2016 ఆశలు-ఆశయాలు

2016 ఆశలు-ఆశయాలు
నూతన సంవత్సరం రోజున ప్రభుత్వ యంత్రాంగంలో కీలకమైన అధికారులు ఏమనుకుంటున్నారు.. కొత్త సంవత్సరంలో వారి ఆశలు, ఆశయాలు ఏమిటి..?
ఈ ప్రశ్నలకు వారి నుంచి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది సాక్షి.
కొత్త సంవత్సరంలో అయినా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని అందరూ కాంక్షించారు. పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలు పరిష్కారం కావాలని అన్నారు. అధికారులు ఏమన్నారో వారి మాటల్లోనే.. 


రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి
జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి, ఉమ్మడి రాష్ట్రాల లోకాయుక్త

కొత్త సంవత్సరంలో రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి. వరుణ దేవుడు కరుణించాలి. మంచి వర్షాలు కురవాలి. పాడిపంటలు సమృద్ధిగా పండాలి. ప్రజలు సుఖ సంతోషాలతో మెలగాలి. శాంతి సామరస్యాలు వెల్లివిరియాలి. అవినీతి రహిత, నిర్లక్ష్య రహిత పాలన ఉండాలి. ప్రభుత్వాలు జవాబుదారీతనంతో పనిచేయాలి. ఎక్కడ అవినీతి జరుగుతుందో గుర్తించి కట్టడి చేయాలి. లంచం ఇచ్చే వారికి శిక్షలు వేయాలి. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కాకుండా చూడాలి.

తిరుపతిలోనే న్యూ ఇయర్ : భన్వర్‌లాల్, ఇరు రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారి
ప్రతి ఏడాది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనంతో కొత్త సంవత్సరం ప్రారంభిస్తాను. దాదాపు 20 ఏళ్లుగా డిసెంబర్ 31 లేదా జనవరి 1న తిరుపతికి వెళ్తున్నా. ఈ ఏడాది కూడా కొత్త సంవత్సర వేడుకలు అక్కడే. కుటుంబ సభ్యులతో పాటు తిరుపతిలోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్. రెండు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

కొత్త ఏడాదిలో ఎన్నికల కమిషన్ ముందున్న లక్ష్యాలన్నీ నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటాం. ఏపీలో చిత్తూరు ఎమ్మెల్సీ సీటు ఒకటి ఖాళీగా ఉంది. హైకోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉన్నందున ఎన్నిక నిర్వహించలేదు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఈ ఎన్నిక జరుపుతాం. ఫిబ్రవరి 25 లోపు తెలంగాణలో ఖాళీగా ఉన్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే సీటుకు ఎన్నికలు నిర్వహిస్తాం. 2016 మార్చి 11న తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లో కొత్త ఓటర్ల జాబితాను ప్రచురిస్తాం. జనవరి 25న రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా ‘జాతీయ ఓటర్ల దినోత్సవం’ నిర్వహిస్తాం.

బెస్ట్ పోలీసింగ్.. ఇదే మా విజన్ : అనురాగ్ శర్మ, డీజీపీ
రాష్ట్ర పోలీసు విభాగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాం. కొత్త రాష్ట్రానికి మొదటి డీజీపీగా అరుదైన అవకాశం దక్కింది. దీన్ని సద్వినియోగం చేసుకొని దేశంలోనే తెలంగాణ పోలీస్ బెస్ట్ అనేలా చేయాలన్నదే ఆకాంక్ష. బంగారు తెలంగాణలో శాంతిభద్రతలు కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. అందరినీ కలుపుకొని ముందుకెళ్తాం. పట్టణీకరణ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాలు అదుపు చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. సైబర్‌క్రైం అదుపు చేయడం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మావోయిజం, ఉగ్రవాదం అభివృద్ధికి ప్రధాన విఘాతంగా మారినట్లు ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైంది. వీటి  విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. అంతిమంగా మా లక్ష్యం ప్రజా శ్రేయస్సు.. ఫ్రెండ్లీ పోలీసింగ్.

