పూటుగా తాగితే ఇంటికి చేరుస్తారు

పూటుగా తాగితే ఇంటికి చేరుస్తారు
‘మిషన్ స్మార్ట్ డ్రైవ్’పారంభించిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: డ్రంకన్ డ్రైవ్ ప్రమాదాలను నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త డ్రైవ్ షురూ చేసింది. ఫుల్లుగా మద్యం సేవించి, వాహనాన్ని నడపలేని స్థితిలో ఉన్నవారిని సురక్షితంగా ఇంటి వద్ద దిగబెట్టేందుకు దేశంలోనే తొలిసారిగా ‘మిషన్ స్మార్ట్ డ్రైవ్’ను గురువారం అమల్లోకి తెచ్చింది. అది కూడా పూర్తి ఉచితంగా! పెలైట్ ప్రాజెక్టుగా మొదట హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చింది. ‘డ్రింక్ సేఫ్ అండ్ స్మార్ట్ రైడ్’ నినాదంతో రూపొందించిన ఈ ప్రాజెక్టును రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌రంజన్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు గురువారం హోటల్ తాజ్‌కృష్ణాలో ప్రారంభించారు.

మద్యం మత్తులో వాహనాలను నడపడం వల్ల జరుగుతున్న ప్రమాదాలు, ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించాలన్నది ఈ డ్రైవ్ ఉద్దేశం. సామాజిక కోణంలో ఈ సేవలు అందించేందుకు  ఉబర్ క్యాబ్, నార్నే ఎస్టేట్స్ ముందుకొచ్చాయి.

సేవలిలా: ఈ ప్రాజెక్టులో భాగంగా క్యాబ్ సేవలు 25 కి లోమీటర్ల పరిధి లోపు ఉంటాయి. ‘స్మార్ట్ రైడ్ 4 జీరో డీయూఐ క్యాబ్ సర్వీసెస్’ పేరుతో సేవలు అందిస్తారు. బార్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లలో మద్యం మత్తులో ఉండే కస్టమర్ల సమాచారాన్ని వాటి యాజమాన్యాలు సదరు క్యాబ్ సంస్థకు చేరవేస్తాయి. ఆటోమేటెడ్ కాల్ ఫార్వాడింగ్ పద్ధతిన పరిసర ప్రాంతాల్లోని క్యాబ్ అక్కడికి చేరుకుంటుంది. మత్తులో ఉన్నవారిని ఇంటి వద్ద విడిచిపెడుతుంది. 25 కిలోమీటర్ల వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించక్కర్లేదు.

ఆ పరిధి దాటితే చార్జీలు వర్తిస్తాయి. బార్/రెస్టారెంట్‌లోకి రాగానే కస్టమర్ల చిరునామాను ముందుగానే అక్కడ ప్రత్యేకంగా నియమించిన వ్యక్తికి తెలియజేయాలి. లేదంటే ప్రత్యేకంగా రూపొందించిన... ‘వన్ టచ్’ కాల్ రూటింగ్ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో పేర్కొన్న ప్రకారం వివరాలను ఫార్వార్డ్ చేస్తే క్యాబ్ వస్తుంది. ఈ సేవలు విస్త్రత స్థాయిలో అమల్లోకి రావాలంటే ముందుగా బార్లు, రెస్టారెంట్లు, హోటళ్ల యాజమాన్యాలు ముందుకు రావాలి. ఇలాంటి వారి కోసం ఓ క్లబ్ ఏర్పాటు చేశారు.

ఇప్పటికే 28 రెస్టారెంట్లు/బార్లు తమ వివరాలు ఇందులో నమోదు చేసుకున్నాయి.  ఇది ఉత్తమ ప్రాజెక్టు: సామాజిక కోణంలో ఏ కార్యక్రమం చేపట్టడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేకే చెప్పారు. స్మార్ట్ డ్రైవ్ ఉత్తమ ప్రాజెక్టుగా నిలుస్తుందన్నారు. రోడ్డు భద్రతను పటిష్టం చేసేందుకు ఇదెంతో ఉపయోగపడుతుందని జయేష్‌రంజన్ అన్నారు. పలు దేశాల్లో పాటిస్తున్న విధానాలను అధ్యయనం చేసి  దీన్ని రూపొందించామని మిషన్ స్మార్ట్ డ్రైవ్ సీఈఓ నందశాండిల్య చెప్పారు. రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ డెరైక్టర్ అకున్ సబర్వాల్, మాజీ క్రికెటర్ వెంకటపతిరాజు, ఉబర్ క్యాబ్ జీఎం సిద్ధార్థ్ శంకర్ ఇందులో పాల్గొన్నారు.

Post a Comment

Powered by Blogger.