* జింబాబ్వేపై 2-0తో క్లీన్‌స్వీప్  
* షెహజాద్ నాలుగో అత్యధిక స్కోరు
షార్జా: చూడటానికి చిన్న జట్టే అయినా మైదానంలో తిరుగులేని ఆటను చూపెట్టిన అఫ్గానిస్తాన్ జట్టు... జింబాబ్వేతో జరిగిన రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ (2-0) చేసింది. మొహమ్మద్ షెహజాద్ (67 బంతుల్లో 118 నాటౌట్; 10 ఫోర్లు, 8 సిక్సర్లు) అంతర్జాతీయ టి20 చరిత్రలో నాలుగో అత్యధిక స్కోరు నమోదు చేయడంతో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రెండో మ్యాచ్‌లో అఫ్గాన్ 81 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. ముందుగా అఫ్గాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 215 పరుగులు చేసింది. నబీ (22), అస్గర్ (18) ఫర్వాలేదనిపించారు.

అత్యధిక స్కోరు జాబితాలో షెహజాద్ కంటే ముందు ఆరోన్ ఫించ్ (156), మెకల్లమ్ (123), డు ప్లెసిస్ (119)లు ఉన్నారు. తర్వాత జింబాబ్వే 18.1 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. మసకద్జా (44 బంతుల్లో 63; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), పీటర్ మూర్ (32 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించినా మిగతా వారు విఫలమయ్యారు.

అఫ్గాన్ బౌలర్ల ధాటికి జింబాబ్వే ఓ దశలో 34 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే మసకద్జా, మూర్‌లు ఆరో వికెట్‌కు 77 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ లోయర్ ఆర్డర్ సరిగా స్పందించకపోవడంతో జింబాబ్వేకు ఓటమి తప్పలేదు. ఓవరాల్‌గా జింబాబ్వే 100 పరుగుల తేడాలో చివరి ఐదు వికెట్లు చేజార్చుకుంది. షెహజాద్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’; మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.

Post a Comment

Powered by Blogger.