గుండెలో నుంచి తన్నుకొచ్చే మాట, కళ్లతో పలికించే భావం, ఆహార్యంతో హత్తుకునే హుందాతనం.. మేళవించి వైవిధ్యమున్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు రావు రమేష్ ‘నవ్య’తో మాట్లాడారు. ‘గమ్యం’ నుంచి ‘బ్రహ్మోత్సవం’ వరకు సాగిన ప్రయాణం గురించి ఏమంటున్నారంటే..
మీ కెరీర్ ఇప్పుడు ‘బ్రహ్మోత్సవం’లా నడుస్తోంది అనుకోవచ్చా?
ఒకరకంగా ఆ ఆనందాన్నే అనుభవిస్తున్నాను. వెనక్కి చూస్తే - ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. త్రివిక్రమ్‌లాంటి దర్శకుడ్ని కలవగలమా? కోట శ్రీనివాసరావులాంటి పెద్ద నటుడితో కలిసి పనిచేయగలనా? మనసుకు నచ్చిన క్యారెక్టర్స్ దొరుకుతాయా? అనుకునేవాడ్ని. అవన్నీ ఒక్కొక్కటే నిజమవుతున్నాయిప్పుడు. నా సినిమా జీవితం వైవిధ్యంగా ముందుకు వెళుతోంది. ఇంకా ఏదో చేయాలన్న తపన ప్రతి నటుడికీ ఉన్నట్లే నాక్కూడా ఉంది. నూటికి ఎనభై మార్కులే వచ్చాయన్న వెలితి ఉన్నప్పటికీ ఈ మధ్య సంతృప్తి మాత్రం దొరుకుతోంది. ప్రస్తుతం మహే్‌షబాబు హీరోగా నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’లో నటిస్త్తున్నాను. నిన్ననే ఒక మంచి సీన్‌లో కూడా చేసొచ్చాను. మీరన్నట్టు నా కెరీర్‌కు ఇది బ్రహ్మోత్సవమే! (నవ్వుతూ).
మీ బ్యాక్‌గ్రౌండ్ (రావు గోపాలరావు కొడుకుగా) గురించి ఎక్కడా ప్రస్తావించరు ఎందుకని?
నాన్నగారి పేరు చెప్పడానికి నేను ఏదైనా గొప్ప పని చేసుండాలి కదా! రావు గోపాలరావుగారి అబ్బాయి అయినంత మాత్రన సినిమాల్లో అవకాశాలు ఇచ్చేయరు. మొహమాటానికి ఒక చిన్న పాత్ర ఇవ్వొచ్చు. ఆ తరువాత ఇమేజ్, స్టేచర్ ఉంటేనే నిలబడతాం. సినిమాల్లోకి రాకమునుపు నాలుగున్నరేళ్లు సీరియళ్లు చేశాను. ‘గమ్యం’లో అవకాశం కోసం రెండున్నరేళ్లు నిరీక్షించాను. ఏ నటుడైనా ఇలా ఒక్కొక్క బ్లాకు పాసవుతూ వెళ్లాలి తప్పిస్తే.. బ్యాక్‌గ్రౌండ్లు ఏమీ పనిచేయవు. ప్రారంభంలో ఎవరైనా సరే చచ్చినట్లు కష్టపడాల్సిందే! మరో మార్గం లేదు. సినిమా వారసత్వం ఉందని.. స్టేచర్ ఉన్న పాత్రలను రాత్రికి రాత్రి వచ్చినోడికి ఇవ్వరు. జనం ఆమోదించినప్పుడు మాత్రమే సినిమాల్లో మనకు పాస్‌పోర్టు లభించింది అనుకోవాలి. ఏ పాత్రకు అయినా యాక్సెప్టబిలిటీ అవసరం. క్రిష్ రాధాకృష్ణ ‘గమ్యం’ తీస్తున్నప్పుడు నక్సలైట్ పాత్ర కోసం అన్వేషిస్తున్నారు. సంఘం పట్ల కసి, కోపం, మంటతో రగిలిపోయేవాడు.. ఇద్దరు హీరోల మధ్యకి హఠాత్తుగా దూసుకొచ్చి గన్‌పెట్టి కథను మలుపు తిప్పగలగాలి. సరిగ్గా ఆ స్లాట్ లో నన్ను పెట్టాడు క్రిష్. నిజజీవితంలో కూడా నాలో సెన్సిబిలిటీస్ ఎక్కువ. నా మాట తీరు ఉద్వేగభరితంగా అనిపిస్తుంది. ఆహార్యమూ ఆ పాత్రకు తగ్గట్టే ఉండడంతో క్రిష్ ఆ పాత్రకు నన్ను మాత్రమే ఊహించుకున్నాడు. ఇదివరకే ఒక ఇమేజ్ ఉన్న పాత నటుడైతే ఆ సీన్ అవుట్ అవుతుందన్నది దర్శకుడి భావన. అదృష్టం కొద్దీ ‘గమ్యం’ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. నక్సలైట్‌గా వేసిన నా పాత్ర కూడా జనానికి నచ్చింది. ఒకవేళ ఆ సినిమా ఫ్లాప్ అయ్యుంటే నా కెరీర్ ఎటు వెళ్లేదో తెలియదు.
