లండన్: ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సెలబ్రిటీల మైనపు విగ్రహాలను ఏర్పాటు చేస్తూ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. దీంతో భారత్‌లోని ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి మైనపు విగ్రహం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి అవుతుంది. కేజ్రివాల్ విగ్రహాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయడం మరో విశేషమవుతుంది.

 మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు భారతీయ పార్టనర్ అయిన విజ్‌క్రాఫ్ట్ ఎంటర్నేన్‌మెంట్ ఇంటర్‌నేషనల్ సంస్థ ఈ మేరకు కేజ్రివాల్‌కు జనవరి 11వ తేదీన ఓ లేఖ రాసినట్లు తెల్సింది. ఫిబ్రవరి మొదటివారంలో విజ్‌క్రాఫ్ట్ ప్రతినిధులు కేజ్రివాల్‌ను కలసి ప్రాజెక్టు గురించి చర్చించనున్నారు. వచ్చే ఏడాది నాటికల్లా ఢిల్లీలో ఆకర్షనీయమైన మైనపు విగ్రహాల మ్యూజియంను ఏర్పాటు చేయాలన్నది విజ్‌క్రాఫ్ట్ లక్ష్యం.

 భారత ప్రధాన మంత్రి నరేంద్రమోది గత నవంబర్ నెలలో లండన్ పర్యటనకు వెళ్లినప్పుడు ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాల అభివృద్ధి కోసం తాము ఢిల్లీలో వాక్య్ మ్యూజియం ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు టుస్సాడ్ మ్యూజియం వర్గాలు ప్రకటించాయి. ఆ మ్యూజియంలో ముందుగా కేజ్రీవాల్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నది తాజా నిర్ణయం. అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియాలతోపాటు యూరప్‌లోని మొత్తం 20 దేశాల్లో మైనపు విగ్రహాల మ్యూజియంలను టుస్సాడ్స్ ఏర్పాటు చేసింది.

 ఆ మ్యూజియంలలో ఇప్పటికే జాతిపిత మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్,  ఐశ్వర్యరాయ్, కరీనా కపూర్, మాధురి దీక్షిత్, హృతిక్ రోషణ్, సచిన్ టెండూల్కర్ మైనపు విగ్రహాలు ఉన్నాయి.

Post a Comment

Powered by Blogger.