మెల్‌బోర్న్: ప్రపంచ టెన్నిస్‌ను మ్యాచ్‌ ఫిక్సింగ్‌, అవినీతి ఆరోపణలు కుదిపేస్తున్న నేపథ్యంలో వరల్డ్ నంబర్‌ 1 టెన్నిస్ ఆటగాడు నోవాక్‌ జకోవిచ్‌ సంచలన విషయాలు వెల్లడించాడు. తన కెరీర్ ఆరంభంలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కోసం తనను కూడా బెట్టింగ్ దళారులు ఆశ్రయించినట్టు వెల్లడించాడు.

ఆస్ట్రేలియా ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుండగా.. బీబీసీ, బజ్‌ఫీడ్ మీడియా సంస్థలు టెన్నిస్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించాయి. గడిచిన దశాబ్దకాలంలో దాదాపు 50 మంది ఆటగాళ్లు పలుమార్లు మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు తెలిపాయి. మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడిన వారిలో టాప్‌ 50 ర్యాకింగ్‌ ఆటగాళ్లు, గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్లు కూడా ఉన్నారని స్పష్టం చేశాయి. దీంతో ఉలిక్కిపడిన ప్రపంచ టెన్నిస్‌ సమాఖ్య అధికారులు మ్యాచ్‌ఫిక్సింగ్‌ జరిగినట్టు తమ దృష్టికి రాలేదని తెలిపారు.

ఈ నేపథ్యంలో 2007లో తనను కూడా బెట్టింగ్ దళారులు పరోక్షంగా ఆశ్రయించారని జకోవిక్‌ తెలిపారు. అప్పట్లో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో తొలి మ్యాచ్‌లోనే ఓడిపోవాలని తనకు  దళారులు చెప్పారని అన్నారు. అయితే తాను వెంటనే దళారుల ఆఫర్‌ను తిరస్కరించానని, తాను గట్టిగా స్పందించడంతో వారు మళ్లీ తన జోలికి రాలేదని జకోవిక్‌ తెలిపారు. టెన్నిస్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌పై బీబీసీ కథనాన్ని కూడా ఆయన తోసిపుచ్చారు. అప్పుడప్పుడు టెన్నిస్‌లో ఇలాంటి ఆరోపణలు రావడం తన దృష్టికి కూడా వచ్చిందని తెలిపారు. మ్యాచ్ ఓడిపోతే రెండు లక్షల డాలర్లు (రూ. 1.35 కోట్లు) ప్రతిఫలంగా ఇస్తామని జకోవిక్‌కు దళారులు ఆఫర్‌ చేసినట్టు తెలిసింది. కానీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు తాను ఎప్పుడూ పాల్పడలేదని, అది ఆటలో నేరం లాంటిదని జకోవిక్‌ చెప్పారు.

Post a Comment

Powered by Blogger.