మీ నాన్న రావుగోపాలరావులో లేని లక్షణాలు మీలో ఏవైనా ఉన్నాయా?
సమాజం పట్ల, సాహిత్యం పట్ల నాన్నగారికి ఉన్న స్పష్టమైన అవగాహన, పరిజ్ఞానం నాలో ఒక శాతం కూడా లేవు. ఆయన నాస్తికుడు, లోక్‌నాయక్ జయప్రకా ష్‌నారాయణ్ అనుసరీయులు. కించిత్తు వ్యాపార ఆలోచన ఉండేది కాదు. ఇంట్లో ఎప్పుడూ గంభీరమైన విషయాలను చర్చించుకునే వాతావరణం ఉండేది. అమ్మానాన్నల సంభాషణల వల్లే నాలో థింకింగ్‌ప్రాసెస్ మొదలైంది. పుస్తకాలు చదువుకోవడం వల్ల రాలేదు. భిన్నమైన ఆలోచనలు కలిగిన పెద్దలు మా ఇంటికి తరచూ వచ్చేవారు. ఎన్‌టిఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి వంటి ప్రముఖ నటులందరికీ రావుగోపాలరావు నేటివ్ విలన్. ఆయనతోనే నేటివ్ విలన్ అన్నది పోయింది. ఎంతోమంది నటులు ఉన్నప్పటికీ రావుగోపాలరావు మెటాలిక్ వాయి్‌స తో చెప్పిన డిగ్నిఫైడ్ డైలాగులు మాత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో పదిలంగానే ఉండిపోయాయి. అలాంటి నాన్న పేరును చెడగొట్టకపోతే అదే పదివేలు.
మీ పాత్రలకు అంతర్లీనంగా ఏదో ఒక పర్పస్ ఉన్నట్లు కనిపిస్తుంది..?
ఇప్పటివరకు నాకున్న ఇమేజ్‌ను, స్టేచర్‌ను దృష్టిలో పెట్టుకుని పరిమితమైన పాత్రల్నే ఎంపిక చేసుకుంటూ వస్తున్నాను. తెర మీద నేను కనిపించగానే ‘ఇతను వచ్చాడంటే ఈ సీన్‌లో ఏదో ఒక మార్పు.. ట్విస్టు ఖాయం. ఒక మంచి మాట అయినా చెబుతాడు’ అని ప్రేక్షకులు ఆశిస్తారు. వీటన్నిటికంటే - కథను ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన ఒక స్పాట్‌లో దర్శకులు నన్ను వాడుకుంటారు. ఎనీ థింగ్ షుడ్ బీ దేర్. కాబట్టి ప్రేక్షకుల ఎక్స్‌పెక్టేషన్స్‌కు తగ్గట్టు క్యారెక్టర్ చేయకపోతే నాకు మైనస్ అవుతుంది. సినిమాకూ మైనస్ అవుతుంది. సెలెక్టివ్‌గా పాత్రలను ఎంచుకోవడానికి అదే కారణం. మొదటి నుంచి నన్ను డిగ్నిఫైడ్ జోన్‌లోనే చూపిస్తున్నారు. దర్శకులు నా మీద బరువు పెంచేస్తున్నారు. నౌ దే ఆర్ కీపింగ్ వెయిట్స్. ఆ బరువే నాకు కావాల్సింది. ప్రేక్షకులు కూడా అలాంటి బరువున్న పాత్రల్లోనే నన్ను చూడాలనుకుంటున్నారు తప్పిస్తే లూజ్‌గా ఉన్న పాత్రల్లో చూడాలనుకోవట్లేదు. ప్రత్యేకించి మన తెలుగు సినిమాల్లో ఎవడు ఏది మొదలెడితే అందులోనే వాడ్ని ఫిక్స్ చేస్తారు. ఆ ఇమేజ్‌లోనే వేరియేషన్ వెతుక్కోవాలి తప్పిస్తే.. ఇంకో జోన్‌లోకి వెళ్లడానికి కొన్నాళ్ల వరకు కుదరదు.
