టెస్టుల్లో మెకల్లమ్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ
వీడ్కోలు మ్యాచ్‌లో 54 బంతుల్లోనే శతకం
వివ్‌ రిచర్డ్స్‌, మిస్బా రికార్డు బద్దలు
న్యూజిలాండ్‌ 370; ఆస్ర్టేలియా 57/1
ఆడుతోంది వీడ్కోలు టెస్టు..! పైగా అప్పటికే 32 పరుగులకే మూడు వికెట్లు పడ్డాయి..! ఈ దశలో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా జట్టును రక్షించే బాధ్యత తీసుకున్న ఎవరైనా ఆచితూచి ఆడతారు..! కానీ, అందరిలా ఆడితే అతను బ్రెండన్‌ మెకల్లమ్‌ ఎందుకవుతాడు..! అందుకే సొంతగడ్డపై ఆఖరి టెస్టు ఆడుతున్న బ్రెండన్‌ తొలి రోజే రెచ్చిపోయాడు..! బంతి పడడమే ఆలస్యం.. అయితే సిక్సర్‌ లేదంటే ఫోర్‌ అన్నట్టుగా చెలరేగాడు..! టెస్టు మ్యాచ్‌ను టీ-20లా మార్చేసిన అతగాడు ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే టెస్టు క్రికెట్‌లో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టేశాడు..! 54 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి సంప్రదాయ క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేశాడు..! బ్రెండన్‌ దెబ్బకు వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌, పాకిస్థాన్‌ ఆటగాడు మిస్బావుల్‌ హక్‌ (56 బంతుల్లో సెంచరీ) పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డు తెరమరుగైంది..! కెరీర్‌ ఆరంభం నుంచీ తాను ఎంచుకున్న విధ్వంసాన్నే వీడ్కోలు మ్యాచ్‌లోనూ చూపించిన మెకల్లమ్‌ ఇకపై తన ఆట చూడలేమని బాధపడుతున్న అభిమానులకు కలకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ను అందించాడు..!

క్రైస్ట్‌చర్చ్‌: సొంత అభిమానుల హర్షద్వానా లు... ప్రత్యర్థుల గార్డ్‌ ఆఫ్‌ హానర్‌ మధ్య క్రీజులో అడుగిడిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ (79 బంతుల్లో 21 ఫోర్లు, 6 సిక్సర్లతో 145) ప్రపంచ రికార్డు ఇన్నింగ్స్‌తో ఆఖరి మ్యాచ్‌లో తనకు తానే అద్భుత బహుమతిని ఇచ్చుకున్నాడు. ఆస్ర్టేలియాతో శనివారం మొదలైన రెండో టెస్టులో 54 బంతుల్లోనే శతకం సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. దీంతో తన ఆరాధ్య క్రికెటర్‌ వెస్టిండీస్‌ మాజీ ఆటగాడు వివ్‌ రిచర్డ్స్‌ 1986లో ఇంగ్లండ్‌పై, 2014లో ఆసీ్‌సపై పాకిస్థాన్‌ క్రికెటర్‌ మిస్బావుల్‌ (56 బంతుల్లో సెంచరీ) నెలకొల్పిన రికార్డును తుడిచేశాడు. టాస్‌ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 370 పరుగులు చేసింది. కోరె ఆండర్సన్‌ (66 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 72), వాట్లింగ్‌ (58) అర్ధ సెంచరీలతో సత్తా చాటారు. ఆసీస్‌ బౌలర్లలో నాథన్‌ లియాన్‌ మూడు, హాజెల్‌వుడ్‌, పాటిన్సన్‌, జాక్సన్‌ బర్డ్‌ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఆసీస్‌ శనివారం ఆట ముగిసే సమయానికి డేవిడ్‌ వార్నర్‌ (12) వికెట్‌ను కోల్పోయి 57 పరుగులు చేసింది. బర్న్స్‌ (27), ఖవాజ (18) క్రీజులో ఉన్నారు.

