♦ వేలకోట్లు దేశం దాటించేస్తున్న హవాలా రాయుళ్లు
♦ బ్యాంకు సిబ్బందితో కుమ్మక్కు; లొసుగులతో ఆటలు
♦ ఇరాన్ రూపీ ఖాతాలతో... 20 వేల కోట్లు విదేశాలకు
♦ నకిలీ దిగుమతి బిల్లులతో ప్రైవేటు బ్యాంకుల నుంచి రూ.15 వేల కోట్లు
♦ జీడిపప్పు దిగుమతి అంటూ బీఓబీ ద్వారా రూ.6,000 కోట్లు
♦ నిజంగా వస్తువుల్ని ఎగుమతి చేసినట్లుగా... పన్ను రిఫండ్ కూడా
♦ ఫిక్స్‌డ్ డిపాజిట్లను కూడా మోసంతో కాజేసిన ఘనులు
♦ ఇదీ మన బ్యాంకుల తీరు
రూ. 50 వేలు ఒకేసారి డిపాజిట్ చేసినా.. లేక రూ. 2 లక్షలు దాటి ఎలాంటి లావాదేవీలు జరిపినా పాన్ నంబర్ తప్పనిసరి. బ్యాంక్ అకౌంట్ ప్రారంభించాలంటే సవాలక్ష పత్రాలివ్వాలి. మీ చిరునామా నుంచి అన్ని వివరాలూ చెప్పాలి. కనీసం పాత ఖాతాదారులు మిమ్మల్ని పరిచయం చేయాలి. ఇక ఇంటి రుణమో, వాహన రుణమో, వ్యక్తిగత రుణమో తీసుకోవాలంటే... చుక్కలు కనిపిస్తాయి. ఏ నెలైనా చెల్లించటంలో ఒకటి రెండురోజులు ఆలస్యమైతే... పెనాల్టీల భారం తప్పదు. దానికి తోడు సిబిల్‌లోనూ ‘మార్కు’ పడిపోతుంది. ఇలాంటి మార్కులు పడ్డాయంటే మళ్లీ రుణం దొరకటమనేది కలే.
మరి సామాన్యుడికి ఇన్ని నిబంధనలు పెట్టే బ్యాంకుల ద్వారా కొందరు బడా బాబులు వేల కోట్ల రూపాయల్ని ఈజీగా దేశం దాటించేస్తున్నారంటే నమ్మగలమా? ఆ బ్యాంకుల్లో పనిచేసే ఒకరిద్దరిని అడ్డం పెట్టుకుని వందల కోట్లు కొల్లగొడుతున్నారంటే ఏమనుకోవాలి? కానీ ఇవే జరుగుతున్నాయి. నల్లధనాన్ని ఏకంగా బ్యాంకుల్నుంచే దేశం దాటించి... మళ్లీ వాటిద్వారానే తెల్లడబ్బుగా వెనక్కి తెస్తున్నారు. ఈ హవాలా ఘరానా మోసానికి నజరానాగా... సుంకాల రిఫండ్ రూపంలో ప్రభుత్వ ఖజానా నుంచి వందల కోట్లు వెనక్కి తీసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఒక్క యూకో బ్యాంక్ ద్వారానే హవాలా మార్గంలో రూ.20,000 కోట్ల నల్లడబ్బు అరబ్ దేశాలకు వెళ్ళిపోయింది.
ఆరు ప్రైవేటు బ్యాంకుల నుంచి ఏకంగా రూ.15,000 కోట్లు సరిహద్దులు దాటాయి. జీడిపప్పు దిగుమతి పేరిట బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా రూ.6,000 కోట్లు దేశం దాటేశాయి. ఇలాంటి కుంభకోణాలు అసలెలా జరుగుతున్నాయి? వాటి వెనక జరుగుతున్న తతంగమేంటి? ఎలా వెలుగు చూస్తున్నాయి? ఇవన్నీ తెలియజెప్పటానికే ఈ ‘ఫోకస్’...
యూకో ఖాతాలో భారీ హవాలా..
