విశాఖ మన్యంలో ఒక వైపు ఉష్ణోగ్రతలు 6-7 డిగ్రీలకు పడి పోయి చలి వణికిస్తుండగా... మావోయిస్టుల బాక్సైట్ వ్యతిరేక పోరాటాలు, పోలీసులు కూంబింగ్ పేరుతో గ్రామాల మీద దాడులు వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. డిశంబర్ మొదటి వారంలో వారం పాటు బహిరంగ సభలు సమావేశాలతో పీఎల్జీఏ వారోత్సవాలను నిర్వహించిన మావోయిస్టు పార్టీ బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటాలను ఉదృతం చేసింది. ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాల జీఓ ను ఉపసంహరించుకోక పోవడంతో ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్న మావోయిస్టులు బాక్సైట్ తవ్వకాల వ్యతిరేక పోరాటంలో భాగంగా వారం రోజుల పాటు నిరసనలకు పిలుపునిచ్చారు. చివరి రోజైన 26 వ తేదీన మన్యం బంద్ కు పిలుపు నిచ్చారు. వారం పాటు అనేక సభలు నిర్వహించిన మావోయిస్టులు ఆదివాసులను పెద్దఎత్తున కూడగట్టారు. నిరసన వారంలో ఆదివాసులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో కనీసం బంద్ విజయవంత కాకుండా చూడాలన్న లక్ష్యంతో పోలీసులు భారీగా మన్యాన్ని చుట్టుముట్టారు. ప్రతి గ్రామంలో సోదాలు నిర్వహిస్తున్నారు. అనేక మందిని అదుపులోకి తీసుకుంటున్నారు. వేలాది మంది పోలీసుల పదఘట్టనలతో మన్యం భయభ్రాంతులకు గురవుతోంది. మరో వైపు మావోయిస్టులు వేలాది మంది ఆదివాసుఅలతో తమ సభలు సమావేశాలు యధావిధిగా నిర్వహిస్తున్నారు. బాక్సైట్ తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆదివాసులు మావోయిస్టులతో కలిసి అడుగులు వేస్తున్నారు. మరో వైపు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ శనివారం నాడు బంద్ విజయవంత అయ్యింది. బస్సులు కదల లేదు. మన్యంలో వ్యాపారకార్యక్రమాలు పూర్తిగా ఆగిపోయాయి.
Post a Comment