ఆ ఎస్సై ఏ స్టేషన్‌లో ఉన్నా వివాదాస్పదమే
ఆయనే జడ్జి.. ఆయనే ఎస్పీ.. ఆయనే డీఎస్పీ
అక్రమ సంపాదనే ధ్యేయంగా విధులు నిర్వహణ
రేణంగివరంలో సీపీఎం నాయకుడిని చితకబాదిన ఖాకీ
ఇప్పటికే అతని ప్రవర్తనపై ఉన్నతాధికారులు సీరియస్
ఆ కానిస్టీబుల్‌ను కాస్తా బదిలీ చేసి పుణ్యం కట్టుకుందురూ...కన్యాశుల్కంలో ఓ పాత్ర ఆవేదన... బ్రిటిష్ కాలంలో... రాచరికం పాలనలో ... వందేళ్ల కిందటి మాట ఇదీ... నల్ల దొరల పాలనలో... ఇప్పటికీ మారని ఖాకీల తీరు... నెత్తిన టోపీ ... చేతిలో లాఠీ ఉంటే చాలు.. జీతంతో పని లేదు ... గీతంతోనే సహవాసం...అమాయకులపై చిందులు... పంచాయితీలతో బెంబేలు.. ఎదురు తిరిగితే అక్రమ కేసులు ... పోలీసుల చెంత కురిపిస్తున్నాయి కాసుల రాశులు... కాదేదీ అవినీతికనర్హమంటూ కొంతమంది ఖాకీ బాబులు కొత్త భాష్యం చెబుతున్నారు...వందేళ్ల తరువాత కూడా... ఈ పోలీసులు మాకొద్దంటున్నారు... ఖాకీ బాధితులు.
ఒంగోలు క్రైం : రేణంగివరంలో ఎస్సైగా పని చేస్తున్న బి.జగన్‌మోహన్‌రావు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి వివాదాస్పదంగానే విధులు నిర్వర్తిస్తున్నాడు. 2013 బ్యాచ్‌కు చెందిన ఆయన శిక్షణ కాలం పూర్తయిన తర్వాత తొలుత మేదరమెట్ల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు.
మేదరమెట్లలో ఎస్సైగా చేస్తున్న సమయంలో అనేక వివాదాల్లో కూరుకుపోరుు ఎన్నో ఆరోపణలు మూటగట్టుకున్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన ఎస్సైలు ఎవరైనా కొంతకాలం శాంతిభద్రతలను కాపాడటంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. అలాంటిది ఈయన తొలినాటి నుంచే అక్రమాలకు తెరలేపి సంపాదనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు.
ఇవిగో.. ఆరోపణలు
2014 సాధారణ ఎన్నికలకు ముందు అద్దంకి ఎక్సైజ్ అధికారులు ఓ బెల్టు షాపుపై దాడి చేసి మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. మద్యం బాటిళ్లతో పాటు నిర్వాహకుడిని కూడా వదిలిపెట్టాలంటూ అప్పట్లో ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇది కాస్తా జిల్లా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఆ వెంటనే సదరు ఎస్సైని వీఆర్‌కు పంపారు.
అదే బెల్ట్‌షాపు నిర్వాహకుడు వ్యభిచార గృహాలు నిర్విహ స్తున్నాడు. సదరు ఎస్సై.. అతడినే అనుచరుడిగా పెట్టుకుని అక్రమాలకు పాల్పడినట్లు పోలీస్ ఉన్నతాధికారులు గుర్తించారు.
ఆ తర్వాత పలుకుబడి ఉపయోగించడంతో ఎస్సైకు వీఆర్ నుంచి ఒంగోలు టూటౌన్ పోలీసుస్టేషన్‌కు అటాచ్‌మెంట్ ఇచ్చారు.
ఓ కేసు పనిపై గుంటూరు జిల్లా పొన్నూరుకు కొందరు కానిస్టేబుళ్లతో కలిసి ఎస్సై కారులో వెళ్తున్నారు. మార్గమధ్యంలో ఓ ట్రాక్టర్ కారుకు అడ్డం వచ్చింది. ట్రాక్టర్‌ను ఆపి డ్రైవర్‌ను చితకబాదాడు. ట్రాక్టర్‌తో సహా డ్రైవర్‌ను పొన్నూరు పోలీసుస్టేషన్లో అప్పగించాడు.
