ఇస్లామాబాద్: పురుషులిద్దరు ముద్దు పెట్టుకుంటున్న ఫోటో.. ముద్రించకుండా ఖాళీగా వదిలేసిన స్థానిక యాజమాన్యం..దీంతో ప్రపంచ వ్యాప్తంగా భావప్రకటన స్వేచ్ఛ పై మరోసారి చర్చ. ముందు పేజిలో ఖాళీ స్థలంతో ది ఎక్స్ ప్రెస్ ట్రైబ్యూన్ ఆర్టికల్ ను శుక్రవారం ప్రచురించడంతో వివాదానికి తెర లేపింది. ఇంటర్ నేషనల్ న్యూయార్క్ టైమ్స్ కు అనుబంధంగా పాకిస్తాన్ లోని స్థానిక పత్రిక ది ఎక్స్ ప్రెస్ ట్రైబ్యూన్ నడుస్తోంది.

చైనాలో ట్రాన్స్ జెండర్ హక్కుల కోసం న్యూయార్క్ టైమ్స్ ఓ ఆర్టికల్ ను ది ఎక్స్ ప్రెస్ ట్రైబ్యూన్ కు పంపింది. ఆ ఆర్టిక్టల్ తో పాటూ చైనాలోని ఓ యువకుడు మరో పురుషుడికి చెంపపై ముద్దు పెట్టుకొంటున్న ఫోటోను ప్రచురించాలి. కానీ, ఆ ఆర్టికల్ మాత్రమే ప్రచురించి ఆ ఫోటో స్థానాన్ని ఖాళీగా వదిలేశారు. అది కూడా ముందు పేజీలో. దీంతో న్యూయార్క్ టైమ్స్ పాఠకులు ఉదయం లేచి చూడగానే పేపర్ ముందు పేజీలో బ్లాంక్ గా కనిపించింది. 'పాకిస్థాన్ లోని మా ముద్రణ భాగస్వామి ఆ ఫోటోను తొలగించారు. ఫోటోను తీసివేయడం వెనక ఎడిటోరియల్ స్టాఫ్ కు ఎలాంటి ప్రమేయం లేదు' అని ఇంటర్నేషనల్ న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.

ఆ ఫోటో ప్రచురిస్తే స్థానికంగా ఇబ్బందులు తలెత్తేవని ఎక్స్ ప్రెస్ ట్రైబ్యూన్ ఎడిటర్ కమల్ సిద్దికీ తెలిపారు. పురుషులు ముద్దు పెట్టుకునే ఫోటోలను పాకిస్తాన్ లో మీరు ఎక్కడా చూడరు. పురుషులే కాదు ఎవరైనా ముద్దు పెట్టుకునే ఫోటోలు ఎక్కడా కనిపించవని ఆయన పేర్కొన్నారు. ఈ నెల ప్రారంభంలో న్యూయార్క్ టైమ్స్ పంపిన మరో ఆర్టికల్ ను కూడా ది ఎక్స్ ప్రెస్ ట్రైబ్యూన్ సెన్సార్ చేసింది. బంగ్లాదేశ్ లోని కొన్ని అతివాద సంస్థలకు సంబంధించిన ఆ ఆర్టికల్ లో దైవ దూషణ వ్యాఖ్యలు ఉండటం వల్ల దాన్ని సెన్సార్ చేసినట్టు న్యూయార్క్ ట్రైమ్స్ పబ్లిక్ ఎడిటర్ మార్గరేట్ సల్లీవన్ తెలిపారు. డిజిటల్ యుగంలో కూడా పత్రికలు బ్లాంక్ పేజీలు ప్రచరించడం భావ ప్రకటన స్వేచ్ఛకు అడ్డు అని మార్గరేట్ అభిప్రాయపడ్డారు.

అయితే ది ఎక్స్ ప్రెస్ ట్రైబ్యూన్ ఎడిటర్ సిద్దికీ తన పని తీరు పై ఈ మెయిల్ ద్వారా వివరణ ఇచ్చుకున్నారు...ఇస్లామిక్ తీవ్రవాదులు పాకిస్థాన్ లోని జర్నలిస్ట్ లను తరచుగా టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు. పాశ్చాత్య సంస్కృతిని దేశంలో ప్రవేశపెడుతున్నారన్న ఆరోపణలతో జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని, 2014లో తమ సంస్థలోని ముగ్గురు జర్నలిస్ట్ లను తీవ్రవాదులు హత్య చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. సెన్సార్ చేయడాన్ని మీకన్నా ఎక్కువగా నేనే ఖండిస్తున్నాను. కానీ, ఇక్కడి స్థానిక పరిస్థితుల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

ఇస్లాం భావజాలానికి వ్యతిరేకంగా ఆర్టికల్స్, కార్టూన్స్, ఫోటోలను ప్రచురించినందుకు 2001 నుంచి ఇప్పటి వరకు 71 మంది జర్నలిస్ట్ లు హత్యకు గురయ్యారు. ఇస్లాంను ఆధారంగా చేసుకొని రాజ్యాంగాన్ని రూపొందించుకున్న పాకిస్థాన్, సౌదీ అరేబియా, ఇరాన్ లాంటి దేశాల్లో స్వలింగ సంపర్కంపై అంతగా అవగాహన లేదు. 2011లో పాకిస్తాన్ సుప్రీంకోర్టు  ట్రాన్స్ జెండర్ జనభాను అధికారికంగా గుర్తించింది. వారికి ప్రస్తుతం ఓటు హక్కును కూడా కల్పించారు.

Post a Comment

Powered by Blogger.