అడిలైడ్:  ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ ల ట్వంటీ 20 సిరీస్ లో టీమిండియా బోణి చేసింది. మంగళవారం ఇక్కడ జరిగిన తొలి ట్వంటీ20లో టీమిండియా 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ విసిరిన 189 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ 19.3 ఓవర్లలో 151 పరుగులకే చాపచుట్టేసి ఘోర ఓటమి పాలైంది. కెప్టెన్ ఆరోన్ ఫించ్(44) ఫర్వాలేదనిపించగా, స్టీవ్ స్మిత్(21), డేవిడ్ వార్నర్(17), షేన్ వాట్సన్(12), ట్రావిస్ హెడ్(2), వేడ్(5), ఫాల్కనర్ (10)లు తీవ్రంగా నిరాశపరచడంతో ఆసీస్ చిత్తుగా ఓడింది.
తొలుత బ్యాటింగ్ లో ఆకట్టుకున్నటీమిండియా.. ఆపై బౌలింగ్ లో కూడా రాణించి సమష్టి విజయాన్ని నమోదు చేసింది. టీమిండియా బౌలర్లలో బూమ్రా మూడు వికెట్లు సాధించగా, అశ్విన్, జడేజా, హార్దిక్ పాండ్యాలకు తలో రెండు వికెట్లు లభించాయి. చాలాకాలం తర్వాత జట్టులోకి వచ్చిన ఆశిష్ నెహ్రా నాలుగు ఓవర్లలో 30 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా విరాట్ కోహ్లి దూకుడుగా ఆడటంతో 189 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. కోహ్లి(90 నాటౌట్; 55 బంతుల్లో9 ఫోర్లు, 2 సిక్స్లర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా, అతని జతగా సురేష్ రైనా(41;34 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. ఓపెనర్ రోహిత్ శర్మ (31; 20 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్) దూకుడుగా ఆడే క్రమంలో అవుట్ కాగా, శిఖర్ ధావన్(5) అనవసర షాట్ కు యత్నించి అవుటయ్యాడు. ఈ జోడి తొలి వికెట్ కు 40 పరుగులు చేసింది. కాగా, వీరిద్దరూ ఒక పరుగు వ్యవధిలో అవుట్ కావటంతో టీమిండియా జట్టులో ఒక్కసారిగా ఆందోళన రేగింది.


అయితే విరాట్, రైనాల జోడి సమయోచితంగా ఆడి ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది.  ఈ క్రమంలోనే విరాట్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా, మరోవైపు రైనా కూడా చక్కటి సహకారం అందించాడు. ఈ జోడి మూడో వికెట్ కు 134 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చింది. అయితే చివరి ఓవర్ రెండు బంతికి రైనా అవుటయ్యాడు. ఆ తరుణంలో బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(11 నాటౌట్; 3బంతుల్లో 1 సిక్స్, 1ఫోర్) బ్యాట్ ఝుళిపించడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో విజయంతో టీమిండియా 1-0 ఆధిక్యం సాధించింది. టీమిండియా విజయంలో ప్రధాన భూమిక పోషించిన విరాట్ కోహ్లికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.


మ్యాచ్ విశేషాలు
*ఈ మ్యాచ్ ద్వారా ట్వంటీ 20 ల్లో 1000 పరుగులను పూర్తి చేసుకున్న రెండో  భారత్ ఆటగాడిగా సురేష్ రైనా నిలిచాడు. అంతకుముందు విరాట్ కోహ్లి ఒక్కడే భారత్ నుంచి వెయ్యి పరుగుల క్లబ్ లో ఉన్నాడు.

*ట్వంటీ20ల్లో మూడో వికెట్ కు విరాట్-రైనా(134)పరుగుల భాగస్వామ్యమే భారత్ తరపున అత్యధికం కావడం విశేషం.
 
*ట్వంటీ 20ల్లో  ఏ వికెట్ కైనా భారత్ కు ఇది మూడో అత్యధిక భాగస్వామ్యం.
*అంతకుముందు అడిలైడ్ లో ఆడిన రెండు ట్వంటీ 20 మ్యాచ్ ల్లోనూ ఆసీస్ విజయం సాధించగా,  ఈ స్టేడియంలో తొలిసారి ఓటమిని ఎదుర్కొంది.

Post a Comment

Powered by Blogger.