విదేశాల్లోనో, ఇతర రాష్ట్రాల్లోనో ఉన్న మీ వాళ్లకు డబ్బులు పంపాలి. అందుకు లీగల్‌గా బ్యాంకులు, మనీ ట్రాన్స్‌ఫర్ సంస్థలు ఉంటాయి. కానీ వీటిద్వారా పంపితే ఆ లావాదేవీ రికార్డవుతుంది. అనుమానం వస్తే... ఆ డబ్బు ఎక్కడిదని ఆదాయపు పన్ను అధికారులు ఆరా తీయొచ్చు. హవాలా మార్గంలో అయితే!! స్థానికంగా ఉండే హవాలా డీలర్‌కు మీరు డబ్బులిస్తారు. మీకు కావాల్సిన చోట... అక్కడుండే ఈ గ్రూపులోని మరో వ్యక్తి డబ్బు డెలివరీ ఇస్తాడు. ఇక్కడి వ్యక్తి డబ్బు తీసుకుని తన వద్దే ఉంచుకుంటాడు. అక్కడి వ్యక్తి తన దగ్గరున్న డబ్బు అందజేస్తాడు. అలాగే అట్నుంచి ఇటు కూడా!! అంతా బ్లాక్. ఎక్కడా ఏ లావాదేవీ నమోదు కాదు. చిత్రమేంటంటే దేశ చరిత్రలోనే అతిపెద్ద హవాలా కుంభకోణం 2015లో బ్యాంకింగ్ వ్యవస్థలోనే బయటపడింది. అది కూడా ప్రభుత్వ రంగ యూకో బ్యాంకులో!!. ఎలాంటి వ్యాపార లావాదేవీలూ నిర్వహించకుండానే రూ.20,000 కోట్లను అడ్వాన్స్ పేమెంట్ల పేరిట దుబాయ్, ఇరాన్ దేశాలకు తరలించేశారు. గుజరాత్‌కు చెందిన ఓ హవాలా వ్యాపారి దీనికి సూత్రధారిగా దర్యాప్తు అధికారులు తేల్చారు. ఆయన్ను అరెస్టు చేశారు కూడా.
ఎలా జరిగిందంటే...
చదువుకోవటానికి విదేశాల నుంచి వచ్చిన ఎనిమిది మంది విద్యార్థుల పేరిట చండీగఢ్‌లో 80 కాగితపు కంపెనీలను ఏర్పాటు చేశారు. అంటే ఇవి కాగితంపై మాత్రమే ఉంటాయి. వీటికి ఎలాంటి కార్యకలాపాలు, కార్యాలయాలు ఉండవు. చిరునామా కోసం 80 కంపెనీలకూ ఒకే అడ్రస్ ఇచ్చారు. స్థానిక బ్యాంకు సిబ్బంది సాయంతో చండీగఢ్ యూకో బ్యాంకులో ఈ 80 కంపెనీల పేరిటా ఖాతాలు ప్రారంభించారు. ఈ విద్యార్థుల్లో ఏడుగురు ఇరాన్ నుంచి వచ్చినవారు కాగా... ఒకరు అజర్‌బైజాన్‌కు చెందినవారు. ఇరాన్ నుంచి వజ్రాలు, బంగారాన్ని దిగుమతి చేసుకొని వాటిని ఆభరణాలుగా మార్చి తిరిగి ఎగుమతి చేయటానికి ఈ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు బ్యాంకులకు చెప్పి... వజ్రాల దిగుమతి కోసం ముందే అడ్వాన్స్‌లు ఇస్తున్నామంటూ... ఆ పేరుతో భారీ మొత్తాలను రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టీజీఎస్) విధానంలో దుబాయ్, ఇరాన్ దేశాల్లోని ఖాతాలకు తరలించారు.
ఎక్కడా పైసా వ్యాపారం జరగకుండానే దాదాపు 20 వేల కోట్ల రూపాయలు విదేశాలకు రెక్కలు కట్టుకుపోయాయి. దీనిపై ఇప్పుడు ఈడీ, సీబీఐ, సిట్ దర్యాప్తు చేస్తున్నాయి. బ్యాంకు సిబ్బంది పాత్ర లేకుండా ఇన్ని వేల కోట్లు దేశం దాటి వెళ్ళడం అసాధ్యమని దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఈ విదేశీ విద్యార్థుల జాడ తెలియడం లేదు. అసలు కేవైసీ నిబంధనలు పాటించకుండా బ్యాంకు ఖాతాలను ప్రారంభించి అన్ని వేల కోట్ల రూపాయలు అడ్వాన్స్‌లుగా ఎలా పంపించగలిగారన్నది తెలియాల్సి ఉంది. ఇలా అనుమానాస్పద స్థాయిలో జరుగుతున్న లావాదేవీలను బ్యాంకు సిబ్బంది ఎప్పటికప్పుడు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్‌కు (ఎఫ్‌ఐయూ) తెలియచేయాలి. అదీ చేయలేదు. దీంతో బ్యాంకు సిబ్బంది సహకారంతోనే ఈ కుంభకోణం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఇరాన్ విద్యార్థులు.. ఇరాన్‌కే ఎందుకు?