కష్టాల మధ్యలో: పిచ్‌పై పచ్చిక ఉండడంతో టాస్‌ నెగ్గిన ఆసీస్‌ కెప్టెన్‌ స్మిత కివీ్‌సను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఆరో ఓవర్లోనే ఓపెనర్‌ గప్టిల్‌ (18)ను అవుట్‌ చేసిన పాటిన్సన్‌ ఆతిథ్య జట్టుకు షాకిచ్చాడు. ఆ తర్వాత లాథమ్‌ (4), 20వ ఓవర్లో నికోలస్‌ (7) అవుటవడంతో కివీస్‌ కష్టాల్లో పడిం ది. ఈ దశలో క్రీజులోకొచ్చిన మెకల్లమ్‌ తానెదుర్కొన్న రెండో బంతినే బౌండ్రీకి తరలించి ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపాడు. 23వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 21 రన్స్‌ రాబట్టి మిచెల్‌ మార్ష్‌కు చుక్కలు చూపించాడు. పాటిన్సన్‌ వేసిన తర్వాతి ఓవర్లో రెండు బౌండ్రీలు బాదాడు. దీంతో 26 ఓవర్లకు 74/3తో కివీస్‌ లంచ్‌కు వెళ్లింది. అప్పటికి మెకల్లమ్‌ 18 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 37 పరుగులు సాధించాడు.

లంచ్‌ తర్వాత దంచేశాడు..: భోజన విరామం తర్వాత మొదటి ఓవర్లోనే కేన్‌ విలియమ్సన్‌ను మిచెల్‌ మార్ష్‌ అవుట్‌ చేశాడు. కాసేపటికే బ్రెండన్‌ కూడా అవుటవ్వాల్సింది. పాటిన్సన్‌ వేసిన 30వ ఓవర్‌ నాలుగో బంతికి మార్ష్‌ కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టాడు. అయితే రీప్లేలో పాటిన్సన్‌ నో బాల్‌ వేసినట్టు తేలడంతో మెకల్లమ్‌ ఊపిరి పీల్చుకున్నాడు. తర్వాతి బంతికే బ్రెండన్‌ ఇచ్చిన క్యాచ్‌ను బౌండ్రీ వద్ద హాజెల్‌వుడ్‌ వదిలేశాడు. ఈ అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకున్న మెకల్లమ్‌ తర్వాతి ఓవర్లో భారీ సిక్సర్‌తో హాఫ్‌ సెంచరీ (34 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. ఆ ఓవర్లో మరో రెండు బౌండ్రీలు బాదాడు కూడా. బర్డ్‌ వేసిన తర్వాతి ఓవర్లో రెండు, ఆ వెంటనే హాజెల్‌వుడ్‌ బౌలింగ్‌లో మూడు ఫోర్లు కొట్టాడు. ఆ ఓవర్‌ ముగిసేసరికి మెకల్లమ్‌ 48 బంతుల్లో 82 రన్స్‌తో నిలిచాడు. ఇక హాజెల్‌వుడ్‌ వేసిన 36వ ఓవర్లో చివరి నాలుగు బంతుల్లో (6, 4, 4, 4) 18 పరుగులు రాబట్టిన మెకల్లమ్‌ కెరీర్‌లో 12వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా దూకుడుగానే ఆడిన బ్రెండన్‌ చివరికి 46వ ఓవర్లో పాటిన్సన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మొత్తానికి జట్టు 32/3 తో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దశలో క్రీజులోకొచ్చిన బ్రెండన్‌ అవుటయ్యే సమయానికి కివీస్‌ను 253/5తో పటిష్ట స్థితిలో నిలిపాడు. బ్రెం డన్‌కు చక్కని సహకారం అందించిన ఆండర్సన్‌ 37 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకుని ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వాట్లింగ్‌ పోరాటంతో కివీస్‌ మంచి స్కోరు చేసింది.

