రాజమౌళి టైటిల్ వాడేస్తున్నాడు
బాహుబలి సినిమాతో ఒక్కసారిగా అంతర్జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించిన రాజమౌళి, ప్రస్తుతం బాహుబలి సీక్వెల్ ను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో మరోసారి సంచలనం సృష్టించటం ఖాయమని నమ్ముతున్నారు సినీజనాలు. దీంతో ఇంతటి భారీ విజయం తరువాత రాజమౌళి చేయబోయే నెక్ట్స్ సినిమా ఏంటి అన్న చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. ముఖ్యంగా గరుడ పేరుతో ఓ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించాలని భావిస్తున్నాడన్న వార్త బలంగా వినిపించింది.
అంతేకాదు మహేష్ బాబు, మోహన్ లాల్, ఎన్టీఆర్ లాంటి స్టార్లు ఈ సినిమాలో నటిస్తున్నారంటూ కూడా రూమర్స్ వినిపించాయి. ఈ వార్తలు ఖండించిన రాజమౌళి గరుడ పేరుతో భారీ చిత్రం చేసే ఆలోచనైతే ఉందంటూ చెప్పాడు. అయితే ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో రాజమౌళి గరుడకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. ఇప్పుడు మరోసారి గరుడ సినిమా వార్తల్లోకి వచ్చింది.
రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీగా తెరకెక్కిద్దామనుకున్న గరుడ పేరుతో తమిళ హీరో విక్రమ్ సినిమా చేయబోతున్నాడట. తిరు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా త్వరలోనే వస్తుందంటున్నారు చిత్రవర్గాలు. మరి తన సినిమాకు అనుకుంటున్న టైటిల్, విక్రమ్ వాడేయటం పై జక్కన్న ఎలా స్పందిస్తాడో చూడాలి.
Post a Comment