మీ క్యారెక్టర్స్‌కు ఇమేజ్ ఎలా బిల్డప్ చేసుకుంటూ వస్తున్నారు?
మన తెలుగు సినిమాలన్నీ ఇమేజ్ మీదే నడుస్తున్నాయిప్పుడు. తమిళనాడులోలాగ వైవిధ్యమున్న కొత్త కథలు, ప్రయోగాలతో కొత్త పాత్రల మీద ఇక్కడ నడవదు. మన సినిమా ‘లవ్, రివేంజ్’ల మీదే వెళుతోంది. అందులోనే స్ర్కీన్ ఇమేజ్‌ను బిల్డప్ చేసుకోవాలి. అప్పుడే నటుడికి లైటింగ్ ఏర్పడుతుంది. లైటింగ్ ఉంటేనే ఆ నటుడు చెప్పినదానికి ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. ఇంట్లో నుంచి బయటికి వెళ్లినప్పుడో, షాపింగ్ చేస్తున్నప్పుడో.. ఒక వ్యక్తి నా వద్దకు వచ్చి.. ‘సార్, మీరు ‘గమ్యం’లో బాగా చేశారనో, ‘కొత్త బంగారులోకం’లో ఆకట్టుకున్నారనో అంటే నాకు పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్లుంటుంది. నటుడిగా ప్రేక్షకులతో ఎంతవరకు కనెక్ట్ అవుతున్నానో అంచనా వేసుకుంటాను.
డైలాగులు చెప్పడంలో మీకొక స్పష్టమైన వ్యక్తీకరణ కనిపిస్తుంది. నాన్న స్ఫూర్తి ఉందంటారా?
చిన్నప్పుడు భాషలో తప్పు దొర్లితే నాన్న తిట్టేవారు. ఆ తప్పును అమ్మ సరిచేసేది. ఇప్పటి తరంలో బ్యాడ్ కమ్యూనికేషన్ కనిపిస్తున్నది. అన్ని సంభాషణల్ని ముక్కలు ముక్కలు చేసి సెండ్ కొట్టేసుకుంటున్నారు. ఇంగ్లీషులో మాట్లాడుతున్నప్పుడు తప్పులు దొర్లితే ఎత్తిచూపిస్తాం. అదే తెలుగు భాష మాట్లాడేప్పుడు తప్పులు దొర్లితే సరి చేయం. ఇది ఘోరం. మా ఇంట్లో ఆ పరిస్థితి ఉండేది కాదు. దాంతో నాకు తెలియకుండానే స్పష్టమైన భాషా వ్యక్తీకరణ అలవడింది. సినిమాల్లో కూడా నా డైలాగ్ డెలివరీ ప్రేక్షకులకు నచ్చింది. డైలాగులు చెప్పేటప్పుడు- భాషను నొక్కి చెప్పను. గ్రాంధికం జోలికి వెళ్లను. నటులకు పవర్‌ఆ్‌ఫసౌండ్ అవసరం. మాటను శ్రావ్యంగా చెబితే ప్రేక్షకుల దృష్టిని సులభంగా మనవైపుకు తిప్పుకోవచ్చు. అప్పుడే మనం చెప్పే ప్రతిమాట మనసులో నాటుకుంటుంది. కొందరు మాట్లాడేది వింటారు. ఇంకొందరు ‘మాట్లాడిన తరువాత’ వింటారు. అలా విన్నప్పుడు ఎదుటివాళ్లు మన భావాన్ని సగం తీసుకోవచ్చు. సగం తీసుకోకపోవచ్చు. అందుకే నేటి సినిమాల్లో ఎక్కువ డైలాగులు జ్ఞప్తికి ఉండటం లేదు. నటుడిగా భాష నాకు కలిసొచ్చింది. అది ప్రేక్షకుల మెప్పు కూడా పొందడం అదృష్టం.
బిట్వీన్ ద లైన్స్ పెర్ఫార్మెన్స్ ఎలా సాధ్యం?
