* వాహన్ బీమా తరహాలో సరికొత్త యాప్
* అన్ని రకాల డాక్యుమెంట్లతో ‘ఎం-వాలెట్’
* త్వరలో ప్రవేశపెట్టనున్న ఆర్టీఏ

సాక్షి, హైదరాబాద్: డ్రైవింగ్ లెసైన్స్, ఆర్‌సీ వెంట తెచ్చుకోవడం మరిచిపోయారా. ట్రాఫిక్ పోలీసులు పట్టుకొని ఫైన్ వేస్తారేమోనని ఆందోళనకు గురవుతున్నారా... ఇక నుంచి ఇలాంటి ఆందోళనలు అవసరం లేదు. జేబులో ఎలాంటి డాక్యుమెంట్లూ లేకపోయినా సరే నిశ్చింతగా రోడ్డెక్కవచ్చు. ట్రాఫిక్ పోలీసులకు, ఆర్టీఏ అధికారులకు బెంబేలెత్తవలసిన పనిలేదు. అయితే అందుకోసం చేయాల్సిందల్లా మీ స్మార్ట్ ఫోన్‌లో గూగుల్ ప్లే నుంచి ఒక మొబైల్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడమే.

ఆ యాప్ ద్వారా మన డాక్యుమెంట్లను అప్‌డేట్ చేసుకోవడమే. ‘స్మార్ట్’ సేవలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోన్న రవాణా శాఖ త్వరలో ‘ఎం-వాలెట్’ పేరుతో సరికొత్త యాప్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేపట్టింది. ఈ యాప్ ద్వారా వాహనదారులు ఈ-డ్రైవింగ్ లెసైన్స్, ఈ-ఆర్‌సీ, ఈ-ఇన్స్యూరెన్స్, ఈ-పొల్యూషన్ తదితర వాహనానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను ఈ యాప్ ద్వారా పొందవచ్చు.

ఇటీవల ప్రవేశపెట్టిన ‘వాహన్ బీమా’ తరహాలో ఎం-వాలెట్ సేవలందజేస్తుంది. వాహనాల ఇన్సూరెన్స్ వివరాలను, వివిధ బీమా సంస్థలకు సంబంధించిన వివరాలను వాహన్ బీమా ద్వారా పొందవచ్చు. అలాగే ఎం-వాలెట్ కూడా వాహనాల డేటాతో నిక్షిప్తమై ఉంటుంది.

పర్మిట్లు కూడా యాప్‌తోనే...
తెలంగాణ రాష్ర్టవ్యాప్తంగా నమోదైన 80 లక్షల వాహనాలు, 60 లక్షలకు పైగా డ్రైవింగ్ లెసైన్స్‌ల డేటాను రవాణా శాఖ నిక్షిప్తం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 45 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు, క్యాబ్‌లు, వివిధ రకాల వాహనాలు ఉన్నాయి. 35 లక్షలకు పైగా డ్రైవింగ్ లెసైన్స్‌లున్నాయి. ఈ వివరాలన్నింటినీ రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలోని సెంట్రల్ సర్వర్‌లో నిక్షిప్తం చేశారు. సెంట్రల్ సర్వర్‌ను ‘టీఎస్‌టీడీ’ అనే యాప్‌తో అనుసంధానం చేశారు.

దీంతో అధికారులు తమ సెల్‌ఫోన్‌లోనే వాహనాల వివరాలను పొందే అవకాశం అందుబాటులోకి వచ్చింది. త్వరలో ప్రవేశపెట్టనున్న ‘ఎం-వాలెట్’ను ఈ టీఎస్‌టీడీతో అనుసంధానం చేసి వాహనదారులకు కావలసిన డ్రైవింగ్ లెసైన్స్, ఆర్‌సీ, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్స్యూరెన్స్ తదితర డాక్యుమెంట్ల వివరాలను అందిస్తారు.

భవిష్యత్తులో రవాణా వాహనాల పర్మిట్లను కూడా ఈ యాప్ ద్వారా అనుసంధానం చేసేందుకు రవాణా శాఖ యోచిస్తోంది. ప్రైవేటు బస్సులు, కాంట్రాక్ట్ క్యారేజీలు, క్యాబ్‌లు, ట్యాక్సీలు, లారీలు తదితర వాహనాలు నేరుగా ఆర్టీఏ కార్యాలయానికి రావలసిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే ఫీజులు చెల్లించి పర్మిట్లను పొందే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రవాణా కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా చెప్పారు.

Post a Comment

Powered by Blogger.