నియమం 1- ఎవరూ సమానం కాదు: నాన్న ఆఫీసుకు వెళతాడు. అమ్మ ఇంట్లో ఉంటుంది. నాన్న డబ్బు తెస్తాడు. అమ్మ ఖర్చు పెడుతుంది. నాన్నకు అమ్మ గౌరవం ఇస్తుంది. అమ్మకు నాన్న విలువ ఇస్తాడు. ఇద్దరూ వయసులో సమానం కాదు. పనిలో సమానం కాదు. బాధ్యతల్లో సమానం కాదు. పిల్లలకు చనువులో సమానం కాదు. కోపతాపాల్లో ఇష్టాయిష్టాల్లో సమానం కాదు. కాని- కుటుంబం అంతిమంగా సాధించాల్సిన ఫలవంతమైన పురోగతిలో- ఆ బాధ్యతను నెరవేర్చడంలో మాత్రం సమానం. నాన్నకు కోపం వచ్చినప్పుడు అమ్మకు తక్కువ కోపం అంటే నాన్నకు సమాన ం కాని సామాన్య కోపం రావాలి. అమ్మకు చికాకు ఎక్కువైనప్పుడు నాన్నకు అతి తక్కువ చికాకు రావాలి. ఏదైనా కోరిక తీరడానికి అమ్మ తొందర చేస్తుంటే నాన్న అందుకు సమానం కాలేకపోతున్నందుకు కారణం చెప్పగలగాలి. నాన్న ఏ విషయంలోనైనా దూకుడుగా ఉంటే అమ్మ అతి మందగమనంతో దానిని ఎందుకు నిలవరిస్తుందో నాన్నకు చెప్పగలగాలి. అమ్మ మూతి ముడిస్తే నాన్న నవ్వాలి. నాన్న భృకుటి ముడిపడితే అమ్మ మోము అతి ప్రశాంతం కావాలి. కనుక ఇంట్లో అమ్మా నాన్న సమానంగా ఉండకూడదు. ఏ ఇల్లైనా సంతోషంగా ఉండాలంటే ఆ ఇంటి రాజ్యాంగంలో రాసుకోవాల్సిన మొదటి రూలు.

నియమం 2: స్వేచ్ఛ అంత సులువు కాదు: అబ్బాయి మోటరు సైకిల్ అడుగుతాడు. ఇవ్వాలి. కాని కొంతకాలం పాటు ఒంటరిగా నడిపే స్వేచ్ఛ ఇవ్వకూడదు. నాన్నో అన్నయ్యో వెనుక కూచోవాలి. జాగ్రత్తగా నడిపే అనుభవం వచ్చేవరకూ బంధనాలు వేయాలి. ఫలానా చదువు చదువుతానని అనవచ్చు. చదవనివ్వాలి. కాని చదువును ఫలవంతం చేసుకునే వరకూ పర్యవేక్షణ ఉండాలి. అమ్మాయికి స్నేహితులు అవసరం. కాని ఆ స్నేహితులందరితో పరిచయం అమ్మకూ నాన్నకూ కూడా ఉండాలి. ఫోన్లు అడిగితే ఇవ్వాలి. ఫేస్‌బుక్‌లలో ఉంటానంటే ఉండనివ్వాలి. వాట్సప్‌లు వాడతానంటే వాడనివ్వాలి. కాని ఏది ఎంతవరకు ఎలా ఏ పరిణితితో వాడుతున్నారన్న విషయంలో సూచనప్రాయంగానైనా సలహా ఉండాలి. హక్కును సాధించుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. ధిక్కరించగలిగే స్వేచ్ఛను నిరోధించాలి. స్వేచ్ఛకు ఒక బాధ్యత ఉంటుందని బాధ్యతకు ఒక పరిమితి ఉంటుందని తెలియచేయాలి. పిల్లలు పర్సనల్‌రూములు అడుగుతారు. ఇవ్వగలిగితే ఇవ్వాలి. కాని తలుపు మూసుకునే స్వేచ్ఛకూ గడియ వేసుకునే స్వేచ్ఛకూ మధ్య ఉన్న అంతరాన్ని సున్నితంగా హెచ్చరించాలి. ఇల్లు పిల్లలతో పాటు సంతోషంగా ఉండాలంటే స్వేచ్ఛ అంత సులువుగా దక్కదన్న నియమాన్ని కుటుంబ రాజ్యాంగంలో రాసుకోవాలి.

