ధనాధన్ క్రికెట్‌లో తమదైన ముద్ర చూపిస్తూ చెలరేగిన ధోని సేన అడిలైడ్‌లో అదుర్స్ అనిపించింది. వన్డే పరాజయాల భారాన్ని వెనక్కి తోస్తూ టి20 పోరులో శుభారంభం చేసింది. అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ బ్యాటింగ్‌లో కదంతొక్కిన కోహ్లికి తోడుగా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అశ్విన్ సత్తా చాటడంతో తొలి మ్యాచ్‌లో టీమిండియా ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించింది. ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన కంగారూలు చేతులెత్తేయడంతో గణతంత్ర దినోత్సవాన భారత్ పండుగ చేసుకుంది.

తొలి టి20లో భారత్ ఘనవిజయం
* 37 పరుగులతో ఆసీస్ చిత్తు
* కోహ్లి 90 నాటౌట్
* రాణించిన బుమ్రా
* శుక్రవారం రెండో మ్యాచ్

అడిలైడ్: వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్ ఇచ్చిన విజయోత్సాహం, ఆత్మవిశ్వాసం భారత్ జట్టు టి20ల్లో కూడా వెన్నంటి నిలిచినట్లుంది. ఫలితమే మూడు మ్యాచ్‌ల సిరీస్ మొదటి పోరులో ఏకపక్ష విజయం. మంగళవారం ఇక్కడ జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో భారత్ 37 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 188 పరుగుల భారీ స్కోరు సాధించింది.

‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ విరాట్ కోహ్లి (55 బంతుల్లో 90 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) జోరుకు, రైనా (34 బంతుల్లో 41; 3 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచాడు. అనంతరం ఆస్ట్రేలియా 19.3 ఓవర్లలో 151 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ ఫించ్ (33 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా అంతా విఫలమయ్యారు. జస్‌ప్రీత్ బుమ్రా 23 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, జడేజా, అశ్విన్, హార్డిక్ పాండ్యా తలా 2 వికెట్లు తీశారు. తాజా ఫలితంతో సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో మ్యాచ్ శుక్రవారం మెల్‌బోర్న్‌లో జరుగుతుంది.

రికార్డు భాగస్వామ్యం...
టాస్ గెలిచిన ఆసీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ తరఫున బుమ్రా, హార్దిక్ పాండ్యా, ఆసీస్ ఆటగాడు ట్రెవిస్ హెడ్ ఈ మ్యాచ్‌తో టి20ల్లోకి అరంగేట్రం చేశారు. రోహిత్ శర్మ (20 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) భారత్ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించాడు. టెయిట్ వేసిన రెండు ఓవర్లలో అతను 3 ఫోర్లు, 1 సిక్స్ బాదాడు. 25 పరుగుల వద్ద బాయ్‌స్ సునాయాస క్యాచ్ వదిలేసినా వాట్సన్ వేసిన తర్వాతి ఓవర్లోనే రోహిత్ వెనుదిరిగాడు. ఇదే ఓవర్ ఐదో బంతికి ధావన్ (5) కూడా అవుటయ్యాడు.

ఈ దశలో జత కలిసిన కోహ్లి, రైనా 87 బంతుల్లోనే 134 పరుగులు జత చేసి భారత్ తరఫున మూడో వికెట్‌కు కొత్త రికార్డు నెలకొల్పారు. ఒకవైపు దూకుడు తగ్గించకుండానే... మరోవైపు ఎలాంటి ప్రమాదం లేకుండా సాధికారిక షాట్లతో కోహ్లి చక్కటి బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. రైనా కాస్త తడబడినా తర్వాత నిలదొక్కుకున్నాడు. రైనా అవుటైనా, ధోని (3 బంతుల్లో 11నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) మెరుపులతో చివరి మూడు ఓవర్లలో భారత్ 40 పరుగులు చేసింది. 87 పరుగులకు చేరిన తర్వాత 20వ ఓవర్లో కోహ్లికి రెండు బంతులు మాత్రమే ఆడే అవకాశం రావడంతో సెంచరీ చేయలేకపోయాడు.