‘అత్తారింటికి దారేది’లో ఒకచోట ‘‘తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది. వెళ్లిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుంది..’’ అన్న డైలాగ్ నేను చెప్పాలి. అప్పుడు త్రివిక్రమ్ నాతో ‘‘రమే్‌షగారు.. మీరు ఈ డైలాగ్‌ను చాలా లైట్‌గా చెప్పాలి. చెప్పీచెప్పనట్టు, నీలోనువ్వు చెప్పుకుంటున్నట్లున్న జోన్‌లోనే చెప్పాలి’’ అన్నారు. ఆ సీన్‌లో చిన్నగా మునిగి తేలుతూ చెప్పాను. త్రివిక్రమ్‌కు నచ్చడంతో సంతోషం అనిపించింది. ప్రేక్షకుల్లో కూడా నా పట్ల ఒక భావన ఉంది - ‘వీడు డబ్బు మదంతో రాలేదు. నాన్నపేరు వాడుకుని రాలేదు. కింది నుంచి కష్టపడి నిజాయితీగా పైకొచ్చాడు అన్న సింపతీ ఏదో నా మీద ఉందని నాకనిపిస్తుంది. నా డైలాగును అంత ఆసక్తిగా ప్రేక్షకులు వింటున్నారంటే.. పై భావన కారణం అయ్యుండొచ్చు. బిట్వీన్ ద లైన్ ఫెర్పార్మెన్స్ ఇవ్వగలుగుతున్నందుకు సంతృప్తిగా ఉంది.
తెలుగు సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ చుట్టూనే తిరుగుతోంది. ఇలాంటి ట్రెండ్‌లో నటనకు ప్రాధాన్యం లభిస్తున్నదా?
ఒకప్పుడు మంచి సినిమా చెడ్డ సినిమా అనే ఉండేవి. ఇప్పుడు పెద్ద సినిమా, చిన్న సినిమా. చిన్నసినిమా అంటే చిన్నచూపు. పెద్ద సినిమాలో హీరో తప్ప మిగిలిన వాళ్లు నటించడానికి ఏమీ ఉండదు. అన్నీ హీరోనే చేసేస్తుంటాడు. అందులోను ప్రతిదీ ఎంటర్‌టైన్ చేస్తూనే చెప్పాలి.
ఈ పరిస్థితికి కారణం ఏమంటారు?
సొసైటీ రిఫ్లెక్ట్స్ ఆన్ సినిమా. డిమాండ్‌ను బట్టి సప్లయి ఉంటుంది. సొసైటీలో కూడా అనేక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా యూతలో సోషల్‌నెట్‌వర్కింగ్, వాట్సాప్, ట్విటర్, పోర్న్.. జీవితాలను కమ్మేశాయి. పొద్దున్నుంచి రాత్రి వరకు వాట్సా్‌పలో వచ్చే చెత్తంతా మైండ్‌లో పేరుకుపోతోంది. ఆడవాళ్ల మీద, అమ్మాయిల మీద నీచమైన జోకులు. ఇరవై నాలుగ్గంటలూ ఫేస్‌బుక్కు. ఇంకో పని లేదు. ఎవరికీ దేని మీద ఫోకస్ ఉండటం లేదు. ఏదీ ఎవరికీ గుర్తుండదు. సీరియ్‌సనెస్ పోయింది. ఎవరైనా ఒక బరువైన మాట చెబితే ‘అబ్బో వీడు చంపేస్తున్నాడ్రా బాబూ’ అంటారు. రెండు నిమిషాలు మనసుపెట్టి వినే ఓపికే ఉండటం లేదు.
అన్నీ లైట్ తీసుకునే స్వభావం సినిమాల్లోను కనిపిస్తోంది..
ఏ టీవీ ఛానల్ ఆన్ చేసినా పేరడీలు, వెటకారం. విమానం నీళ్లలో పడిపోతే ఎంటర్‌టైన్‌మెంట్. ఎన్నికలంటే ఎంటర్‌టైనమెంట్. మన ఎకనమిక్స్ ఏంటి? మన ఆలోచనలు ఏంటి? అన్నవి కనిపించవు. రాజకీయనాయకులు ఒకరి మీద ఒకరు పేరడీలు, పంచ్‌లు, డైలాగ్‌లతో దుమ్మెత్తిపోసుకుంటుంటేనే ఎంటర్‌టైన్ అవుతున్నారు. భలే భలే చెప్పాడ్రా అని చప్పట్లు కొడుతున్నారు. లోతైన విశ్లేషణలతో మాట్లాడితే జనానికి నచ్చడం లేదు. క్రియేషన్ మూడు శాతమైతే, మిగిలింది కాలక్షేపం. ఒక రంగమని కాదు. అన్ని చోట్ల కామెడీ, కామెడీ! ఎవ్రీథింగ్ ప్యారసైట్స్ కమ్యూనిటీ. బ్లడ్‌ను సెర్చ్ చేసి తాగే దోమల్లాగ తయారైందీ కాలం. సొసైటీలో మంచిని బిల్డప్ చేయడం చాలా కష్టం. దాన్ని ఒక్క నిమిషంలో ప్యారడీ చేసి కిందికి దించేయడం సులభం. ఛానళ్లలో, సినిమాల్లో ఆ ప్యారడీనే రన్ అవుతోందిప్పుడు.
