పత్రికలు చదవడం... టీవీ చర్చలకు కళ్లప్పగించడం చాలామందికి ఇష్టం... కానీ ఆ ఆసక్తిని స్టార్టప్‌గా మలిచే సాహసం ఎవరు చేస్తారు? భద్రాచలం యువకుడు నరసింహారెడ్డి చేశాడు... సమగ్ర సమాచారం ఒకేచోట అందిస్తూ ‘న్యూస్ డిస్టిల్’ ప్రారంభించాడు... మొదలైన మూణ్నెళ్లకే ఈ యాప్ లక్షకుపైగా డౌన్‌లోడ్స్ నమోదు చేసుకుంది... 4.5 రేటింగ్ సాధించిన అతికొద్ది యాప్‌లలో ఒకటిగా నిలిచింది... ఈ విజయం ఒక్కరోజులో సాధ్యం కాలేదు...
ఆలోచనల అంకురం
ప్రకాశం జిల్లా దర్శికి చెందిన నరసింహారెడ్డి కుటుంబం భద్రాచలంలో స్థిరపడింది. వైజాగ్‌లో బీటెక్ పూర్తిచేసి ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేరాడు. రెండేళ్లు ఉద్యోగం చేశాక అమెరికా బాట పట్టాడు. అయితే తనెక్కడున్నా పొద్దున లేవగానే నాలుగైదు పత్రికలు తిరగేయడం, న్యూస్ ఛానెళ్లలో చర్చల్ని గమనించడం అతడి దినచర్య. కానీ ఒకే టాపిక్ మీద పత్రికలు, ఛానెళ్లలో భిన్నాభిప్రాయాలుండేవి. వాస్తవాలు తెలుసుకోవడానికి గూగుల్ గాలించేవాడు. నిపుణుల్ని అడిగి సందేహాలు తీర్చుకునేవాడు. ఏళ్లుగా ఇదే పరిస్థితి. ఈ అసంతృప్తి నుంచే అసలు ఒక అంశంపై ఏ ఛానెల్ ఎలా స్పందించింది... ఏ పత్రిక ఎలా రాసింది... అదనపు సమాచారం... ఇలా సమగ్ర వివరాలు అందించేలా ఓ మీడియా స్టార్టప్ ఎందుకు ప్రారంభించకూడదు? అనుకున్నాడు.
రెండేళ్ల కసరత్తు
ఆచరణ మొదలైంది. ప్రస్తుతం ఉన్న సంస్థల వివరాలు ఆరా తీశాడు. పత్రికల యజమానులు, ఈ రంగంలోని నిపుణుల్ని కలిశాడు. న్యూస్ యాప్స్ గమనించాడు. విజేతలు ఎలా సక్సెస్ అయ్యారో విశ్లేషించాడు. ప్రస్తుత వెబ్‌సైట్లు, యాప్స్ పత్రికలు, ఛానెళ్లలోంచి వార్తలు, వీడియోలు సేకరించి అందుబాటులో ఉంచుతున్నాయి. దీనికి అదనంగా గూగుల్ సమాచారం జత చేయడం, ఆ టాపిక్ సంబంధించిన వీడియోలు జత చేయాలనుకున్నాడు నరసింహారెడ్డి. దానికి తగ్గట్టే ఇండియాలోని అన్ని ప్రముఖ టీవీ ఛానెళ్లు, పత్రికలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీని ప్రకారం మొదటి ఆర్నెళ్లు ఉచితంగా కంటెంట్ అందివ్వాలి. తర్వాత వార్తలు, వీడియోల వీక్షణాన్ని బట్టి ఆదాయ పంపిణీ ఉంటుంది. అంటే న్యూస్‌డిస్టిల్ ప్రచురణకర్తలు, పాఠకుల మధ్య అనుసంధానకర్తలా పనిచేస్తుందన్నమాట.
