నటుడు ధనుష్ హాలీవుడ్‌లో పరిచయం కానున్న చిత్రం ఖరారైంది. ఈ యువ నటుడి ఎదుగుదల విస్మయం కలిగిస్తోందని చెప్పక తప్పదు. మొదట నటుడిగా సొంత గడ్డపైన తనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆ తరువాత అనతి కాలంలోనే బాలీవుడ్‌లోకి ఎగబాకారు. అక్కడ తొలి చిత్రం రాంజానాతోనే 100 కోట్ల క్లబ్‌లో చేరారు. తదుపరి  ఏకంగా బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్‌తోనే షమితాబ్ అనే చిత్రంలో నటించి ఆహా అనిపించారు.

  తాజాగా హాలీవుడ్‌కే గురి పెట్టారు. బాలీవుడ్ తారలు ఇర్ఫాన్, అనిల్‌కపూర్, ప్రియాంక చోప్రా, దీపిక పడుకొనే, ఓంపురి,సోనూసూద్, గుల్షన్‌గ్రోవర్ తరువాత హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్న నటుడి పట్టికలో ధనుష్ చేరారు. పెర్సేపొలిస్ చిత్రం ఫేమ్ ఇరానీ, ఫ్రెంచ్ దర్శకుడు మర్జానే చిత్రాపి దర్శకత్వం వహించనున్న చిత్రంలో ధనుష్ కథానాయకుడిగా నటించనున్నారు.

 దీనికి ది ఎక్స్‌ట్రార్డనరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ హూ గెట్ ట్రాపెడ్ యిన్ యాన్ ఇకియా కప్‌బోర్డు అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇది ఇరానీ నవల ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం. ఇందులో ధనుష్ సరసన ప్రముఖ హాలీవుడ్ భామలు ఉమా తుర్మన్, అలెగ్జాండ్రా డడ్డారియో(హాలీవుడ్ చిత్రం సాన్ ఆండ్రూస్ ఫేమ్)లు నటించనున్నారు. ఇందులో ధనుష్ భారతదేశానికి చెందిన ఆజా అనే మెజీషియన్‌గా నటించనున్నారట.

  తన తల్లికి సంబంధించిన విషయమై ప్యారిస్‌కు వెళ్లిన ధనుష్‌కు అక్కడ ఎలాంటి సంఘటనలను ఎదుర్కొన్నారన్నదే చిత్ర ఇతివృత్తం అని తెలిసింది. ఇది వినోదానికి అధిక ప్రాధాన్యత ఉన్న కథా చిత్రం అని సమాచారం. ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభం కానున్న ఈ చిత్ర షూటింగ్ ఇండియా,ఫ్రాన్స్, ఇటలీ, మురాకో దేశాలలో జరుపుకోనుందని సమాచారం.

Post a Comment

Powered by Blogger.