి నాకు మరింత ఉత్తేజాన్నిస్తుంది. తొలి బంతి నుంచే నా ఆధిపత్యం కొనసాగాలని కోరుకుంటా.


When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

Post a Comment

Powered by Blogger.