పోలీసు అధికారిపై కాల్పులు జరిపింది అతడే
రియాజ్ భత్కల్ ద్వారా ఐఎంలోకి
2008 నుంచి పూర్తి అజ్ఞాతవాసం

 
సాక్షి, హైదరాబాద్: బెంగళూరులోని పరప్పన అగ్రహార ప్రాంతంలో శనివారం తెలంగాణ పోలీసు అధికారిపై హత్యాయత్నం చేసిన ఉగ్రవాది ఆలమ్ జబ్ అఫ్రిదీ అని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నిర్థారించింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్‌గా ఉండి, 2008 నుంచి అజ్ఞాతంలో ఉన్న ఇతగాడు ప్రస్తుతం జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్ ఉగ్రవాద సంస్థకు శిక్షకుడిగా పని చేస్తున్నాడని అధికారులు చెబుతున్నారు. ఇటీవల బెంగళూరులోని ఫ్రెంచ్ కాన్సులేట్‌కు పది రోజుల క్రితం వచ్చిన బెదిరింపు లేఖ సైతం ఇతడి పనేనని దాదాపు నిర్థారించాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్ జోహాపురా ప్రాంతానికి చెందిన ఆలమ్ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ద్వారా ఉగ్రవాద బాట పట్టాడు.

హలోల్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద శిక్షణకు హాజరుకావడంతో పాటు మరికొందరినీ ఉగ్ర బాట పట్టించాడు. 2008లో జరిగిన అహ్మదాబాద్, సూరత్, జైపూర్ పేలుళ్లలో కీలకపాత్ర పోషించిన ఇతడికి ఐఎం మాస్టర్‌మైండ్స్ రియాజ్, ఇక్బాల్ భత్కల్స్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. నాటి పేలుళ్లలో బాంబులు పెట్టడానికి వినియోగించిన సైకిళ్లను ఆలమే సమకూర్చాడు. నిఘా, దర్యాప్తు సంస్థలు 2009లో ఐఎం మాడ్యూల్‌ను గుర్తించి వరుస అరెస్టులు చేశాయి. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆలమ్ అనేక ప్రాంతాల్లో సంచరిస్తూ తలదాచుకున్నాడు.
 
మెకానిక్‌గా అవతారం...
దాదాపు మూడేళ్లుగా బెంగళూరులోని హోసూర్ రోడ్ దొడ్డనాగమంగళం ప్రాంతంలో ఉంటున్న ఆలమ్... రఫీఖ్ అహ్మద్ పేరుతో మెకానిక్‌గా చెలామణి అవుతున్నాడు. ప్రస్తుతం సిరియాలో ఉన్న షఫీ ఆర్మర్ ప్రోద్బలంతో కొత్తగా రిక్రూట్ అవుతున్న ‘జునూద్’ క్యాడర్‌కు శిక్షణ ఇవ్వడానికి అంగీకరించాడు. బాంబుల తయారీ, ఆయుధాల వినియోగంపై ఎక్కడ శిక్షణ ఇవ్వాలనే అంశంపై ఈ సంస్థ చీఫ్ ముంబైకి చెందిన ముదస్సిర్‌తో పాటు హైదరాబాదీ నఫీస్ ఖాన్‌తోనూ సంప్రదింపులు జరుపుతున్నాడు. శుక్రవారం వీరు అరెస్టు కావడం, విచారణలో ఆలమ్ పేరు వెలుగులోకి రావడంతోనే ఎన్‌ఐఏ అధికారులు తెలంగాణ అధికారుల సాయంతో శనివారం అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పోలీసు అధికారిపై హత్యాయత్నం జరిగింది.

బెంగళూరులోని ఫ్రెంచ్ కాన్సులేట్ కార్యాలయానికి ఈ నెల 21న అందిన బెదిరింపు లేఖ సైతం ఇతడి పనిగానే ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. దొడ్డనాగమంగళంలోని ఇతడి ఇంట్లో తనిఖీలు చేసిన అధికారులు ఈ తరహాలోనే రాసి ఉన్న దాదాపు 20 బెదిరింపు లేఖల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆలమ్‌పై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు సైతం జారీ చేశారు. హత్యాయత్నం కేసులో బెంగళూరు పోలీసు కస్టడీలో ఉండగానే ఇతడు రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది.

Post a Comment

Powered by Blogger.