కట్టడి చేసిన స్పిన్నర్లు...
భారీ ఛేదనలో ఆసీస్‌కు మంచి ఆరంభమే లభించింది. ఫించ్, వార్నర్ తొలి వికెట్‌కు 31 బంతుల్లోనే 47 పరుగులు జత చేశారు. అశ్విన్ వేసిన రెండో ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. అయితే వార్నర్‌ను అవుట్ చేసి బుమ్రా బ్రేక్ ఇచ్చాడు. పరుగులు ఇవ్వకుండా నిరోధిస్తూ అశ్విన్, జడేజా బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచారు. ఫలితంగా రెండు ఓవర్ల వ్యవధిలో నాలుగు పరుగులకే ఆసీస్ 3 వికెట్లు కోల్పోయింది. స్మిత్ (14 బంతుల్లో 21; 3 ఫోర్లు), హెడ్ (2)లను జడేజా అవుట్ చేయగా, అశ్విన్‌కు ఫించ్ చిక్కాడు. వాట్సన్ (12)ను కూడా అశ్విన్ పెవిలియన్ పంపిం చడంతో కంగారూల ఆశలు గల్లంతయ్యాయి. చివరకు 3 బంతుల ముందే ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. తన తొలి వన్డేలోనే ఆకట్టుకున్న బుమ్రా, తొలి టి20లో చక్కటి ప్రదర్శన చేయడం విశేషం.

టి20ల్లో వేయి పరుగులు పూర్తి చేసుకున్న రెండో భారత ఆటగాడు రైనా (1024). కోహ్లి (1106) ముందున్నాడు.

సమష్టి విజయం...
‘అందరి కృషికి ఫలితం దక్కింది. జట్టులో ఆల్‌రౌండర్ల అవసరం ఎలాంటిదో ఈ మ్యాచ్‌లో  కనిపించింది. టాప్-6 ఆటగాళ్లలో బౌలింగ్ రానివాళ్లు ఉంటే కష్టమవుతుంది. ఎవరైనా బౌలర్ విఫలమైతే ఏం చేయలేం. అలా కాకుండా కీలక సమయంలో కొన్ని ఓవర్లు వేయగలగాలి. ఈ విషయంలో పాండ్యాను అభినందిస్తున్నా. జడేజా కూడా చక్కగా బౌలింగ్ చేశాడు. ఇక కోహ్లి గురించి కొత్తగా చెప్పేదేముంది. ఇప్పుడు అడిలైడ్‌లో అతని పేరిట ఒక స్టాండ్ ఏర్పాటు చేస్తున్నట్లుం ది!  రిటైరయ్యేలోపు ఆస్ట్రేలియాలోని ప్రతీ మైదానంలో అతని పేరిట స్టాండ్ ఉంటుందనేంత బాగా ఆడుతున్నాడు’   -ధోని, భారత్ కెప్టెన్  

11 బంతుల ఓవర్
ఆస్ట్రేలియా గడ్డపై అడుగు పెట్టగానే తొలి టి20 ఆడే అవకాశం దక్కించుకున్న హార్దిక్ పాండ్యాకు తన మొదటి ఓవర్ మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది. తొలి మూడు బంతులను వరుసగా లెగ్ సైడ్ వైడ్‌లుగా వేసిన అతను అదే ఓవర్లో మరో రెండు వైడ్‌లు కలిపి మొత్తం 11 బంతులు విసిరాడు. బ్యాట్స్‌మెన్ ఫోర్, సిక్సర్ కూడా బాదడంతో మొత్తంగా ఓవర్లో 19 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే తర్వాత కీలకమైన లిన్, వేడ్ వికెట్లు తీయడంతో హార్దిక్ బాధ కాస్త తగ్గింది.

