ప్రజా కళాకారుడు,విప్లవ గాయకుడు కోటి అరెస్టు పై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.శనివారం నాడు గుంటూరులో వివిధ ప్రజా సంఘాలు ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో పాల్గొని బైటికి రాగానే కోటిని అరెస్టు చేసారు. కోటి అరెస్టు అక్రమమని ఆరోపిస్తున్న ప్రజాసంఘాలు ఆదివారం నాడు హైదరాబాద్‌లోని గన్‌పార్కు ఎదుట ప్రదర్శన నిర్వహించారు.కొట్టేసిన కేసును పట్టుకుని ప్రజాకళాకారుల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అమరావతి పేరుతో జరుగుతున్న విధ్వంసాన్ని ప్రశ్నించే ప్రయత్నంలో ప్రజలకు తోడుగా ఉన్న కోటిని కక్షపూరితంగా కేసులో ఇరికించారని ప్రజాసంఘాల నేతలు ధ్వజమెత్తారు. ఎప్పుడో పదేళ్ల కిందట ఎస్పీ లడ్హాపై జరిగిన దాడి కేసును ఒంగోలు సెషన్ కోర్టు కొట్టేసినప్పటికీ... మళ్లీ దాన్ని సాకుగా చూపి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బేషరతుగా కోటిపై పెట్టిన కేసులను ఎత్తివేయడంతో పాటు అతన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రజాసంఘాల నేతలు... సామ్రాజ్యవాద విష సంస్కృతికి వ్యతిరేకంగా తమ గళాలు వినిపిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
Post a Comment