సిడ్నీ: ఆస్ట్రేలియాతో  ఐదో వన్డేల సిరీస్ లో భాగంగా సిడ్నీ వేదికగా శనివారం చివరి వన్డే సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఘటన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి కోపం తెప్పించింది. అతని ఆట తీరుపై, జట్టు వైఫల్యాలపై ఎన్ని విమర్శలు వచ్చినా కూల్ గా ఉండే ధోనికి ఆ ఊహించని సంఘటన మాత్రం చిరాకు తెప్పించింది. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే..  ఐదో వన్డేకు గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన స్పైడర్ కేమ్ ప్రధాన కారణం. ఆసీస్ విసిరిన 331 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు విరాట్ కోహ్లి కొట్టిన ఓ షాట్  స్పైడర్ కేమ్ కు తగిలి గ్రౌండ్ లో పడింది. 19.0 ఓవర్ లో హేస్టింగ్ బౌలింగ్ లో కీపర్ పై నుంచి విరాట్ ఆడిన షాట్ సిక్స్ కు వెళుతుందని అంతా భావించారు.  కానీ, తొలుత గ్రౌండ్ లో పడిన ఆ బంతి బౌండరీ లైన్ దాటింది. కనీసం ఫోర్ రూపంలో పరుగులు వస్తాయని అనుకున్నా అది కూడా జరగలేదు.

దానిపై ఆసీస్ ఫిర్యాదు చేయడం,  ఆపై అంపైర్లు చర్చించి డెడ్ బాల్ గా ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. అయితే భారీ పరుగుల ఛేదనలో ఇటువంటి పరిణామాలు మంచివి కాదని ధోని అసంతృప్తి వ్యక్తం చేశాడు. సిడ్నీ స్టేడియం నిర్వాహకులు ఆ కేమ్ ను అమర్చిన తీరు సరిగా లేదంటూ విమర్శించాడు. అసలు మైక్ లను, స్పైడర్ కేమ్ లను ఏర్పాటు చేయడానికి కారణాలు ఏమిటో ముందుకు తెలుసుకోవాలని హిత బోధచేశాడు. క్రికెట్ ఆటలో ఇబ్బందులకు గురి చేసే పరిణామాలను తాను ఇష్టపడనని ధోని తెలిపాడు. స్పైడర్ కేమ్ లను ఏర్పాటు చేసేటప్పుడు చాలా బ్యాలెన్సింగ్ ఉండాలన్నాడు. కీలకమైన మ్యాచ్ లో ఆ నాలుగు పరుగులు చాలా ప్రభావం చూపుతాయని ధోని ఈ సందర్భంగా తెలిపాడు.

Post a Comment

Powered by Blogger.