ఆ సినిమా అంతా తప్పుల తడకేనట!

ఆ  సినిమా అంతా తప్పుల తడకేనట!
చెన్నై: 'అడ్డంకులు తొలగిపోయాయి. జనవరి 1న 'కిల్లింగ్ వీరప్పన్' విడుదల. ఇక నేను ముంబై వెళ్లిపోతాన'ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇలా ప్రకటించాడో లేదో మళ్లీ వివాదాలు మొదలయ్యాయి. ఆ సినిమాకు వరుస తలనొప్పులు పట్టిపీడిస్తున్నాయి. ముందు ఫైనాన్స్ చిక్కులు వేధిస్తే.. ఇప్పుడు వరుస పిటిషన్లు ఆయనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలని కోరుతూ తాజాగా మరో పిటిషన్ దాఖలైంది.

తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన పన్నీర్ సెల్వి మద్రాస్ హైకోర్టులో ఈ పిటిషన్ వేశారు. వీరప్పన్ సినిమా మొత్తం తప్పుల తడకగా ఉందని, విడుదలను ఆపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయాలని ఆమె కోర్టును కోరారు. దీంతోపాటు వీరప్పన్ సినిమాకు జారీచేసిన 'యు' సర్టిఫెకెట్ ఉపసంహరించుకోవాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ప్రాంతీయ కార్యాలయాన్ని కోరారు.

వీరప్పన్ హత్యకు సంబంధించి ఈ సినిమాలో అవాస్తవాలను చూపించారని ఆమె వాదిస్తున్నారు. ఈ చిత్రం జనం మధ్యకు వెళ్తే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశముందని పేర్కొన్నారు. వీరప్పన్ హత్యోదంతంలో మొత్తం తప్పంతా  కర్ణాటక పోలీసులదే అన్నట్టు సినిమాలో చూపించారని అంటున్నారు. 2004లో వీరప్పన్ ను చంపడంలో కర్ణాటక పోలీసులనే బాధ్యులుగా చిత్రీకరించారన్నారు. ఈ క్రమంలో తమిళనాడు పోలీసులు, రాజకీయవేత్తలను తీవ్రంగా అవమానించారని ఆరోపించారు.

తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో తెరకెక్కించిన 'కిల్లింగ్ వీరప్పన్'ను డిసెంబర్ 4న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. ఈ చిత్రాన్ని తెరకెక్కించే హక్కు వర్మ కు లేదని, ఈ కథ తనదని బెంగళూరుకు చెందిన రాజుసివిల్ కోర్టులో పిటిషన్ వేశాడు. దీంతో కోర్టు స్టే విధించింది. అన్ని అరిష్టాలను అధిగమించి విడుదల సిద్ధమని చిత్ర యూనిట్ ప్రకటించగానే వీరప్పన్ భార్య ముత్తు లక్ష్మి పిటిషన్ రూపంలో మరో షాక్ తగిలింది. వీటన్నింటినీ అధిగమించి జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైన ఈ సినిమాపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో విడుదల ప్రశ్నార్థకంగా మారింది.

Post a Comment

Powered by Blogger.