ప్రొ కబడ్డీ లీగ్ అంబాసిడర్‌గా రానా
ప్రొ కబడ్డీ లీగ్ మూడో సీజన్‌కు సినీ నటుడు దగ్గుబాటి రానా ప్రచారకర్తగా వ్యవహరించనున్నాడు. టాలీవుడ్‌తో పాటు ఇటీవల ‘బాహుబలి’ చిత్రం ద్వారా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకున్న రానాను తమ బ్రాండ్ అంబాసిడర్‌లలో ఒకరిగా ఎంచుకున్నట్లు స్టార్ గ్రూప్ ప్రకటించింది. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో రానాతో పాటు నిర్వాహకులు పాల్గొన్నారు. లీగ్‌లో భాగమైన తెలుగు టైటాన్స్ జట్టు ప్రచార వీడియోలో కూడా రానా నటించాడు. ‘గ్రామీణ క్రీడగా మాత్రమే గుర్తింపు తెచ్చుకున్న కబడ్డీని సినిమాల్లోనే ఎక్కువగా చూశాం.
ఈ స్థాయికి క్రీడ ఎదుగుతుందని ఎవరూ ఊహించలేదు. ప్రొ కబడ్డీ విజయవంతం కావడం సంతోషకరం. ఈ లీగ్‌లో భాగం అయినందుకు గర్వపడుతున్నా’ అని రానా వ్యాఖ్యానించాడు. తొలి సీజన్‌తో పోలిస్తే రెండో సీజన్‌లో తెలుగు రాష్ట్రాల్లో కబడ్డీ లీగ్ చూసే టీవీ ప్రేక్షకుల సంఖ్య నాలుగు రెట్లు కావడం ఈ ప్రాంతాల్లో లీగ్‌కు ఉన్న ఆదరణను సూచిస్తోందని, వైజాగ్‌లోనూ అదే స్పందనను ఆశిస్తున్నట్లు స్టార్ గ్రూప్ ప్రతినిధి అనుపమ్ గోస్వామి వెల్లడించారు. ఈ నెల 30న విశాఖపట్నంలో ప్రొ కబడ్డీ లీగ్ ప్రారంభమవుతుంది. మార్చి 5న ఢిల్లీలో ఫైనల్ నిర్వహిస్తారు.
Post a Comment