కొత్త సంవత్సర వేడుకల్లో అపశ్రుతి

కొత్త సంవత్సర వేడుకల్లో అపశ్రుతి
దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం
 బుర్జ్ ఖలీఫాకు సమీపంలో ఘటన.. 63 అంతస్తుల ఫైవ్‌స్టార్ హోటల్‌లో మంటలు


 దుబాయ్:
 యూఏఈలో నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తై బుర్జ్ ఖలీఫా ఆకాశ హర్మ్యం సమీపంలోని 63 అంతస్తుల అడ్రస్ డౌన్‌టౌన్ హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. హోటల్‌లో 20వ అంతస్తులో ముందుగా మంటలు చెలరేగాయని చెప్తున్నారు. ఆ మంటలు హోటల్ వెలుపలి వైపు నుంచి 40వ అంతస్తు వరకూ పైకి ఎగసిపడుతున్నాయి. దీంతో హోటల్ పై అంతస్థుల నుంచి దాదాపు 300 మీటర్ల ఎత్తు నుంచి శకలాలు కిందకు పడుతున్నాయి. ఈ హోటల్‌లో నివాస గదులు (రెసిడెన్షియల్ రూమ్స్) కూడా ఉన్నాయి.

కొత్త సంవత్సరం వేడుకల కోసం.. పెద్దమొత్తంలో టపాసులను భవనంపైకి తీసుకు వెళ్లినట్లు చెప్తున్నారు. మంటలు మొదలైన వెంటనే గుర్తించి హోటల్‌లోని అందరినీ ఖాళీ చేయించటంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. అయితే మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో అందులో ఉన్న వారంతా బయటకు రావడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో 14 మందికి చిన్న గాయాలు కాగా, ఓ వ్యక్తికి గుండె పోటు వచ్చినట్టు అధికారులు చెప్పారు. హోటల్ లోపలి వైపు మంటలు విస్తరించలేదని అధికారులు పేర్కొన్నారు.

Post a Comment

Powered by Blogger.