- ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు, టీచర్ల హాజరుపై విద్యాశాఖ దృష్టి
- మార్చిలో ప్రయోగాత్మకంగా పటాన్‌చెరులో అమలు
- ఫలితాల ఆధారంగా వచ్చే విద్యా సంవత్సరం అన్ని స్కూళ్లలో అమలు!
- మొదట విద్యార్థులకు.. తరువాత టీచర్లకు వర్తింపజేసే అవకాశం
- అవసరమైన చర్యలపై కసరత్తు చేస్తున్న విద్యాశాఖ
- విద్యార్థుల సమాచారమంతా ఆన్‌లైన్‌లో నమోదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నమోదుకు బయోమెట్రిక్ విధానం అమలుపై విద్యాశాఖ దృష్టి సారించింది. ప్రయోగాత్మకంగా మెదక్ జిల్లా పటాన్‌చెరు మండలంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఈ మార్చి నెలలో బయోమెట్రిక్ విధానాన్ని పరిశీలించనుంది. ఇందుకోసం ఆ మండలంలోని విద్యార్థుల సమాచారాన్ని ఈ నెలాఖరులోగా ఆన్‌లైన్ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇక్కడి ఫలితాలను బట్టి వచ్చే విద్యా సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమల్లోకి తేవాలని భావిస్తోంది. దీనిని ముందుగా విద్యార్థులకు మాత్రమే అమలు చేసి.. భవిష్యత్తులో ఉపాధ్యాయులకు కూడా వర్తింపజేసే అవకాశముందని విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి.
సమాచారమంతా ఆన్‌లైన్..
బయోమెట్రిక్ విధానం అమలు చేయాలంటే ముందుగా విద్యార్థుల సమాచారమంతా ఆన్‌లైన్ చేయాల్సి ఉండటంతో... ప్రస్తుతం విద్యాశాఖ ఆ పనిలో పడింది. అన్ని జిల్లాల్లోని మేనేజ్‌మెంట్ ఇన్‌ఫర్మేషన్ సిస్టం (ఎంఐఎస్) కో-ఆర్డినేటర్ల సహకారంతో విద్యార్థుల సమాచారాన్ని కంప్యూటరీకరిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కలిపి 43,861 ఉండగా... వాటిలో 59,54,376 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారందరి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఇప్పటివరకు 47,07,862 మంది విద్యార్థుల సమాచారాన్ని కంప్యూటరీకరించారు. విద్యార్థులందరి సమాచారాన్ని ఆన్‌లైన్ చేయడం ద్వారా వివిధ రకాల చర్యలు చేపట్టవచ్చని విద్యాశాఖ భావిస్తోంది. దాంతోపాటు బయోమెట్రిక్ విధానం అమలుకు చర్యలు చేపడుతోంది.
అక్రమాలు, అవకతవకలకు చెక్..
ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానం అవసరమని విద్యాశాఖ ఎప్పటి నుంచో భావిస్తోంది. కానీ భారీగా నిధులు వెచ్చించాల్సి ఉండడంతో వెనక్కి తగ్గుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, టీచర్ల హాజరుపై సీరియస్‌గా ఉండడం, కేంద్ర ప్రభుత్వం కూడా విద్యా సంబంధ పథకాల్లో పక్కా సమాచార వ్యవస్థ ఉండాలని స్పష్టం చేయడంతో... విద్యార్థుల సమాచారాన్ని ఆన్‌లైన్ చేస్తోంది. బయోమెట్రిక్ విధానం అమలుకు చర్యలు చేపట్టింది. దీనిద్వారా పాఠశాలల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలకు చెక్ పెట్టవచ్చని విద్యాశాఖ భావిస్తోంది. మధ్యాహ్న భోజనం వంటి పథకాల్లో తప్పుడు లెక్కలకు ఆస్కారం ఉండదని యోచిస్తోంది.
ఇక విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా టీచర్ల హేతుబద్ధీకరణ చేసినప్పుడు.. కొంత మంది టీచర్లు తామున్న పోస్టులు రద్దవుతాయన్న ఉద్దేశంతో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నట్లుగా రికార్డు చేసిన సందర్భాలు ఉన్నాయి. బయోమెట్రిక్ ద్వారా ఇలాంటివాటిని నిరోధించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా టీచర్ల హాజరును పెంచవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా టీచర్ల హాజరు 70 నుంచి 75 శాతం వరకే ఉంటోందని ఇటీవల విద్యాశాఖ ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో చే పట్టిన అధ్యయనంలో తేలింది. కొంత మంది టీచర్లు లీవ్ లెటర్ ఇవ్వడం, సాయంత్రం వరకు పర్యవేక్షణాధికారులు ఎవరూ తనిఖీకి రాకపోతే ఆ లేఖను చింపేసి, సంతకాలు చేయడం వంటివి జరుగుతున్నట్లు కూడా గుర్తించారు. దీంతో టీచర్లకు బయోమెట్రిక్ విధానం అమలుచేస్తే ఇలాంటివాటిని నియంత్రించవచ్చని యోచిస్తున్నారు.
Post a Comment