ఎయిమ్స్ వైద్య బృందం నివేదిక
♦ ఇదే విషయాన్ని వెల్లడించిన ఎఫ్‌బీఐ
♦ కడుపులో ‘అల్ప్రాక్స్’ తాలూకు అవశేషాలు
♦ శరీరంపై సూది మార్కు: ఢిల్లీ కమిషనర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ విషం వల్లే మృతిచెందినట్లు ఎయిమ్స్ వైద్యులు ధృవీకరించారు. అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా ఇదే విషయాన్ని పేర్కొనడం గమనార్హం. ఆమె శరీరంలో మోతాదుకు మించిన ‘అల్ప్రాక్స్’ అనే మత్తు పదార్థం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మత్తు పదార్థాన్ని ఇంజక్షన్ ద్వారా ఎక్కించారా అన్న విషయాన్ని మాత్రం వారు త్రోసిపుచ్చలేదు. ఎఫ్‌బీఐ మాత్రం ఆమె శరీరంలో ‘లిడోసియినే’ అనే రసాయన పదార్థం ఉన్నట్లు పేర్కొందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. సునంద శరీరంపై సూది మార్కు ఉందని, కాబట్టి ‘ఇంజక్షన్’ కోణంలోనూ సిట్ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఎఫ్‌బీఐ అభిప్రాయపడింది. అలాగే ఆమె శరీరంలో ఖాలీగా ఉన్న 27 అల్ప్రాక్స్ టాబ్లెట్లు ఉన్నాయని, క్లోమం, కిడ్నీల్లో, రక్తంలో ఈ మత్తు పదార్థం తాలుకూ పదార్థాలు ఉన్నట్లు పేర్కొంది.
అదేవిధంగా ఆమె శరీరంపై పంటి గాట్లతో సహ పలు చోట్ల గాయాలున్నట్లు ఎఫ్‌బీఐ నివేదించింది. కాగా మెడికల్ బోర్డు రిపోర్టుపై స్పందించేందుకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ నిరాకరించారు. త్వరలో దర్యాప్తు పూర్తి చేసి వివరాలను కోర్టుకు నివేదిస్తామని, అప్పుడే మీడియాకు వెల్లడిస్తామని తెలిపారు. 2014, జనవరి 17న సునంద పుష్కర్ ఓ స్టార్ హోటల్ మృతి చెందిన విషయం విదితమే. దీనిపై కమిషనర్ బస్సీ గతంలో స్పందిస్తూ.. సునందది అనుమానాస్పద మృతిగా పేర్కొన్నారు. ఎయిమ్స్ వైద్యులు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
దర్యాప్తుపై ఎయిమ్స్ ఆందోళన...
సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసు దర్యాపుపై ఎయిమ్స్ బోర్డు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసులు ఎఫ్‌బీఐకి అందజేసిన ‘షాంపిల్స్’లో చాలా వరకు దెబ్బతిని ఉన్నాయని, తక్కువ మోతాదులో ఉన్నాయని పేర్కొంది. ఎఫ్‌బీఐకి శాంపిల్స్ పంపడంలో ఢిల్లీ పోలీసులు ఆలస్యం చేశారని దీంతో అవి కొంత పాడయ్యాయని ఎయిమ్స్ అభిప్రాయపడింది.
Post a Comment