ప్రతిష్ఠాత్మక ‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ’ (ఐఫా) తొలిసారిగా దక్షిణాదికి వచ్చి చాలా సంచలనాలే సృష్టించింది. దక్షిణాదిలోని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ నాలుగు సినిమా పరిశ్రమలకు సంబంధించి తొట్టతొలిసారిగా చేసిన ‘ఐఫా - ఉత్సవం’ 2016 అవార్డుల వేడుకలో రెండో రోజైన సోమవారం నాడు ఎన్నో విశేషాలు చోటుచేసుకున్నాయి. జియోనీ, రేనాల్ట్ సంస్థల సహ సమర్పణలో జియోనీ, రేనాల్ట్ సంస్థల సహ సమర్పణలో ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ అందించిన ఈ ‘ఐఫా - ఉత్సవం’లో క్రేజీ హీరోలు రామ్‌చరణ్, అఖిల్, అందాల తార తమన్నా తదితరులు పలు హిట్ పాటలకు ఆహూతుల ఎదుట ప్రత్యక్షంగా నర్తించారు.

దాంతో,  గచ్చీబౌలిలోని ఔట్‌డోర్ స్టేడియమ్‌కు విచ్చేసిన జనం వేదికకే కళ్ళప్పగించి, చూస్తూ ఉండిపోయారు. ప్రముఖ హిందీ నటీనటులు ప్రసిద్ధ అవార్డు ప్రదానోత్సవాల్లో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం చాలాకాలంగా ఉన్నదే. కానీ, తెలుగు హీరోలు స్టేజ్ డ్యాన్స్ చేయడం ఇదే తొలిసారి.

ఎలక్ట్రిఫయింగ్ రామ్‌చరణ్
‘ఐఫా - ఉత్సవం’లో స్టేజ్ ప్రదర్శన కోసం కొద్ది రోజులుగా తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు రామ్‌చరణ్. ఆ కృషి మొత్తం సోమవారం వేదికపై కనిపించింది. ఒరిజినల్‌గా మంచి డ్యాన్సరైన రామ్‌చరణ్ కళ్ళు మిరుమిట్లు గొలిపే డ్రెస్‌తో, కళ్ళకు గాగుల్స్ ధరించి, చేతిలో గిటార్ పెట్టుకొని వేదికపై కనిపించగానే స్టేడియమ్‌లో హర్షధ్వానాలు మారుమోగాయి.

గిటార్ కొన నుంచి నిప్పులు విరజిమ్ముతుండగా, పలు హిట్ పాటల్లోని పల్లవులతో కూడిన సమ్మిశ్రమ గీతానికి రామ్‌చరణ్ డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. ‘ఆరెంజ్’, ‘బ్రూస్‌లీ’ తదితర చిత్రాల నుంచి ఎంచుకున్న పాటల పల్లవులు ఈ ‘మెడ్లీ’ సాంగ్‌లో చోటుచేసుకున్నాయి. అలాగే తండ్రి చిరంజీవి హిట్ సాంగ్స్‌కు రీమిక్స్‌లుగా తన సినిమాల్లో వాడుకున్న ‘బంగారు కోడిపెట్ట...’, ‘వానా వానా వెల్లువాయే...’ పాటల పల్లవులకు ఈ అగ్ర హీరో ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ చేశారు.

రామ్‌చరణ్ డ్యాన్స్ చేస్తుంటే, తండ్రి చిరంజీవి, తల్లి సురేఖ, భార్య ఉపాసన తదితరులు ముందు వరుసలో కూర్చొని, అభిమానంగా, ఆసక్తిగా చూశారు. ప్రతి పాట పల్లవికీ కాస్ట్యూమ్‌లో వైవిధ్యాన్ని చూపుతూ, రామ్‌చరణ్ డ్యాన్స్ చేశారు. ‘వానా వానా వెల్లువాయే...’ పాటకు డ్యాన్స్ చేస్తున్నప్పుడు వేదికలో సగానికి పైగా పరుచుకున్న పొడవాటి పచ్చరంగు కొంగుతో తమన్నా వేదికపై ప్రత్యక్షమయ్యారు. ‘మెగా మెగా మెగా మీటర్...’ అంటూ వచ్చే తాజా ‘బ్రూస్‌లీ’ పాటకు హుందాగా రామ్‌చరణ్ వేసిన స్టెప్పులు అభిమానులకు గిలిగింతలు పెట్టాయి. కెమేరా ముందే తప్ప ఎన్నడూ జనం ముందు నర్తించని రామ్‌చరణ్ ఈ తొలి ప్రయత్నంలోనే తన సత్తా ఏమిటో చూపారు.

