సూపర్‌స్టార్‌కు విలన్‌గా హాంకాంగ్ స్టార్?
 సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రం అంటేనే ఆటోమెటిక్‌గా ఒక క్రేజ్ వచ్చేస్తుంది. అదీ ఆయన స్టామినా. అంతే కాదు ఆశ్చర్యాలకు, ఆసక్తికీ నిలయం ఆయన చిత్రాలు. ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న కబాలీ, 2.ఓ(ఎందిరన్‌కు సీక్వెల్) చిత్రాలపై ఇటు పరిశ్రమలోనూ, అటు అభిమానుల్లోనూ అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. అలాంటి చిత్రాలకు చెందిన విశేషాలు తెలుసుకోవాలనే ఆతృత ప్రతి ప్రేక్షకుడిలోనూ ఉంటుంది. కాగా 2.ఓ చిత్రం గురించి చెప్పుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఇకపోతే కబాలీ చిత్రం గురించి ఇప్పటికే పలు ఆసక్తికరమైన చిత్రాలు చెప్పుకున్నాం.
 
  సూపర్‌స్టార్ చాలా కాలం తరువాత అంటే సంచలన చిత్రం బాషా తరువాత మరోసారి గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్న చిత్రం కబాలీ. ఇందులో ఆయన రెండు డైమన్షన్స్‌లో అభిమానుల్ని అలరించనున్నారు. అందులో పూర్తిగా నెరిసిన గడ్డం, మీసాలతో ఫుల్ సూట్‌లో ఉన్న ఆయన గెటప్ ఇప్పటికే అభిమానుల్ని యమ ఖుషీ చేస్తోంది. ఇక మరో యంగ్ గెటప్‌లో సూపర్‌స్టార్ కొత్త కోణంలో కబాలీ చిత్రంలో ఆవిష్కృతం కానున్నారు.
 
 చిత్ర కథ అధిక భాగం మలేషియాలో నడుస్తుంది. కాగా సూపర్‌స్టార్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కబాలీ చిత్ర దర్శకనిర్మాతలు ఈ చిత్రంలో సూపర్‌స్టార్ రేంజ్‌కు తగ్గట్టుగా విలన్‌ను ఎంపిక చేసే పనిలో నిమగ్నం అయ్యారు. విశేషం ఏమిటంటే ఆ విలన్ ప్రపంచ స్థాయి స్టార్ కానున్నారన్నది తాజా సమాచారం.
 
 రజనీకి విలన్‌గా జెట్లీ?
 కబాలీ చిత్రంలో ఉత్తర ప్రపంచానికి చెందిన స్టార్స్‌లో ఒకరిని ఎంపిక చేయనున్నారని తెలిసింది. ఐపీమ్యాన్ సిరీస్ చిత్రాల ఫేమ్ డోనీయెన్, జాన్ కుయ్, షోగర్ల్ అండ్ ది డార్క్ క్రిస్టల్ చిత్రాల ఫేమ్ విన్‌స్టన్ చావో,ది క్రాడిల్ ఆఫ్ లైఫ్ చిత్రం ఫేమ్ సిమోన్ యామ్, గాన్ విత్ ది బులెట్స్ చిత్రం ఫేమ్ జయాంగ్ వెన్, పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్, ఎట్ వరల్డ్ ఎండ్ చిత్రాల ఫేమ్ చెయాన్ ఫాట్‌లలో ఒకర్ని సూపర్‌స్టార్‌కు విలన్‌గా చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.
 
  వారందరి కంటే హాంకాంగ్ స్టార్ హీరో జెట్లీ రజనీకాంత్‌కు ప్రతినాయకుడయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. నటి రాధిక ఆప్తే రజనీకాంత్‌తో జత కట్టే అవకాశాన్ని దక్కించుకున్న ఈ చిత్రంలో దినేశ్, కలైయరసన్, ధన్సిక, జాన్ విజయ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. వీ.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ భారీ, క్రేజీ చిత్రాన్ని యువ దర్శకుడు రంజిత్ హ్యాండిల్ చేస్తున్నారు. రజనీకాంత్‌తో హాంకాంగ్ స్టార్ ఢీకొనే సన్నివేశాలను 2016 ప్రథమార్ధంలో మలేషియా, హాంకాంగ్‌లో చిత్రీకరించనున్నట్లు తెలిసింది. చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా మే నెల ఒకటో తారీఖున విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
 

Post a Comment

Powered by Blogger.