నియమం 3 - ఎక్స్‌ప్లాయిట్ చేయాలి: అమ్మ అలసిపోతోంది. నాన్న- అబ్బాయిని పిలిచి ఫలానా పని నువ్వు భలే చేస్తావురా అనాలి. అమ్మాయిని పిలిచి మనిద్దరం కలిసి వంట చేస్తే ఆ రుచే వేరు అని ఊరించాలి. నాన్నకు పొదుపు తెలియకపోతే వెచ్చాల లెక్క ఎక్కువ చూపించి మిగిలిన మూడు వేలతో చిట్టీ కట్టాలి. అమ్మకు చీరల పిచ్చి ఎక్కువగా ఉంటే అప్పులున్నాయని చెప్పి పాలసీకి పడేస్తూ ఉండాలి. పిల్లలు బ్రాండెడ్ బట్టలు అడిగితే ఫ్యాక్టరీ ఔట్‌లెట్‌లో బోలెడంత వెరైటీ ఉంటుందని పట్టుకుపోవాలి. నిస్సాన్ అడిగితే నానోకు కూడా నాలుగు చక్రాలే ఉంటాయని చెప్పగలగాలి. పుస్తకాల్లోనే కూరుకుపోతూ ఉంటే గనక డబ్బులిచ్చి ఫ్రెండ్స్‌తో కెఎఫ్‌సికి పంపాలి. సినిమాలూ షికార్లు ఎక్కువైతే గనక పిచ్చాపాటికని చెప్పి తెలిసిన మాస్టారితో కబుర్లలోనే కర్తవ్యం బోధించాలి. బంధువుల ఊరు భలే బాగుంటుందని చెప్పి బంధాలను బలపరచాలి. కలాం పేపర్‌బాయ్‌గా చేయడం వల్ల అంతవాడయ్యాడని స్వీయ సంపాదన నేర్పించాలి. ఒన్ గ్రామ్ గోల్డయినా అమ్మకు బాగుంటుందని చెప్పాలి. షటిల్ సూపర్‌గా ఆడతావంటూ నాన్నను క్లబ్బు ముఖం చూడకుండా చేయాలి. చిన్న చిన్న సంతోషాలు కావాలంటే చిన్నపాటి ఎక్స్‌ప్లాయిటేషన్లు చేయాలని కుటుంబ రాజ్యాంగంలో రాసుకోవాల్సిన మరో రూలు.

నియమం 4: అసహనం ఉండాలి: నానమ్మ ఫలానా పని మనిషిని ఫలానా కులమని పనిలో వద్దంటుంది. అప్పుడు అసహనం చూపాలి. తాతయ్య ఫలానా స్నేహితుడు ఫలానా మతమని కనుక స్నేహం వద్దని అంటాడు. అప్పుడు అసహనం చూపాలి. అబ్బాయి ఫలానా మతం వారితో తిరుగుతూ ఫలానా మతం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంటాడు. అప్పుడు తీవ్ర అసహనం వ్యక్తం చేయాలి. అమ్మాయి ఫలానా ప్రాంతం వారంటే ద్వేషం పెంచుకుంటుంది. అసహనంతో చెలరేగిపోవాలి. కోవెల, మస్జీద్, చర్చ్... ఇవి వేరువేరనే అసహనం ప్రదర్శించే వారి పట్ల అసహనం ప్రదర్శించాలనే సంస్కారం ఇంట్లో ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి. కనుక మంచి కోసం కొంత అసహనం ఉండాలి. మనుషులను విడదీయాలనే అసహనం పట్ల అసహనం ఉండాలి. కుటుంబం చైతన్యంతో ఉండాలంటే ఇలాంటి అసహనం తప్పనిసరి అని కుటుంబ రాజ్యాంగంలో రాసుకోవాల్సిన మరో రూలు.

