నిఘా నిద్దరపోతోందా?


నిఘా నిద్దరపోతోందా?
అధికారంలోకి  వచ్చామన్న ఆనందం ఆవిరైపోతోంది. కుటుంబాన్ని, చివరకు దేవాన్ష్ (మనవడు)తో ఆనందంగా ఆడుకోవాల్సిన సమయంలోనూ ఇక్కడే (విజయవాడలో) ఉండి పాలన సాగిస్తున్నా ఫలితం ఉండటం లేదు. పోలీస్ నిఘా వ్యవస్థ నిద్దరపోతున్నందున నాకు నిద్దర కరవవుతోంది.  అప్పుడేమో ఓటుకు నోటులో ఎరక్కపోయి ఇరుక్కుని ఇప్పటికీ ఇగ్గులాడుతున్నా. హైదరాబాద్‌లో అడుగు పెట్టాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోంది. ఇప్పుడేమో కాల్‌మనీ- సెక్స్‌రాకెట్ కేసు అటు పార్టీని, ఇటు నా పరువు ప్రతిష్టలను మంటగలుపుతోంది. చివరకు ‘కామ(కాల్‌మనీ)’ చంద్రబాబు అని అనిపించుకోవాల్సి వస్తోంది... అయిన వారి వద్ద   బిగ్‌బాస్ వాపోతున్న తీరిది. సొంతవారే కదా కంటికి రెప్పలా అన్నివిధాలా కాపలా కాస్తారనే ఉద్దేశంతో నిఘా పదవి కట్టబెట్టినా  ప్రయోజనం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ‘మనోడు మనోడు అనుకుంటే ఏదో చేసిన’ విధంగా ఉందని బిగ్‌బాస్ ఆక్రోశం వెళ్లగక్కారట.

తెలంగాణలో ‘బ్రీఫ్డ్ మీ’ వాయిస్‌లు హోరెతే ్తవరకు పసిగట్టకపోవడంతో పరువు గోదావరిలో  కలిసిందని, ఇప్పుడు ‘కాల్’నాగులతో కలిసిన ఫోటోలు హల్‌చల్ చేసేంతవరకు నిఘా విభాగాధిపతులకు తెలియకపోవడంతో మరోసారి పరువు పక్కనే ఉన్న కృషా ్ణనదిలో కలిసిందని బిగ్‌బాస్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారట. తెలంగాణ అంటే పొరుగు రాష్ట్రం నిఘా నిద్దరోయిందంటే ఫర్వాలేదు కానీ.. సొంత రాష్ట్రంలో అదీ.. విజయవాడ, గుంటూరులో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకుండా నిఘా  బాస్‌లు ఏం పీకుతున్నారని ఒకింత ఘాటుగానే బిగ్‌బాస్ మండిపడ్డారట.

 నా గతేం కాను...: బిగ్‌బాస్ బాధ అలా ఉంటే... నిఘా బాస్ బాధ అంతా ఇంతా కాదట. తాజాగా పోలీస్ బిగ్‌బాస్ విజయవాడలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. అక్కడకు నిఘా బాస్ వచ్చి తన కింది స్థాయి అధికారులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారట. విజయవాడలో ఇంత జరుగుతుంటే మీరంతా ఏం చేస్తున్నారని ఇద్దరు, ముగ్గురు  అధికారులను అడ్డదిడ్డంగా నిలదీశారట. కాల్‌మనీ-సెక్స్‌రాకెట్  నిందితునితో కలసి ఉన్న ఫోటోలు పత్రికల్లో, టీవీల్లో హల్‌చల్ చేస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు. ముందుగానే గుర్తించి  వారితో మాట్లాడి ఆపించాల్సిన పనిలేదా అని ఆక్రోశం వెళ్లగక్కారట. మీ పనితీరులో లోపం వల్ల నాదంతా డొల్లతనమనుకునేలా చేశారంటూ  ఆవేదన వ్యక్తం చేశారట. ఎవరికి వారు ఆడలేక మద్దెల ఓడన్నట్లు  ఉంది టీడీపీ అధినేత, నిఘా బాస్‌ల తీరు.

Post a Comment

Powered by Blogger.