షిల్లాంగ్:  ఢిల్లీకి చెందిన మహిళా జర్నలిస్టును  లైంగికంగా వేధించిన ఘటనలో  ఓ న్యూస్ ఛానల్ ఎడిటర్  ఇన్ ఛీప్ పై  పోలీసులు కేసు నమోదు చేశారు. అసోంలోని గౌహతికి చెందిన  ప్రయివేటు టీవీ ఛానల్ చీఫ్ ఎడిటర్ అటాను భుయాన్  లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని  ఆరోపిస్తూ  మహిళా జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతోపాటు సదరు ఛానల్ యజమాని, అసోం మంత్రి రోకిబుల్ హుస్పేన్  పై  ఢిల్లీ మహిళా కమిషన్ కు  కూడా ఆమె ఫిర్యాదు చేశారు.  చీఫ్ ఎడిటర్  తనను వేధిస్తున్నాడంటూ  ఫిర్యాదు చేసినా  పట్టించుకోకుండా, తనను ఉద్యోగంనుంచి తీసేసారని మహిళా జర్నలిస్టు ఆరోపించారు.   

వివరాల్లోకి వెళితే... గత ఏడాది  ఆగస్టులో విధుల్లో చేరిన తనను  ఛానల్ సీఈవో లైంగికంగా వేధించేవాడని ఆ జర్నలిస్టు  పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కోరిక తీర్చాలంటూ పదే పదే ఫోన్  చేసి వేధించేవాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  వేళపాళా లేకుండా అర్థరాత్రి, అపరాత్రి  డ్యూటీ  చేయమని వేధించినట్లు తన ఫిర్యాదులో తెలిపారు. 

అటాను భుయాన్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని, ఛానల్ అధిపతి,  సాక్షాత్తూ మంత్రి రికుబల్ కు ఫిర్యాదు చేసిన పట్టించకోలేదు సరికదా..తనను విధులనుంచి తప్పించారని మహిళా జర్నలిస్టు వాపోయారు. దీంతో  ఢిల్లీలోని  రాజౌరి గార్డెన్ పోలీస్  స్టేషన్ పోలీసులు  అటాను పై కేసు  నమోదు చేశారు.   గౌహతి చేరుకున్న  ప్రత్యేక పోలీసు  బృందం విచారణ నిర్వహిస్తోంది.  అయితే  ఈ వివాదంపై స్పందించేందుకు  అటు  ఛానల్ చీఫ్ ఎడిటర్  గానీ, ఇటు రాష్ట్రమంత్రి గానీ మీడియాకు అందుబాటులో లేరు.  మరోవైపు చానల్ చీఫ్ ఎడిటర్ పరువుకు  భంగం కలిగించేందుకు  ఇదంతా జరుగుతోందన్న వాదనలు కూడా వినిపించాయి.

కాగా 2012  సంవత్సరంలో యావద్దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన మూకుమ్మడి అత్యాచార ఘటనలో పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంపై ముఖ్యమంత్రి  తరుణ్ గొగోయ్ తప్పుపట్టిన నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసిన అటాను భుయాన్ అప్పట్లో వార్తల్లో నిలిచారు.

Post a Comment

Powered by Blogger.