సిడ్నీ:ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి వన్డేలో 331 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా దీటుగా బదులిస్తోంది. టీమిండియా 30.0 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 192 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. తొలుత శిఖర్ ధావన్(78; 56 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడగా, రోహిత్ శర్మ(75 నాటౌట్) కుదురుగా ఆడుతూ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ జోడీ తొలి వికెట్ కు 123 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి టీమిండియాకు శుభారంభాన్నిఅందించింది. అనంతరం శిఖర్, విరాట్ 8) లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు చేరారు. రోహిత్ కు జతగా, మనీష్ పాండే(30 నాటౌట్) క్రీజ్ లో ఉన్నాడు.
అంతకుముందు ఆసీస్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. వార్నర్(122; 113 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు), మిచెల్ మార్ష్(102 నాటౌట్;84 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు )లు శతకాలతో దుమ్మురేపి భారీ స్కోరులో సహకరించారు. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయాల్సిదింగా ఆసీస్ ను ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ ఆదిలోనే ఫించ్(6) వికెట్ ను కోల్పోయింది. అనంతరం కెప్టెన్ స్టీవ్ స్మిత్(28), జార్జ్ బెయిలీ(6)లు నిరాశపరచడంతో ఆసీస్ 78 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించింది. ఆపై షాన్ మార్ష్(7) నాల్గో వికెట్ గా అవుటయ్యాడు. అయితే అప్పటికే క్రీజ్ లో కుదురుకున్న వార్నర్ ఏమాత్రం తడబాటు పడకుండా వన్డే కెరీర్ లో ఐదో సెంచరీ సాధించాడు. అతనికి జతగా మిచెల్ మార్ష్ కూడా రాణించడంతో ఆసీస్ స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఈ జోడీ ప్రత్యేకంగా ఐదో వికెట్ కు 118 పరుగులు నమోదు చేసి ఆసీస్ ను పటిష్టస్థితికి చేర్చింది. అనంతరం మిచెల్ మార్ష్ -వేడ్ ల జోడి ఆరో వికెట్ కు మరో 85 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో ఆసీస్ మూడొందలకు పైగా స్కోరును చేయగల్గింది.
Post a Comment