నా కాల్‌షీట్స్ కాస్ట్లీగురూ!

నా కాల్‌షీట్స్ కాస్ట్లీగురూ!
విజయాలు ఎంత పని అయినా చేస్తాయి. ఇక చిత్ర పరిశ్రమ విషయానికి వస్తే సక్సెస్‌లతో పారితోషికాలు పెంచే వరుసలో ముందుగా హీరోహీరోయిన్లే ఉంటారు. ముఖ్యంగా కోలీవుడ్‌లో కథానాయకుల పారితోషికాలు నిర్మాతల కళ్లు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్, విజయ్,అజిత్ వంటి ప్రముఖ హీరోల పారితోషికాలు ఆశ్చర్యపరుస్తాయి.ఇక నటుడు అజిత్‌కు సంబంధించిన ప్రచారంలో ఉన్న తాజా సమాచారం ఏమిటంటే ఆయన 30 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారట.

  అజిత్ ఇటీవల నటించిన ఆరంభం, వీరం, ఎన్నైఅరిందాల్, వేదాళం చిత్రాలు వరుసగా విజయం సాధించాయి. వీటిలో మూడు చిత్రాలను శ్రీసాయిరామ్ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం.రత్నం నిర్మించడం విశేషం. అదే విధంగా రెండు చిత్రాలకు శివ దర్శకత్వం వహించారు. అజిత్ తదుపరి చిత్రానికి ఈ దర్శకుడే పనిచేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. అజిత్‌తో సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే మరి కొందరు నిర్మాతలు అజిత్ కాల్‌షీట్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. వేదాళం చిత్రం 30 రోజుల్లోనే 100 కోట్లు వసూళ్లు సాధించిందనే విషయం ప్రచారంలో ఉంది.

  వరుస విజయాలతో పుల్‌జోష్‌లో ఉన్న అజిత్ ఇప్పటి వరకు 20 నుంచి 21 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారని టాక్. అయితే దాన్ని ఇప్పుడు 30కి పెంచినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. మరి ఆ కొత్త నిర్మాతలు అజిత్‌కు 30 కోట్లు పారితోషికంగా ముట్ట చెప్పడానికి సిద్ధం అంటారా? ఇంతకీ ఎవరా నిర్మాతలు?అన్న విషయాలపై ఆరా తీసే పనితో నిమగ్నమయ్యారు కోలీవుడ్ వర్గాలు. అజిత్ తన తాజా చిత్రంలో హీరోయిన్‌గా నయనతారను కోరుకుంటున్నట్లు తెలియడంతో ఆ నిర్మాతలు ఆమె కాల్‌షీట్స్‌ను బ్లాక్ చేసే పనిలో ఉన్నట్లు టాక్. ప్రస్తుతం కాలుకు శస్త్ర చికిత్స చేయించుకుని విదేశాల్లో విశ్రాంతి పొందుతున్న అజిత్ చెన్నైకి తిరిగి వచ్చిన తరువాత గానీ తన తాజా చిత్రం గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Post a Comment

Powered by Blogger.