ఆన్‌లైన్‌లో అక్కర్లేదు.. నేరుగా ఇవ్వండి

ఆన్‌లైన్‌లో అక్కర్లేదు.. నేరుగా ఇవ్వండి
క్రమబద్ధీకరణకు హెచ్‌ఎండీఏ వెసులుబాటు
సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లను ఎల్‌ఆర్‌ఎస్/బీఆర్‌ఎస్‌ల కింద క్రమబద్ధీరించుకొనే వారు తమ దరఖాస్తులను నేరుగా అందజేయవచ్చు. గడువు దగ్గరపడటంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనేందుకు వేల సంఖ్యలో ప్రయత్నిస్తుండటంతో హెచ్‌ఎండీఏలో సర్వర్లు మొరాయించిన సంగతి తెలిసిందే. దీంతో దరఖాస్తుదారులకు ఇబ్బంది కలగకుండా చేతిరాత (పెన్ను)తో నింపిన దరఖాస్తులను సైతం స్వీకరించేలా హెచ్‌ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు చర్యలు చేపట్టారు.

నిన్నటివరకు ఆన్‌లైన్‌లోనే విధిగా దరఖాస్తును నింపి ప్రింటవుట్ తీసుకొని దానికి మిగతా డాక్యుమెంట్లు, రూ.10 వేల డీడీని జతచేయాలనే నిబంధన ఉండేది. అలా వచ్చిన దరఖాస్తులనే హెచ్‌ఎండీఏ కౌంటర్‌లో స్వీకరించేవారు. దీంతో జాప్యం అవుతుండటంతో ఆన్‌లైన్‌తో సంబంధం లేకుండా దరఖాస్తులను చేతిరాతతో నింపి నిర్దేశించిన డాక్యుమెంట్లను జతచేసి నేరుగా ఇవ్వాలని కమిషనర్ సూచించారు.

ప్రధానంగా బీఆర్‌ఎస్ దరఖాస్తులకు గతంలో మంజూరు చేసిన ధ్రువపత్రం (ఉంటే), భూమి/బిల్డింగ్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు (గెజిటెడ్ అధికారి ధ్రువీకరించినవి), బిల్డింగ్ ప్లాన్‌కు సంబంధించి లెసైన్స్‌డ్ ఆర్కిటెక్ట్/ ఇంజనీర్‌చే ధ్రువీకరించిన నమూనా (3 సెట్లు), రూ.10 వేల డీడీ (ది మెట్రోపాలిటన్ కమిషనర్, హెచ్‌ఎండీఏ పేరుతో.. ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి), ఇండెమ్నిటీ బాండ్, బిల్డింగ్ ఫొటోలు (ఎలివేషన్ ఫొటో) విధిగా సమర్పించాలని కమిషనర్ సూచించారు.

అలాగే ఎల్‌ఆర్ ఎస్‌కు సంబంధించి భూమి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ (గెజిటెడ్ అధికారి ధ్రువీకరించినది), స్థలం ప్లాన్ (లొకేషన్ స్కెచ్ ప్లాన్), లే అవుట్ ప్లాన్‌లో ప్లాట్ స్థలం, ఖాళీ ప్రదేశం, రోడ్ తదితరాలు, ఇండెమ్నిటీ బాండ్, రూ.10 వేల డీడీ తప్పని సరిగా దరఖాస్తుతోపాటు జతచేయాలని తెలిపారు. గడువులోగా తీసిన డీడీలున్న దరఖాస్తులన్నింటినీ స్వీకరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.

Post a Comment

Powered by Blogger.