నియమం 5: సంస్కృతిని నిరోధించాలి: మనదంతా వెనుకబాటుదనం... సంస్కృతి అంటే పాశ్చాత్య దేశాలదే అనుకునే సంస్కృతిని నిరోధించాలి. మనదే గొప్ప... అవతలివారిదంతా అథమం అనే సంస్కృతిని కూడా నిరోధించాలి. ఫలానావారి భాష గొప్పది కాదని, ఫలానావారి మాట గొప్పది కాదని, ఫలానావారి యాస గొప్పదికాదని, ఫలానావారి ఆచారం గొప్పది కాదని, ఫలానావారి ఉత్సవం గొప్పది కాదని, ఫలానావారి రీతి గొప్పది కాదని అమ్మో, నాన్నో, అమ్మాయో, అమ్మాయో అంటూ ఉంటే గనక అలాంటి సంస్కృతి ఇంట్లో అడుగు పెట్టకుండా నిరోధించాలి. ఎవరికైనా ఆత్మీయంగా ఆకు పరిచే, ఏ సంస్కృతి ప్రవేశానికైనా వాకిలి తీసే విధంగా ఇల్లు ఉండాలని కుటుంబ రాజ్యాంగంలో రాసుకోవాల్సిన ముఖ్యమైన రూలు.

నియమం 6: మరణాన్ని స్వాగతించాలి: పనివాళ్ల పిల్లలు పనివాళ్లే అనే నియమపు మరణాన్ని స్వాగతించాలి. పేదవాళ్ల వారసులు పేదవాళ్లే అనే పరంపర మరణాన్ని స్వాగతించాలి. రైతుల ఖర్మ రైతుదే అనే నిర్లిప్తత మరణాన్ని స్వాగతించాలి. వ్యవస్థ దుర్గతి వ్యవస్థదే అనే నిరాశ మరణాన్ని స్వాగతించాలి. దేశం ఇలా నాశనం అవ్వాల్సిందే అనే నిస్సహాయత మరణాన్ని స్వాగతించాలి. అమ్మా నాన్నా అమ్మాయి అబ్బాయి కుటుంబ సభ్యుల హోదా నుంచి బాధ్యత కలిగిన పౌరుల హోదాకు ఎదిగినప్పుడు ఈ మరణాలన్నింటి కోసం కృషి చేసి జీవానికి జీవితానికి జీవం పోయాలి. అలాంటి చైతన్యం కలిగి ఉండాలని ప్రతి కుటుంబం తన రాజ్యాంగంలో తప్పనిసరిగా రాసుకోవాలి. స్వార్థం మరణించేలా చేసి సంఘ ప్రయోజనం నిలబెట్టేలా చేయగలగాలి.

నియమం 7: సమాచారం ఉండరాదు: అమ్మాయి పెళ్లి అమ్మాయితో సంప్రదించకుండా నాన్న ఖరారు చేస్తాడు అనే సమాచారం అమ్మాయికి ఉండరాదు. అబ్బాయి చదువు అబ్బాయికి సంబంధం లేకుండా నాన్న ఫీజు కడతాడు అనే సమాచారం అబ్బాయికి ఉండరాదు. అమ్మా నాన్నలు ఏ నిర్ణయమైనా తీసుకోగలరు అనే సమాచారం పిల్లలకు ఉండరాదు. పిల్లలు ఏ ఉల్లంఘన అయినా చేయగలరు అనే సమాచారం తల్లిదండ్రులకు ఉండరాదు. చెప్పాలంటే అక్కర్లేని సమాచారం ఎవరి దగ్గరా ఉండరాదు. అవసరమైన సమాచారం ప్రతి ఒక్కరి దగ్గరా ఉండాలి. నాలుగు విడివిడి సెల్‌ఫోన్ సంభాషణల సమాచారం ఉండరాదు. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ మాట్లాడుకునే సమాచారం ఉండాలి. మాట్లాడుకోవాలనే నియమం... పంచుకోవాలనే నియమం... దాచుకోకూడదనే నియమం ఆఖరు నియమంగా ప్రతి ఇంటి రాజ్యాంగంలో తప్పనిసరిగా ఉండాలి.

ఈ నియమాలను పాటించడం వల్ల ఏ కుటుంబమైనా చిర్రుబుర్రులు లేకుండా పదికాలాలపాటు సుఖసంతోషాలతో మనగలుగుతుంది.

Post a Comment

Powered by Blogger.