ఎవరెలా ఆడారంటే..
చాలా రోజుల తర్వాత భారత జట్టు తరపున బరిలోకి దిగిన యువరాజ్ సింగ్‌కు అసలు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. బౌలింగ్‌లో ఒక ఓవర్ వేసి 10 పరుగులిచ్చిన అతను, లిన్ క్యాచ్‌ను ఎక్స్‌ట్రా కవర్‌లో అద్భుతంగా అందుకున్నాడు. నెహ్రా (1/30) ఫర్వాలేదనిపించగా, అతనిలాగే దాదాపు ఐదేళ్ల తర్వాత బరిలోకి దిగిన ఆసీస్ పేసర్ షాన్ టెయిట్ (0/45)ను భారత బ్యాట్స్‌మెన్ చితక్కొట్టారు. ఇన్నింగ్స్ తొలి బంతిని 150 కిలోమీటర్ల వేగంతో విసరడం మినహా అతను ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు.

కోహ్లి X స్మిత్
చాలా రోజుల తర్వాత కోహ్లి మైదానంలో మాటల రూపంలో తన ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఏదో అనడం విరాట్‌కు కోపం తెప్పించింది. జడేజా బౌలింగ్‌లో ఎక్స్‌ట్రా కవర్‌లో కోహ్లికే క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. వెంటనే ‘ఇటు చూడు. ఇదీ నువ్వు అవుటైన బంతి. దీనిని పట్టుకెళ్లు’ అన్నట్లుగా సైగ చేస్తూ అతని వైపు విసిరాడు. ఆ తర్వాత జట్టు సభ్యులకు కూడా స్మిత్ ప్రవర్తన గురించి కోహ్లి వివరించడం కనిపించింది. అయితే సరిగ్గా ఏం జరిగిందో తెలియకపోయినా... ఒక వైపు బ్యాటింగ్ చేస్తూ మరోవైపు మైక్రోఫోన్ ద్వారా కామెంటేటర్లతో మాట్లాడుతున్న స్మిత్‌ను కోహ్లి తప్పుగా అర్థం చేసుకున్నాడని సమాచారం.

స్కోరు వివరాలు:--
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) ఫాల్క్‌నర్ (బి) షేన్ వాట్సన్ 31; శిఖర్ ధావన్ (సి) మాథ్యూ వేడ్ (బి) షేన్ వాట్సన్ 5; విరాట్ కోహ్లి (నాటౌట్) 90; సురేశ్ రైనా (బి) ఫాల్క్‌నర్ 41; ధోని (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 188.
వికెట్ల పతనం: 1-40; 2-41; 3-175.
బౌలింగ్: షాన్ టెయిట్ 4-0-45-0; రిచర్డ్సన్ 4-0-41-1; ఫాల్క్‌నర్ 4-0-43-1; షేన్ వాట్సన్ 4-0-24-2; బాయ్‌స్ 3-0-23-0; హెడ్ 1-0-9-0.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఫించ్ (ఎల్బీ) (బి) అశ్విన్ 44; వార్నర్ (సి) కోహ్లి (బి) బుమ్రా 17; స్మిత్ (సి) కోహ్లి (బి) జడేజా 21; హెడ్ (ఎల్బీ) (బి) జడేజా 2; లిన్ (సి) యువరాజ్ (బి) పాండ్యా 17; వాట్సన్ (సి) నెహ్రా (బి) అశ్విన్ 12; వేడ్ (సి) జడేజా (బి) పాండ్యా 5; ఫాల్క్‌నర్ (బి) బుమ్రా 10; రిచర్డ్సన్ (బి) నెహ్రా 9; బాయ్‌స్ (సి) పాండ్యా (బి) బుమ్రా 3; టెయిట్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 151.
వికెట్ల పతనం: 1-47; 2-89; 3-89; 4-93; 5-110; 6-124; 7-129; 8-143; 9-149; 10-151.
బౌలింగ్: ఆశిష్ నెహ్రా 4-0-30-1, అశ్విన్ 4-0-28-2, జస్‌ప్రీత్ బుమ్రా 3.3-0-23-3, రవీంద్ర జడేజా 4-0-21-2, హార్దిక్ పాండ్యా 3-0-37-2, యువరాజ్ సింగ్ 1-0-10-0.

Post a Comment

Powered by Blogger.