ఆసీస్ గడ్డపై తొలి ద్వైపాక్షిక సిరీస్ గెలిచిన ధోని బృందం
2-0తో టి20 సిరీస్ కైవసం
రెండో మ్యాచ్‌లో 27 పరుగులతో ఓడిన ఫించ్‌సేన

మెల్‌బోర్న్: దుమ్మురేపే బ్యాటింగ్... కళ్లు చెదిరే క్యాచ్‌లు... మెరుపు ఫీల్డింగ్... బౌలర్ల రాణింపు... ప్రతీకారేచ్ఛతో రెచ్చిపోయిన భారత జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టి20లో చేసిన సమష్టిపోరాటం ఇది. ఏమాత్రం అలసత్వం చూపకుండా... ఏ అవకాశాన్ని వదలకుండా... అదరహో అన్న రీతిలో ఆడుతూ కంగారూల గడ్డపై తొలి ద్వైపాక్షిక సిరీస్‌ను గెలిచి కొత్త అధ్యాయాన్ని లిఖించింది. శుక్రవారం ఎంసీజీలో జరిగిన రెండో టి20లోనూ 27 పరుగుల తేడాతో ఫించ్‌సేనపై నెగ్గిన ధోని బృందం...

మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో టి20 సిరీస్‌ను కైవసం చేసుకుని ఈ ఘనత అందుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 184 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (47 బంతుల్లో 60; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లి (33 బంతుల్లో 59 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) ఫామ్‌ను కొనసాగించగా, శిఖర్ ధావన్ (32 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిశాడు. తర్వాత ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులకే పరిమితమైంది. ఫించ్ (48 బంతుల్లో 74; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరిపోరాటం చేశాడు. కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆఖరి టి20 ఆదివారం సిడ్నీలో జరుగుతుంది.
 
సూపర్ భాగస్వామ్యం: తొలి మూడు ఓవర్లలో 12 పరుగులు మాత్రమే చేసిన రోహిత్, ధావన్ ఆ తర్వాత చెలరేగిపోయారు. బంతి ఎలాంటిదైనా బౌండరీ దాటించడంతో స్కోరు బోర్డు కదం తొక్కింది. ఏడో ఓవర్‌లో ఫాల్క్‌నర్ సంధించిన బౌన్సర్‌ను ధావన్ సిక్సర్‌గా మల్చడం అతని బ్యాటింగ్‌కే హైలైట్. లయోన్, మ్యాక్స్‌వెల్‌లకు రోహిత్ సిక్సర్ల రుచి చూపెట్టాడు. ఆరు ఓవర్లలో 50 పరుగులు చేసిన భారత్... 11.2 ఓవర్లలో 100 పరుగులను అందుకుంది. తొలి వికెట్‌కు 97 పరుగులు జత చేశాక ధావన్ రివర్స్ స్వీప్‌తో అవుటయ్యాడు. ఈ దశలో వచ్చిన కోహ్లి కూడా ఏమాత్రం తగ్గలేదు. 13వ ఓవర్‌లో మూడు ఫోర్లు కొట్టి ఊపు తెచ్చాడు.

ఓవర్‌కు 9 పరుగుల చొప్పున రాబట్టిన కోహ్లి, రోహిత్ రెండో వికెట్‌కు 46 పరుగులు జత చేశారు. 16వ ఓవర్‌లో రోహిత్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన ధోని (14) వేగంగా ఆడాడు. 29 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లితో కలిసి ధోని మూడో వికెట్‌కు 38 పరుగులు జోడించాడు.
 