ఈ కుంభకోణంలో ఆసక్తికరమైన మరో విషయం దాగి ఉంది. అదేమంటే... 2012లో యూకో బ్యాంకు ఇరాన్‌కు రూపీ ఖాతాలను ప్రారంభించింది. పలు ఇరానియన్ బ్యాంకులు ఈ ఖాతాలను తెరిచాయి. ఈ ఖాతాల ద్వారా ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకున్న కంపెనీలు ఇరాన్‌కు రూపాయల్లోనే చెల్లింపులు చేయొచ్చు. అలాగే ఇరాన్‌కు ఎగుమతి చేసే వ్యాపారులు రూపాయల్లోనే నగదు స్వీకరించవచ్చు. దీంతో విదేశీ కరెన్సీ ఇబ్బందులు లేకుండా వేల కోట్ల రూపాయల్ని ఇరాన్‌కు తరలించడానికి ఈ బ్యాంకును వినియోగించుకున్నారు హవాలా రాయుళ్లు.
ప్రైవేటు బ్యాంకులూ ఆ తానులోనివే!!
హవాలా రాకెట్లో ప్రైవేటు బ్యాంకుల పాత్ర తక్కువేమీ కాదు. రెమిటెన్స్‌ల పేరుతో దేశంలోని అగ్రశ్రేణి ప్రైవేటు బ్యాంకులు కొన్ని ఏకంగా రూ.15,000 కోట్ల కుంభకోణానికి తెరలేపాయి. 2011 నుంచి 2014 మే వరకు జరిగిన ఈ కుంభకోణం సామాన్యమైంది కాదు. గుజరాత్, మహారాష్ట్రల్లో ఉన్న పలు కంపెనీలు ప్రైవేటు బ్యాంకులైన ఐఎన్‌జీ వైశ్యా, కోటక్ మహీంద్రా, (ఇవి రెండూ విలీనం కాకముందు) ఇండస్ ఇండ్, ఐసీఐసీఐ, యస్ బ్యాంకులతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా ఈ కుంభకోణంలో చేర్చాయి.
ఎలా జరిగింది?
వ్యాపారస్తులు వస్తువుల్ని దిగుమతి చేసుకుని, వారికి డబ్బులు చెల్లించాలి కాబట్టి రెమిటెన్సుల రూపంలో బ్యాంకుల ద్వారా పంపిస్తారు. ఇలా రెమిటెన్సులు చేసేటపుడు ఎందుకు చేస్తున్నారన్నది చెప్పాలి కనక దిగుమతి బిల్లులు చూపించాలి. అయితే ఈ హవాలా రాయుళ్లు దొంగ బిల్లులు చూపించారు. ఒకే బిల్లును నంబర్లు ఫోర్జరీ చేసి పలు బ్యాంకులకు సమర్పించారు. ఇలా ఏకంగా నాలుగేళ్ల పాటు ఆరు బ్యాంకుల్ని మోసం చేసి... రూ.15 వేల కోట్లను విదేశాలకు తరలించారు.
తరలిస్తే ఏంటట?
నిజానికి ఇలా తరలించిన సొమ్ము మొత్తం ఖాతాల్లో లేనిదే. అంటే బ్లాక్ మనీయే. పన్నులు ఎగ్గొట్టి సంపాదించిన బ్లాక్ మనీని విదేశాలకు ఇలా అక్రమంగా తరలించటం, మళ్లీ అక్కడి నుంచి ఏ షేర్ మార్కెట్లోకో, బంగారం దిగుమతి ద్వారానో రాజమార్గంలో తీసుకుని రావటం చేస్తున్నారన్న అనుమానాలున్నాయి. అయితే ఈ నల్లధనాన్ని పన్ను స్వర్గాల్లాంటి మారిషస్, లక్సెంబర్గ్, కేమన్ ఐలాండ్స్ వంటి దేశాలకు తరలిస్తున్నట్లు కూడా దర్యాప్తు వర్గాలు అనుమానిస్తున్నాయి. దీనిపై కూడా ఫెమా యాక్ట్ ప్రకారం ఈడీ దర్యాప్తు చేస్తోంది.
