♦ కీలక ఆధారాలుగా మారిన సోషల్‌మీడియా అకౌంట్స్
♦ ‘ఏయూటీ’ మాడ్యుల్‌ను తొలుత గుర్తించిన అమెరికా
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఏ ఆన్‌లైన్‌ను వినియోగించుకుని విస్తరిస్తోందో.. దానికి అనుబంధంగా ఏర్పడిన జునూద్-అల్-ఖలీఫా-ఏ-హింద్ గుట్టు ఆ ఆన్‌లైన్ ద్వారానే వెలుగులోకి వచ్చింది. భారత్‌లో విస్తరిస్తున్న ఈ నెట్‌వర్క్‌ను తొలుత అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) గుర్తించింది. అక్కడ నుంచి వచ్చిన అధికారిక సమాచారంతో రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ).. ఏయూటీ మాడ్యుల్ గుట్టురట్టు చేయడమేకాక ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేసింది. శుక్ర-శనివారాల్లో హైదరాబాద్‌లో పట్టుబడిన మహ్మద్ నఫీస్ ఖాన్, మహ్మద్ షరీఫ్ మొయినుద్దీన్ ఖాన్, మహ్మద్ ఒబేదుల్లా ఖాన్, అబు అన్స్ ఈ మాడ్యుల్‌కు చెందినవారే.
ప్రత్యేక నిఘా
పారిస్ ఉగ్రదాడుల నేపథ్యంలో సీఐఏ సాంకేతిక నిఘాను పెంచి, కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంది. సిరియా, ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాదులు, అనుమానితుల కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లకు చెందిన ఐపీ అడ్రస్‌లు సేకరించింది. కర్ణాటకలోని భత్కల్ నుంచి వెళ్లి ప్రస్తుతం యూసుఫ్ పేరుతో సిరియా కేంద్రంగా ఐసిస్‌కు అనుబంధంగా పని చేస్తున్న షఫీ ఆర్మర్.. అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్(ఏయూటీ) పేరుతో ఓసంస్థను ఏర్పాటు చేశాడు. ఇతడే ముంబైకి చెందిన ముదాబిర్ ముస్తాఖ్ షేక్‌ను ఆన్‌లైన్ ద్వారా ఉగ్రబాట పట్టించాడు. భారత్‌లో విధ్వంసాల కోసం జునూద్-అల్-ఖలీఫా-ఏ-హింద్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు.
కోడ్స్‌ను డీకోడ్ చేయడంతో..
భారత్‌కు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న షఫీ ఆర్మర్.. ముదాబిర్‌తో సోషల్‌మీడియాలో చాటింగ్ చేస్తున్న విషయం గత ఏడాది గుర్తించిన సీఐఏ లోతుగా ఆరా తీసింది. ఫలితంగా వీరిద్దరూ ఉగ్రదాడులకు కుట్ర పన్నుతున్నారని గుర్తించిన సీఐఏ అప్పటి నుంచి నిశితంగా గమనిస్తూ వచ్చింది. నవంబర్‌లో వీరి మధ్య జరిగిన చాటింగ్‌తో వాతావరణం వేడెక్కుతోం దని, విధ్వంసాలకు రంగంలోకి దిగుతున్నారని గుర్తించింది. ముదాబిర్‌తో షఫీ వాట్సాప్ ద్వారా జరిగిన చాటింగ్‌లో ‘సాత్ కలాష్ రఖ్ దో’ అంటూ ఆదేశాలు ఇవ్వడంతో ఈ కోడ్‌ను డీకోడ్ చేయడంతో సీఐఏ సఫలీ కృతమైంది. దేశంలోని ఏడు ప్రాంతాల్లో విధ్వంసాలకు రెక్కీ సహా అన్ని ఏర్పాట్లు చేయాలన్నది దాని అర్థంగా తేల్చింది. మరికొన్ని కోడ్స్‌ను డీకోడ్ చేసిన తర్వాత సమగ్ర వివరాలతో డిసెంబర్‌లో కేంద్ర హోం శాఖకు లేఖ రాసింది.
Post a Comment