ఫించ్ పోరాడినా...: లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన ఆసీస్ ఓపెనర్లు ఫించ్, మార్ష్ (23) మెరుపు ఆరంభాన్నిచ్చారు. బౌండరీల వర్షం కురిపించడంతో రన్‌రేట్ దూసుకుపోయింది. దీనికి తోడు 9, 10 ఓవర్లలో ఫించ్ ఇచ్చిన మూడు క్యాచ్‌లను ఉమేశ్, రిషి ధావన్, శిఖర్ ధావన్‌లు జారవిడిచారు. అయితే 10వ ఓవర్‌లో మార్ష్ ఇచ్చిన క్యాచ్‌ను లాంగాన్‌లో పాండ్యా చక్కగా అందుకోవడం, ఆ వెంటనే తన బౌలింగ్‌లో లిన్ (2)ను వెనక్కిపంపడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. ఫించ్, మార్ష్‌లు తొలి వికెట్‌కు 9.5 ఓవర్లలో 94 పరుగులు జోడించారు.

12వ ఓవర్‌లో ‘డేంజర్ మ్యాన్’ మ్యాక్స్‌వెల్ (1)ను ధోని స్టంప్ చేశాడు. తర్వాత ఫించ్‌తో జత కలిసిన వాట్సన్ (15) నిలకడగా ఆడే ప్రయత్నం చేసినా జడేజా కుదురుకోనీయలేదు. 15వ ఓవర్‌లో కళ్లు చెదిరే రీతిలో రిటర్న్ క్యాచ్ తీసుకోవడంతో ఆసీస్ స్కోరు 124/4గా మారింది. తర్వాతి ఓవర్‌లో ఎక్స్‌ట్రా కవర్ నుంచి జడేజా విసిరిన బంతికి ఫించ్ రనౌట్ కావడంతో కంగారులు కుదేలయ్యారు. విజయానికి 61 పరుగులు చేయాల్సిన దశలో జడేజా మరోసారి మ్యాజిక్ చూపెట్టాడు. 17వ ఓవర్‌లో ఫాల్క్‌నర్‌ను అవుట్ చేస్తే... చివరి ఓవర్‌లో బుమ్రా యార్కర్లతో హాస్టింగ్స్ (4), టై (4)లను వెనక్కి పంపి చిరస్మరణీయ విజయాన్ని పూర్తి చేశాడు.

1
ఆసీస్ గడ్డపై ద్వైపాక్షిక సిరీస్ గెలవడం భారత్‌కు ఇదే మొదటిసారి. అంతకుముందు 2007-08లో ముక్కోణపు సిరీస్, 1985లో బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ చాంపియన్‌షిప్‌ను గెలిచారు.
 
స్కోరు వివరాలు:-
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ రనౌట్ 60; ధావన్ (సి) లిన్ (బి) మ్యాక్స్‌వెల్ 42; కోహ్లి నాటౌట్ 59; ధోని (సి) వాట్సన్ (బి) టై 14; రైనా నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 184.
వికెట్ల పతనం: 1-97; 2-143; 3-181.
బౌలింగ్: వాట్సన్ 3-0-17-0; హాస్టింగ్ 3-0-35-0; బోలాండ్ 4-0-30-0; ఫాల్క్‌నర్ 3-0-35-0; టై 4-0-28-1; లయోన్ 1-0-15-0; మ్యాక్స్‌వెల్ 2-0-17-1.
 
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఫించ్ రనౌట్ 74; మార్ష్ (సి)  హార్డిక్ పాండ్యా  (బి) అశ్విన్ 23; లిన్ (సి) ధోని (బి)  హార్డిక్ పాండ్యా 2; మ్యాక్స్‌వెల్ (స్టంప్) ధోని (బి) యువరాజ్ 1; వాట్సన్ (సి అండ్ బి) జడేజా 15; వేడ్ నాటౌట్ 16; ఫాల్క్‌నర్ (స్టంప్) ధోని (బి) జడేజా 10; హాస్టింగ్స్ (బి) బుమ్రా 4; టై (బి) బుమ్రా 4; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 157.
వికెట్ల పతనం: 1-94; 2-99; 3-101; 4-121; 5-124; 6-137; 7-152; 8-157.
బౌలింగ్: నెహ్రా 4-0-34-0; బుమ్రా 4-0-37-2; జడేజా 4-0-32-2; అశ్విన్ 4-0-27-1; హార్డిక్ పాండ్యా 2-0-17-1; యువరాజ్ 2-0-7-1.

Post a Comment

Powered by Blogger.