జీడిపప్పు పేరుతో రూ. 6,000 కోట్ల తరలింపు...
బ్యాంక్ ఆఫ్ బరోడాలో (బీఓబీ) జరిగింది మరీ విచి త్రం. పంటలు పండని, అసలు పండటానికి భూములే లేని దేశం నుంచి ఏకంగా రూ.6,200 కోట్ల విలువైన సుగంధ ద్రవ్యాలు, జీడిపప్పు, ధాన్యాలు దిగుమతి చేసుకున్నారట!!. అలా దొంగ బిల్లులు చూపించి.. ఏకంగా రూ.6,200 కోట్లను సరిహద్దులు దాటించేశారు. న్యూఢిల్లీలోని బ్యాంక్ ఆఫ్ బరోడాకి చెందిన అశోక్ విహార్ బ్రాంచ్ ఈ కుంభకోణానికి వేదికగా నిలిచింది. ఈ బ్యాంకు శాఖ నుంచి హాం కాంగ్‌లోని 59 అకౌంట్లకు ఈ నగదు బదిలీ అయ్యింది. ఈ కేసులో ఇప్పటికే బీవోబీ ఏజీఎంతో పాటు మరో ఆరుగురిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో కొన్ని ప్రైవేటు బ్యాంకుల హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది.
ఎలా జరిగిందంటే...!
ఢిల్లీలో హెచ్‌డీఎఫ్‌సీ ఫారెక్స్ అధికారి కమల్ కల్రా. అతనితో కుమ్మక్కయిన వ్యాపారవేత్త గురుచరణ్‌సింగ్ ధావన్... ఆ బ్యాంకులో 2015 జన వరిలో 13 ఖాతాలు తెరిచాడు. ఆ ఖాతాల ద్వారా దుబాయ్, హాంకాంగ్‌లకు వస్తువుల దిగుమతి కోసమంటూ డబ్బు పంపారు. అన్నీ లక్ష డాలర్లలోపు లావాదేవీలే. లావాదేవీల సంఖ్య పెరగటంతో... మరిన్ని లావాదేవీలు జరిగితే అనుమానం వస్తుందని భావించిన కల్రా... ధావన్‌ను బ్యాంక్ ఆఫ్ బరోడా అశోక్ విహార్ బ్రాంచికి తీసుకెళ్లాడు. అక్కడి ఏజీఎం ఎస్.కె.గార్గ్‌కు పరిచయం చేశాడు. అక్కడ మార్చిలోగా పలు కంపెనీల పేరిట ధావన్, అతని స్నేహితులు ఏకంగా 59 ఖాతాలు తె రిచారు. ఈ కంపెనీలన్నిటికీ హాకర్లు, రిక్షా పుల్లర్లు, డ్రైవర్లు వంటి వారిని రాత్రికి రాత్రి డెరైక్టర్లుగా చే సి... వారికి కొంత మొత్తం ముట్టజెప్పారు.
వ్యవహారం గురించి తెలియని వాళ్లంతా... ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టి... ఇచ్చిన డబ్బులు తీసుకున్నారు. అదే మాదిరి హాంకాంగ్‌లోనూ నకిలీ కంపెనీలు సృష్టించారు. ఇండియా ఖాతాల నుంచి వస్తువుల్ని దిగుమతి చేసుకోవటానికంటూ హాంకాంగ్, దుబాయ్‌లకు భారీ డబ్బు పంపారు. ఆయా కంపెనీలు వస్తువుల్ని పంపినట్లుగా ఇచ్చిన నకిలీ బిల్లులు చూపించి... సుంకాల రిఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అలా... దాదాపు రూ.300 కోట్లను వెనక్కి తీసుకున్నారు. హాంకాంగ్‌లో జీడిపప్పు పండకపోయినా... దాన్నే దిగుమతి చేసుకుంటున్నట్లుగా చూపించి వేల కోట్లు బదలాయించటం గమనార్హం.
బయటపడిందిలా..?
