♦ ఈ పోస్టుల దరఖాస్తుదారుల్లో పీహెచ్‌డీ, ఎం.ఫిల్, మాస్టర్ డిగ్రీ అభ్యర్థులు
♦ 10,196 మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు
♦ డిగ్రీ పూర్తి చేసినవారు 42,242 మంది
పోలీస్ కానిస్టేబుల్ దరఖాస్తులకు ఉన్నత విద్యావంతులు పోటీ పడుతున్నారు. కానిస్టేబుల్ కొలువు కోసం పీహెచ్‌డీ, ఎం.ఫిల్, పోస్టుగ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ వంటి చదువులు చదివిన వారు భారీగా దరఖాస్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలోని 9,281 పోస్టుల భర్తీకి అనుమతులిచ్చిన విషయం తెలిసిందే. అందుకనుగుణంగా పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ నెల 11వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. శనివారం సాయంత్రం 3 గంటల వరకు దాదాపు 1,59,604 దరఖాస్తులు వచ్చాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే విధానం కావడంతో ప్రతి క్షణానికి దరఖాస్తుల సంఖ్య మారుతుంది.
శనివారం రాత్రి 8 గంటల వరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య 1,80,180కి చేరింది. ఫిబ్రవరి 4వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించడానికి సమయం ఉండటంతో దాదాపు మూడు లక్షలు దాటే అవకాశం ఉందని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అంచనా వేస్తోంది. అందుకనుగుణంగా వెబ్‌సైట్‌లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే దరఖాస్తుదారులకు తలెత్తే సందేహాలను తీర్చడం కోసం రెండు హెల్ప్‌లైన్ నంబర్లు 040-23150362, 23150462 ఏర్పాటు చేసింది. ఈ రెండు నంబర్ల ద్వారా ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 వరకు సందేహాలు తీర్చుకోవచ్చని రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది.
Post a Comment