- దుర్గం చెర్వుపై సస్పెన్షన్ బ్రిడ్జి
- మూసీ నదిపై ఈస్ట్ వెస్ట్ కారిడార్
- ప్రాణహిత టన్నెళ్లు, పంప్ హౌజులు
- ప్రాజెక్టులు తదితరాలపై చైనా కంపెనీ
- పలు డిజైన్లను కేసీఆర్ ముందుంచిన అన్జు
- తక్కువ ఖర్చు.. తక్కువ వ్యవధితో ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: తక్కువ వ్యయంతో, తక్కువ వ్యవధిలో బ్రిడ్జిలు, టన్నెళ్లు, పంపు హౌజులను నిర్మించేందుకు చైనాకు చెందిన అన్జు నిర్మాణ సంస్థ ముందుకొచ్చింది. అన్జు ఇన్ఫ్రాటెక్ వైస్ ప్రెసిడెంట్ హోస్సేన్ ఖాజీ, డెరైక్టర్ యోగేశ్ వా, కంట్రీ హెడ్ మనోజ్ గాంధీ, స్వాతిశ్రీ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో సమావేశమయ్యారు.
హైదరాబాద్‌లో మూసీ నదిపై బ్రిడ్జి రోడ్డు, దుర్గం చెర్వుపై సస్పెన్షన్ బ్రిడ్జి, ప్రాణహిత ప్రాజెక్టు టన్నెళ్లు, పంపు హౌజుల నిర్మాణానికి ఈ కంపెనీ గతంలోనే ఆసక్తి చూపింది. సంబంధిత డిజైన్లను చైనా బ్రిడ్జెస్ అండ్ రోడ్స్ కార్పొరేషన్, చైనా కమ్యూనికేషన్స్ అండ్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీలు రూపొందించాయి. దుర్గం చెర్వుపై నాలుగు లేన్ల రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను కంపెనీ తాజాగా సీఎం ముందుంచింది. ధ్యాన ముద్ర, కొవ్వొత్తి, పువ్వు, ఆకులు, కమలం వంటి ఆకృతులతో డిజైన్లు తయారు చేశారు.
‘‘పదకొండంచెలుగా నిర్మాణం చేపడతాం. 25 నెలల్లో పూర్తి చేస్తాం. మూసీ నదిపై 41 కిలోమీటర్ల పొడవున ఈస్ట్ వెస్ట్ కారిడార్ నిర్మిస్తాం. 25 కిలోమీటర్ల పొడవునా స్కైవే, మరో 16 కిలోమీటర్ల మేరకు రోడ్ వే ఉంటాయి. వీటిని 40 నెలల్లో పూర్తి చేస్తాం’’ అని తమ ప్రతిపాదనను సీఎం ముందుంచారు. సంబంధిత డిజైన్లను ఆయనకు చూపించారు. ఈ రెండు ప్రాజెక్టుల్లో దాదాపు 2,500 మంది కార్మికులు అవసరమవుతారని, ఎక్కువ మందిని స్థానికులనే తీసుకుంటామని చెప్పారు. ప్రాణహిత ప్రాజెక్టుకు టన్నెళ్లు, పంపు హౌజ్ డిజైన్లను కూడా ఫిబ్రవరి 20 నాటికి అందిస్తామన్నారు. ఈ డిజైన్లపై త్వరలోనే నిర్ణయం తీసుకుని నిర్మాణాలు ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు.
శుక్రవారం సీఎం కేసీఆర్ తో భేటీ అయిన చైనా కంపెనీ ప్రతినిధులు
Post a Comment