బ్యాంక్ ఆఫ్ బరోడా అశోక్ విహార్ బ్రాంచికి... విదేశీ కరెన్సీ (ఫారెక్స్) కార్యకలాపాల నిర్వహణకు 2013లో అనుమతి వచ్చింది. అయితే ఏడాది తిరిగేలోపే ఈ బ్రాంచి ఫారెక్స్ వ్యాపారం ఏకంగా రూ.21,529 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల స్థాయి అనుమానాస్పదంగా ఉండటంతో బ్యాంకు అధికారులే దర్యాప్తు సంస్థలకు సమాచారమిచ్చారు. 2015 ఆగస్టు 12న దర్యాప్తు సంస్థలు కేసు నమోదు చేశాయి.
ఫిక్స్‌డ్ డిపాజిట్లకూ కాళ్లొచ్చాయ్...
మీరొక బ్యాంకులో రూ.10 కోట్లు డిపాజిట్ చేశారు. వడ్డీ 8 శాతం వస్తోంది. మరో ప్రభుత్వ రంగ బ్యాంకులోనే 9 శాతం వడ్డీ వస్తోందంటే మీరేం చేస్తారు? ఠక్కున ఇక్కడి డిపాజిట్లు వెనక్కి తీసుకుని 9శాతం ఇచ్చే బ్యాంకులో పెడతారా? ఎవ్వరైనా చేసేదిదే!!. ఇదిగో ఈ బలహీనతనే ఆసరా చేసుకుని ఏకంగా ఒక ముఠా రూ.100 కోట్లకు పైగా కొట్టేసింది. అదీ... మన హైదరాబాద్‌లోనే.
ఎలా జరిగిందంటే...
వివిధ బ్యాంకుల్లో పనిచేసిన మాజీ ఉద్యోగులు ఒక జట్టుగా ఏర్పడ్డారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న లొసుగులన్నీ తెలుసు కనక... వీళ్లంతా కలసి కోర్టు వివాదాల్లో ఉన్న ఆస్తులపై కన్నేశారు. సహజంగా ఇలాంటి ఆస్తుల తాలూకు పత్రాలన్నీ కోర్టు నియమించిన అఫీషియల్ లిక్విడేటర్ వద్ద ఉంటాయి. ఒక ఉదాహరణ చూస్తే... ఆల్విన్‌కు చెందిన రూ.36 కోట్ల డిపాజిట్లు అఫీషియల్ లిక్విడేటర్ వద్ద ఉన్నాయి. వాటిని పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉంచారు. అయితే ఈ మాజీ ఉద్యోగుల బృందం సదరు అఫీషియల్ లిక్విడేటర్‌ను సంప్రదించింది. వేరే బ్యాంకులో ఎక్కువ వడ్డీ వస్తుందని ఆశ చూపించింది. తన చేత... ఆ డిపాజిట్లను ఎస్‌బీహెచ్‌కు చెందిన రెండు శాఖలు, ఒక సహకార బ్యాంకు శాఖలోకి మార్పించింది.
మోసం జరిగిందిలా...
డిపాజిట్లను బ్యాంకులో డిపాజిట్ చేశాక బ్యాంకు డిపాజిట్ పత్రాలను ఇస్తుంది. ఆ పత్రాలను ఈ మోసగాళ్లు మొదట తీసుకున్నారు. వాటిని కలర్ జిరాక్సులు తీసి... ఆ జిరాక్సు పత్రాలనే ఒరిజినల్‌గా నమ్మించి అఫీషియల్ లిక్విడేటర్‌కు అందజేశారు. కొన్ని రోజుల తరవాత తమ దగ్గరున్న పత్రాలను బ్యాంకుకు తీసుకెళ్లారు. డిపాజిట్ రద్దు చేస్తున్నట్లుగా చెప్పి... డబ్బులు వెనక్కి తీసుకున్నారు. తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. దీనికి బ్యాంకులో పనిచేస్తున్న సిబ్బంది కూడా సహకరించటం విశేషం.
ఎలా బయటపడిందంటే...
మోసం జరిగిన కొద్ది రోజులకు తమ డి పాజిట్లకు చెందిన కొంత డబ్బు వేరే ఖాతాల్లోకి బదిలీ అయినట్లు అఫీషియల్ లిక్విడేటర్ గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డొంకంతా కదిలింది. ఈ విధంగా ఈ ముఠా ఎస్‌బీహెచ్‌తో పాటు అనేక బ్యాంకుల్లో రూ.100 కోట్లు మాయం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
Post a Comment