సూటూ, బూటూ, చలువ కళ్లద్దాలు, కొంచెం నెరిసిన జుత్తు, గడ్డంతో సూపర్ స్టార్ రజనీకాంత్‌ను చూస్తుంటే ‘స్టయిలు స్టయిలులే.. ఇది సూపర్ స్టయిలులే..’ అనే పాట అందుకోవాలనిపిస్తోంది కదూ. ఈ మధ్యకాలంలో ఏ సినిమాలోనూ కనిపించనంత స్టయిలిష్‌గా ఆయన కనిపించనున్న చిత్రం ‘కబాలి’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైనప్పట్నుంచీ రజనీ అభిమానులు పరమానందపడిపోతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో పా. రంజిత్ దర్శకత్వంలో అగ్రనిర్మాత కలైపులి యస్. థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 ప్రస్తుతం ఈ చిత్రం చివరి షెడ్యూల్ మలేసియాలో జరుగుతోంది. వచ్చే నెల 28 వరకూ అక్కడ చిత్రీకరిస్తారు. చిత్ర విశేషాలను కలైపులి యస్. థాను చెబుతూ - ‘‘మా సంస్థలో స్టార్ హీరోలతో అనేక సినిమాలు తీశాను. ఇప్పుడు రజనీకాంత్‌తో సినిమా నిర్మించడం నా లైఫ్ ఎచీవ్‌మెంట్‌గా భావిస్తున్నాను. ఖర్చుకు వెనకాడకుండా నిర్మిస్తున్న ఈ చిత్రంలో చైనా సూపర్ స్టార్ విల్సన్ చౌ విలన్‌గా నటిస్తున్నారు.
సంతోష్ నారాయణన్ స్వరపరచిన బాణీలు హైలైట్‌గా నిలుస్తాయి. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, చంద్రబోస్, అనంతశ్రీరామ్ పాటలు రాస్తున్నారు. మేలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. రాధికా ఆప్టే, ధన్సిక, కిశోర్, జాన్ విజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మురళి, మాటలు: సాహితి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ‘దేవి-శ్రీదేవి’ సతీష్.

Post a Comment

Powered by Blogger.