సినిమాల్లో హాస్యం అపహాస్యమయ్యే పరిస్థితులు ఎందుకొచ్చాయి?
బుర్రలు పాడైపోయిన జనాలకు బరువైన ఒక మంచి పాయింట్‌తో సినిమా తీస్తే- ‘‘బోర్ కొడుతోంది రా బాబూ. వీడు చెప్పింది మనం వినాలా?’’ అనే పరిస్థితి వచ్చేసింది. బయట ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రేక్షకుడ్ని ‘ఏదో ఒకటి చేసి నవ్వించాలి. ఎంటర్‌టైన్ చేయాలి’ అనే దర్శకుడు ఆలోచిస్తున్నాడు. ఈ ఒత్తిడిలో ఒక్కోసారి హాస్యం అపహాస్యం స్టేజికి చేరుకుంటోంది. ఒకప్పుడు రేలంగి చేసింది కామెడీ. రమణారెడ్డి చేసింది కామెడీ. సుత్తివేలు చేసింది కామెడీ. ఇప్పుడు సినిమాల్లో వస్తున్నది కామెడీ అనుకోలేము. కేవలం ప్యారడీ. అందుకే లెంపకాయలు తినే యాక్టర్లు మన తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తారు. కోట శ్రీనివాసరావులాంటి స్టేచర్ కలిగిన ఆర్టిస్టులు చాలా తక్కువ.
‘ముకుంద’లో నేను చెప్పిన డైలాగు ‘నీ వ్యాసార్ధం ఎంత? నీ చుట్టు కొలత ఎంత? నీ ఘనపరిమాణం ఎంత? నీ భవిష్యత్తును కుంభాకార దర్పణంలో చూడాలా? పుటాకార దర్పణంలో చూడాలా?’ అన్నది పాపులర్ డైలాగ్. ఆ చిత్ర ప్రచారంలో భాగంగా చిరంజీవిగారు వేదిక మీద ఇదే డైలాగును ప్రేక్షకులకు వినిపించినప్పుడు.. ఎంత ఆనందం కలిగిందో చెప్పలేను.
నేను తెలుగు సినిమాలు తక్కువ చూస్తాను. నాన్నగారివి కూడా సగం సినిమాలే చూశాను. నాకు ఫలానా విలన్ అనేమీకాదు కానీ రాబర్ట్ డినీరో విలనిజం అంటే ఇష్టం. తెలుగులో నాగభూషణం, కోటశ్రీనివాసరావు, ప్రకా్‌షరాజ్, సత్యరాజ్‌లు చేసిన కొన్ని సీన్లు ఇష్టం. ఫలానా నటుడు అని చెప్పలేను. ఏ నటుడైనా చిన్న క్యారెక్టర్‌లో మంచి ఎక్స్‌ప్రెషన్ ఇచ్చినా నచ్చుతుంది. ‘బెన్‌హర్’, ‘టెన్ కమాండ్‌మెంట్స్’లోని విలన్లు అప్పట్లో ఆకర్షించారు.
ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో ఏ సన్నివేశం నచ్చింది అని అడుగుతుంటారు. ఒకటని చెప్పలేను. ‘గమ్యం’, ‘కొత్తబంగారులోకం’, ‘సీతమ్మ వాకిట్లో..’, ‘అత్తారింటికి దారేది’ ఇలా దేనికదే. ఆ టైమ్‌లో అవి నచ్చుతాయంతే. ‘సీతమ్మవాకిట్లో’ మహే్‌షబాబుకు మామగా ‘ఏంట్రా బాబు వాడిని అలా వదిలేయకండ్రా చెప్పండ్రా’ అన్న డైలాగు బాగా పాపులరైన సంగతి తెలిసిందే. విదేశాల్లోని తెలుగువాళ్లకు కూడా ఆ మాట భలే నచ్చింది. ఈ ట్రెండ్‌కు తగ్గట్టు పండింది.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
Post a Comment