కొంతకాలం తర్వాత తన రాజకీయ పలుకుబడి ఉపయోగించుకుని రేణంగివరం ఎస్సైగా పోస్టింగ్ తెచ్చుకున్నారు. అక్కడ కూడా పాత తంతే కొనసాగిస్తున్నారు. ఇటీవల ఓ లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని అతడిని అనవసరంగా స్టేషన్‌కు తరలించి మరో వివాదం మూటగట్టుకున్నాడు.
తాజాగా శనివారం రాత్రి రేణంగివరంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. స్థానిక సీపీఎం నాయకుడు తిరుపాలు కలగజేసుకుని ఇరువర్గాలకు సర్ది చెప్పాడు. ఈ నేపథ్యంలో అక్కడకు చేరుకున్న ఎస్సై.. సీపీఎం నాయకుడు తిరుపాలును దూషించాడు. తనకు అడ్డు చెబుతావా.. అంటూ చితక్కొట్టాడు. ప్రస్తుతం తిరుపాలు అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. జిల్లా వ్యాప్తంగా సీపీఎం నాయకులు ఆందోళనకు దిగారు.
ఎస్సై.. అంటే అందరికీ తెలిసి ఒక స్టేషన్‌కు ఎస్‌హెచ్‌ఓ.. ఆ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్‌ను అదుపులో ఉంచడం ఆయన ప్రధాన విధి. రేణంగివరం ఎస్సై అన్నీ తానై చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని నిరంకుశ పాలనకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాడు. ఆయన లా అండ్ ఆర్డర్‌తో పాటు దశావతారాలు పోషిస్తున్నాడు.
ఇవిగో.. ఆయన అవతారాలు
1. పొలిటీషియన్‌గా రాణిస్తున్నారు..
2. సెటిల్‌మెంట్లతో దందా చేస్తున్నారు..
3. అక్రమార్జనే ధ్యేయంగా ఉన్నారు..
4. బెల్ట్‌షాపుల నిర్వాహకులకు అండగా ఉన్నారు..
5. వ్యభిచారం నిర్వాహకులతో సన్నిహితంగా ఉన్నారు..
6. అడ్డొచ్చినోడిని చితకబాదుతున్నారు..
7. వివాదాల్లో తలదూర్చి రాజీలు చేస్తున్నారు..
8. ఆ మండలానికి ఆయనే ఎస్పీ..
9. ఆ డివిజన్‌కు ఆయనే డీఎస్పీ..
10. ఆ సర్కిల్‌కు ఆయనే సీఐ..
చర్యలు తీసుకోవాల్సిందే..
ఒంగోలు సెంట్రల్ : దళిత యువకుడు తిరుపాలును పోలీసుస్టేషన్‌లో హింసించిన రేణంగివరం ఎస్సై జగన్‌మోహన్‌రావుపై చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎస్.శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఘర్షణ పడుతున్న వారికి సర్ది చెబుతున్న తిరుపాలుపై ఎస్సై థర్డ్ డిగ్రీ ప్రయెగించడం దారుణమన్నారు. ఆయన మానసిక స్థితిపై కూడా పలు అనుమానాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
ఎస్సైపై అట్రాసిటీ కేసు నమోదు చేయూలి
ఎస్పీని కలిసి విజ్ఞప్తి చేసిన వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు
రేణంగివరం ఎస్సై జగన్‌మోహనరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వివిధ రాజకీయ పార్టీల నాయకులు సోమవారం ఎస్పీని కలిసి విజ్ఞప్తి చేశారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కె.రఘునాథ్, డీహెచ్‌పీఎస్ జిల్లా కార్యదర్శి నక్కల శ్రీనివాసులు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బి.బాలకోటయ్య, గిరిజన సంఘ రాష్ట్ర కార్యదర్శి శ్రీరామ్ శ్రీనులతో పాటు పలువురు కలిసి రేణంగివరం ఎస్సైపై అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఎస్పీని కోరారు. కేవీపీఎస్ అద్దంకి డివిజన్ ఉపాధ్యక్షుడు జి. తిరుపాలును కులం పేరుతో దూషిస్తూ దారుణంగా కొట్టిన ఘటనపై విచారణ నిష్పక్షపాతంగా జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సైపై విచారణ చేరుుస్తానని ఎస్పీ శ్రీకాంత్ హామీ ఇచ్చినట్లు ప్రజాసంఘాల నేతలు తెలిపారు.
Post a Comment