సిక్సర్లలోనూ రికార్డు!
ఈ ఇన్నింగ్స్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన బ్రెండన్‌ టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు (106) సాధించిన బ్యాట్స్‌మన్‌గా మరో ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌కు ముందు అతను వంద సిక్సర్లతో ఆడమ్‌ గిల్‌క్రి్‌స్టతో సమంగా నిలిచాడు. ఇక కోరె ఆండర్సన్‌ (72)తో కలిసి బ్రెండన్‌ ఐదో వికెట్‌కు 179 పరుగులు (110 బంతుల్లోనే) జోడించాడు. ఈ క్రమంలో 57 బంతుల్లోనే వంద పరుగులు జోడించి టెస్టుల్లో వేగవంతమైన శతక భాగస్వామ్యం నమోదు చేశాడు. 2002లో న్యూజిలాండ్‌ క్రికెటర్లు నాథన్‌ ఆస్టల్‌-క్రిస్‌ కెయిన్స్‌ (పదో వికెట్‌) పేరిట ఉన్న రికార్డును బ్రెండన్‌-కోరె తుడిచేశారు.

స్కోరుబోర్డు
న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: గప్టిల్‌ (సి) బర్న్స్‌ (బి) పాటిన్సన్‌ 18, లాథమ్‌ (సి) స్మిత (బి) బర్డ్‌ 4, కేన్‌ విలియమ్సన్‌ 7, నికోలస్‌ (ఎల్బీ) హాజెల్‌వుడ్‌ 7, బ్రెండన్‌ మెకల్లమ్‌ (సి) లియాన్‌ (బి) పాటిన్సన్‌ 145, ఆండర్సన్‌ (సి) వోజెస్‌ (బి) లియాన్‌ 72, వాట్లింగ్‌ (సి) బర్న్స్‌ (బి) బర్డ్‌ 58, టిమ్‌ సౌథీ (సి) హాజెల్‌వుడ్‌ (బి) లియాన్‌ 5, హెన్రీ (సి) ఖవాజా (బి) లియాన్‌ 21, వాగ్నర్‌ (సి) నెవిల్‌ (బి) హాజెల్‌వుడ్‌ 10, ట్రెంట్‌ బౌల్ట్‌ (నాటౌట్‌) 14, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 65.4 ఓవర్లలో 370 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-21, 2-23, 3-32, 4-74, 5-253, 6-266, 7-273, 8-297, 9-333; బౌలింగ్‌: హాజెల్‌వుడ్‌ 18-5-98-2, పాటిన్సన్‌ 15-2-81-2, బర్డ్‌ 14.4-4-66-2, మిచెల్‌ మార్ష్‌ 8-1-62-1, లియాన్‌ 10-0-61-3.

ఆస్ర్టేలియా తొలి ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) గప్టిల్‌ (బి) బౌల్ట్‌ 12, బర్న్స్‌ (నాటౌట్‌) 27, ఖవాజ (నాటౌట్‌) 18; ఎక్స్‌ట్రాలు:0; మొత్తం: 20 ఓవర్లలో 57/1; వికెట్‌ పతనం: 1-25; బౌలింగ్‌: సౌథీ 7-1-21-0, బౌల్ట్‌ 6-1-18-1, హెన్రీ 6-2-18-0, ఆండర్సన్‌ 1-1-0-0.

183.54
ఈ మ్యాచ్‌లో బ్రెండన్‌ స్ట్రయిక్‌ రేట్‌. సెంచరీ చేసిన ఇన్నింగ్స్‌లో ఇది రెండో అత్యధికం. వివ్‌ రిచర్డ్స్‌ (58 బంతుల్లో 110 నాటౌట్‌) 189.75తో మొదటి స్థానంలో ఉన్నాడు.
199
తొలి రోజు రెండో సెషన్‌లో 24 ఓవర్లు ఆడిన కివీస్‌ 8.29 రన్‌రేట్‌తో 199 రన్స్‌ చేసింది.
12
బ్రెండన్‌కు ఇది 12వ శతకం. కివీస్‌ తరపున మార్టిన్‌ క్రో (17), టేలర్‌, విలియమ్సన్‌ (13) అతనికంటే ముందున్నారు.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

Post a Comment

Powered by Blogger.