ప్రజల సహకారంపైనే ఆశలు

బి.జనార్దన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్
నూతన సంవత్సరంలో హైదరాబాద్ నగర ప్రజల సహకారంపైనే ఆశలు, ఆకాంక్షలు పెట్టుకున్నా. పురపాలనలో ప్రజల సహకారం లేనిదే ఏ పని విజయవంతం కాదు. ప్రజల భాగస్వామ్యాన్ని పొందడమే ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన పని. కొత్త ఏడాదిలో ప్రజల నుంచి మంచి భాగస్వామ్యం పొందుతామని ఆశిస్తున్నాం. ట్రాఫిక్ నియమాలను పాటించడం, ఎక్కువగా ప్రభుత్వ రవాణా వాహనాలను వినియోగించటం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, క్రీడా మైదానాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవటం, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించటం.. తదితర అంశాల్లో ప్రజల భాగస్వామ్యం కావాలి. ‘స్వచ్ఛ హైదరాబాద్’ కోసం అందరూ కృషి చేయాలి. ఆరోగ్యకరమైన హైదరాబాద్‌ను తీర్చిదిద్దటమే నా ప్రధాన ధ్యేయం.

నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం
రవీంద్ర గుప్తా, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్
దక్షిణ మధ్య రైల్వే అంటే ప్రయాణికులకు ఓ భరోసా. వారి మనోగతానికి తగ్గట్టుగా రైళ్లను నడపడంతోపాటు ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయనే నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మరింత పెంచటమే కొత్త సంవత్సరంలో మా కర్తవ్యం. సకాలంలో భద్రంగా వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఇందుకు 24 గంటల పర్యవేక్షణకు మరింత పదును పెడతాం. సౌరశక్తి లాంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులతో విద్యుత్‌ను ఆదా చే స్తూ, పర్యావరణానికి మేలు చేసే చర్యలకు ప్రాధాన్యమిస్తాం. మన ఇల్లు, పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూస్తే దేశం మొత్తం పరిశుభ్రంగా మారుతుంది. అందుకే అంతా స్వచ్ఛభారత్‌ను విజయవంతం చేద్దాం. హరిత భారత నిర్మాణంలో పాలు పంచుకుందాం. రైల్వే ఉద్యోగుల కుటుంబాలతో కలిసి రైల్వే క్లబ్‌లో కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొంటా.

2016.. ఇయర్ ఆఫ్ టెక్నాలజీ
మహేందర్‌రెడ్డి, నగర పోలీస్ కమిషనర్
నగర పోలీసు విభాగం వచ్చే ఏడాదిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగించుకుంటుంది. పోలీసు విధి నిర్వహణను మరింత పారదర్శకంగా చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నాం. నేరాలను అరికట్టేందుకు, జరిగిన నేరాలకు కొలిక్కి తీసుకురావడంలో టెక్నాలజీని మరింతగా వినియోగించుకుంటాం. ట్రాఫిక్ విభాగంలో ఇప్పటికే కాప్ లెస్ జంక్షన్స్ విధానాన్ని అమలు జరుగుతోంది. పోలీసు ప్రమేయం లేకుండా వాహనచోదకులు తమంతట తామే నిబంధనలు పాటించేలా చేయడం దీని ప్రధాన ఉద్దేశం. భవిష్యత్తులో హైదరాబాద్ రోడ్లపై ట్రాఫిక్ పోలీసులే కనిపించకుండా పూర్తి స్థాయిలో టెక్నాలజీ వాడతాం. నగర పోలీసుకు సంబంధించి 2016 ఈజ్ ఏ ఇయర్ ఆఫ్ టెక్నాలజీ.

అన్ని రంగాల్లోనూ దూసుకెళ్లాలి
రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
తెలంగాణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో గడపాలి’ అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ ఆకాంక్షించారు. ‘కొత్త సంవత్సరంలో ఉద్యోగులు మరింత అంకితభావంతో పని చేయాలి. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులు, ఉద్యోగులు మరింత సమర్థంగా విధులు నిర్వహించాలి. ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం కొత్త సంవత్సరంలో మరింత అభివృద్ధి సాధించాలి. అన్ని రంగాల్లోనూ అప్రతిహతంగా దూసుకెళ్లాలి. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలన్నీ క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులందరికీ చేరేలా ఉద్యోగులు నిబద్ధతతో పని చేయాలి.

Post a Comment

Powered by Blogger.