దూసుకొచ్చిన అఖిల్
గత ఏడాదే ‘అఖిల్’ సినిమాతో తెరపై హీరోగా పరిచయమైన నాగార్జున రెండో కుమారుడు అఖిల్ డ్యాన్స్ ‘ఐఫా - ఉత్సవం’లో మరో స్పెషల్ ఎట్రాక్షన్. మోటార్ బైక్ నడుపుతూ, వేదిక ముంగిటకు దూసుకు వచ్చారీ యువ హీరో. బైక్ దిగుతూనే, ముందు వరుసలో కూర్చొని ఉన్న తల్లితండ్రులు నాగార్జున, అమల దగ్గరకు వెళ్ళి, కాళ్ళకు నమస్కరించిన అఖిల్ ఆ పైన జనానికి అభివాదం చేస్తూ, వేదిక మీదకు వచ్చారు. తొలి చిత్రం ‘అఖిల్’లో కెమేరా ముందు నర్తించిన పాటలనే జనం ముందు ప్రదర్శించారీ క్రేజీ హీరో. ‘పడేశావే పడేశావే.. నీ మాయలో నన్ను పడేశావే...’ పాటకు స్లో మూవ్‌మెంట్ వేసినా, ‘జరా నవ్వరాదే...’, ‘అక్కినేని... అక్కినేని...’ లాంటి బీట్ పాటలకు ఫాస్ట్ స్టెప్పులు వేసినా, డ్యాన్స్‌లో ఒక హుందాతనం చూపించారు.

అఖిల్ డ్యాన్స్ చేస్తున్న తీరును ప్రేక్షకులతో పాటు, ఇంకా చెప్పాలంటే వాళ్ళ కన్నా మరింత ఆసక్తిగా నాగార్జున, అమల చూశారు. అఖిల్ డ్యాన్స్ చేస్తున్నంత సేపు తల్లితండ్రులుగా వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. మరీ ముఖ్యంగా, అమల ముఖంలో చిరు నవ్వుతో కూడిన ఆనందం స్పష్టంగా తొంగిచూసింది. వేదికపై తనతో పాటు నర్తిస్తున్న గ్రూప్ డ్యాన్సర్లందరినీ కలుపుకొని అఖిల్ వేదికపై దుమ్ము రేపారు.

డ్యాన్స్ కా... తమన్నా
అవార్డు ప్రదాన వేదికలపై హీరోయిన్లు డ్యాన్స్‌లు చేయడం మామూలే. కానీ, ‘ఐఫా - ఉత్సవం’ 2016లో తమన్నా చేసిన డ్యాన్స్ మామూలు విషయం కాదు. పాలరాతిలా తెల్లగా ఉంటుందంటూ వ్యాఖ్యాతలు ‘‘మార్బుల్ బ్యూటీ’’ అని తమన్నాను సంబోధించినప్పుడు స్టేడియవ్‌ు అంతా కిసుక్కుమంది. ఆకాశంలో నుంచి అప్సరస దిగినట్లుగా, వేదిక పైకి ఆమె దిగివచ్చిన దృశ్యం ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోయే జ్ఞాపకం. ‘బాహు బలి’లోని ‘ధీవర...’ పాటకు దేవలోక కన్యలానే ఆమె అభినయించారు. ‘పచ్చబొట్టేసినా...’ పాటలో సున్నితమైన ప్రేమను పండించారు.

‘నీ నగుమోమే ఎక్స్‌ట్రార్డినరీ’ పాటకి తమన్నా మంచి బీట్‌లో నర్తిస్తుంటే, స్టేడియమ్ అంతా ఈలలే. ఇక, ఫాస్ట్‌గా సాగే తమిళ పాట ‘సబ్‌స్క్రై బర్ నాట్ రీచబుల్ మచ్చీ’కి మిల్కీబ్యూటీ స్టెప్పులేస్తుంటే, జనంలో వేడి, ఉత్సాహం పెరిగిపోయాయి. మరో తమిళ పాట ‘సెల్ఫీ పుళ్ళా...’తో దాన్ని పతాకస్థాయికి తీసు కెళ్ళి, పాట చివరలో వేదిక దిగి చిరంజీవి, నాగార్జున, మహేశ్‌బాబు లాంటి అగ్రహీరోలతో తమన్నా సెల్ఫీ తీసుకోవడం కనువిందుగా మారింది. మొత్తానికి, ‘ఐఫా-ఉత్సవం’లో తిరుగులేని స్టార్ ఎట్రాక్షన్... ఈ స్టార్స్ డ్యాన్‌‌స.

Post a Comment

Powered by Blogger.