ఆలోచన ఆచరణలోకి వచ్చేసరికి ఏడాదిన్నర పట్టింది. బీటా వెర్షన్ వెబ్‌సైట్ తయారైంది. సన్నిహితులు, నిపుణులకు చూపిస్తే అంతా పెదవి విరిచారు. ఇందులో కొత్తదనం ఏముందని ప్రశ్నించారు. ఆ ఫీడ్‌బ్యాక్‌తో సంస్థకు సమర్థమైన బృందం ఉండాలనే విషయం నరసింహారెడ్డికి అర్థమైంది. మిత్రుడు వంశీ మొదటి నుంచే తోడున్నాడు. ఇద్దరూ కలిసి ఇంకా ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచనను స్నేహితులు, బంధువులు... ప్రతి ఒక్కరితో పంచుకునేవారు. అలా ఓ బీమా కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో పనిచేసే భాస్కర్, ఇన్ఫోసిస్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కళ్యాణ్‌లు వీళ్లకి జత కలిశారు. అంతా కలిసి ఆండ్రాయిడ్, బ్యాకెండ్, ఎడిటోరియల్ బృందాలను తయారు చేశారు. చిన్న ప్రతికూల అంశం లేకుండా పట్టుదలగా పనిచేశారు. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు... ప్రతి ఒక్కరినుంచి అభిప్రాయాలు సేకరించారు. అన్ని లోపాల్ని సవరించుకొని ఆగస్ట్ 20, 2015న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా newsdistillప్రారంభించాడు. ఈసారి లక్ష్యం గురి తప్పలేదు. ‘అందరూ వహ్వా’ అన్నారు. ఫలితాలు అలాగే వచ్చాయి. ఆంగ్లం, తెలుగు భాషల్లో అందుబాటులో ఉన్న ఈ యాప్‌ను మూణ్నెళ్లలోనే లక్షమంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. మీడియా విభాగంలో 4.5 రేటింగ్ సాధించిన యాప్‌లలో ఒకటిగా నిలిచింది న్యూస్‌డిస్టిల్. ఈ విజయం కోసం నరసింహారెడ్డి పడ్డ కష్టం తక్కువేం కాదు. మొదట్లో రోజుకు పది నుంచి ఇరవై గంటలు పనిచేసిన సందర్భాలున్నాయి. యాహూ సంస్థలో మంచి హోదాలో ఉన్న తను స్టార్టప్ మొదలు పెట్టాలనుకున్నపుడు ‘మంచి ఉద్యోగం, భారీ జీతం ఉన్నా ఎందుకు ఇంత రిస్కు తీసుకుంటున్నావ్’ అనేవారు సన్నిహితులు. ‘నా ప్రయత్నం కేవలం డబ్బు కోసం కాదు. నేను ఎదుర్కొన్న సమస్యకు పరిష్కారం చూపించాలి. జనాలకు మెరుగైన విషయం అందించాలనే తపన కూడా ఉంది’ అంటూ సమాధానం ఇచ్చేవాడు.
యాప్ ప్రత్యేకతలు
* రాజకీయాలు, సినిమా, వినోదం, క్రీడలు, వ్యాపారం... నచ్చిన విభాగాన్ని ఎంచుకొని ఆ వార్తలే చదవొచ్చు, చూడొచ్చు
* ఒకే అంశంపై వివిధ పత్రికలు, ఛానెళ్లు ఎలా స్పందించాయో ఒకే చోట చూడొచ్చు
* మనుషుల ప్రమేయం లేకుండానే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) ద్వారా సినిమా రివ్యూలు, మార్కెట్లోకి విడుదలైన గ్యాడ్జెట్ల రివ్యూలు అందిస్తున్నారు
* ప్రయరైజ్డ్ న్యూస్ విభాగం ద్వారా ఏ వార్తలు ముందు రావాలి? ఏవి తర్వాత రావాలో ఎంపిక చేసుకోవచ్చు
* అవసరం ఉన్న విభాగాన్ని ఎంపిక చేసుకొని ఫోన్, ఈమెయిల్‌లకు అలర్ట్‌లు పంపుకోవచ్చు
కీలక బృందం:
* వంశీ పోరూరి
* కళ్యాణ్‌శ్రీనివాస్ పొలిశెట్టి
* భాస్కర్‌రెడ్డి కొండా
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
Post a Comment