బెంగుళూర్ నాట్కళ్ చిత్ర ఆడియో ఆవిష్కరణ
తమిళంలో నటించాలన్న తన కోరిక బెంగుళూర్ నాట్కళ్ చిత్రం ద్వారా నెరవేరిందని టాలీవుడ్ యువ నటుడు రానా అన్నారు. ఈయన తెలుగులో కథానాయకుడిగా కొన్ని చిత్రాలు చేసినా బాహుబలి చిత్రంలో భల్లాలదేవ పాత్రలో నటనతో బహుళ ప్రాచుర్యం పొందారు. రానా పుట్టి పెరిగింది చెన్నైలోనే.
అయితే తొలిసారిగా ఆయన తమిళంలో నటించిన చిత్రం బెంగుళూర్ నాట్కళ్. మలయాళంలో ఘన విజయం సాధించిన బెంగుళూర్ డేస్ చిత్రానికి రీమేక్ ఇది. పీవీపీ సినిమా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రానాతో పాటు ఆర్య, బాబీసింహా, శ్రీదివ్య, పార్వతీమీనన్ హీరోహీరోయిన్లుగా నటించారు. నటి సమంత,రాయ్‌లక్ష్మి అతిథి పాత్రల్లో మెరిసిన ఈ చిత్రానికి టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడుగా పేరొందిన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. గోపీసుందర్ సంగీతం అందించిన బెంగులూర్ నాట్కల్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఉదయం చెన్నైలోని సత్యం సినీకాంప్లెక్స్‌లో జరిగింది. రానా మాట్లాడుతూ తమిళ చిత్రంలో నటించాలన్న తన కోరిక ఈ చిత్రం ద్వారా నెరవేరిందన్నారు.తమిళనాడులో సినిమా పోస్టర్లలో తన ఫొటో చూసుకోవాలన్న తన కల ఈ బెంగుళూర్ నాట్కళ్ చిత్రంతో ఫలించిందనే సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఒరిజినల్ మలయాళ చిత్రం చూసినప్పుడే పాహత్ ఫాజిల్ పాత్ర చాలా నచ్చిందన్నారు. అలాంటి పాత్రలో నటించాలని అప్పుడే అనుకున్నానని, ఆ తరువాత ఆ చిత్రాన్ని పీవీపీ సంస్థ రీమేక్ చేయడం అందులో పాహత్ ఫాజిల్ పోషించిన పాత్రకు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తనను ఎంపిక చేయడం యాదృశ్చకంగా జరిగినా ఆనందంగా ఉందన్నారు. నటి శ్రీదివ్య సాధారణంగా ఏ కార్యక్రమంలోనూ ఎక్కువగా మాట్లాడలేదు.
అలాంటిది ఈ కార్యక్రమంలో ఒక పెద్ద పేపర్‌లో రాసుకుని చిత్రంలో నటించిన తన అనుభవాలను విరివిగా పంచుకోవడం విశేషం. బెంగుళూర్ నాట్కళ్ చిత్రంలో నటించడం మంచి అనుభవం అన్నారు. సాధారణంగానే హీరోలతో నటించేటప్పుడు హైట్ విషయంలో కష్టపడాల్సివస్తుందనీ ఈ చిత్రంలో రానా సరసన నటించడానికి,ఆయన ఎత్తుకు సరితూగడానికి ఎంత శ్రమపడ్డానో చెప్పలేనని సరదాగా అన్నారు.

Post a Comment

Powered by Blogger.