గ్రేటర్ ఎన్నికల పర్వంలో అసలు సిసలు యుద్ధం మొదలైంది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ప్రత్యర్థులెవరో తేలడంతో ఎవరికి వారు అస్త్రశస్త్రాలతో గెలుపు పోరుకు సిద్ధమయ్యారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ-బీజేపీ, ఎంఐఎం పార్టీల్లో స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దూకుతున్నారు. శుక్రవారం నుంచి ఇక గల్లీగల్లీలో ఎన్నికల ప్రచారం హోరెత్తనుంది. అధికార టీఆర్‌ఎస్‌లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల వంటి అతిరథమహారథులంతా ప్రచారానికి సిద్ధమవగా.. కాంగ్రెస్‌లో ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జిలే ప్రచారకర్తలుగా మారారు. ఎంఐఎంలో ఎప్పటిలానే అసద్-అక్బరుద్దీన్‌లే స్టార్ ఎట్రాక్షన్.
ఇక బీజేపీ నుంచి కిషన్‌రెడ్డి ప్రచారానికి సిద్ధమవుతుండగా.. టీడీపీలో కొంత గందరగోళం నెలకొంది. ఏది ఏమైనా ఓ వారం రోజులపాటు నేతలంతా ప్రచార యుద్ధంలో మునిగితేలనున్నారు.
* జీహెచ్‌ఎంసీ రణంలో మోహరించిన ‘టీ’ కేబినెట్!
* ప్రచారంలో 17 మంది మంత్రులు, 9 మంది ఎంపీలు, 50 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎమ్మెల్సీలు
* కాంగ్రెస్‌లో ఇన్‌చార్జులే స్టార్ క్యాంపెయినర్లు
* దళపతిపైనే బీజేపీ భారం
* ‘జోడీ’ బ్రదర్స్‌పై ఎంఐఎం ఆశలు
* టీడీపీలో వీడని గందరగోళం
* టీఆర్‌ఎస్.. అతిరథమహారథులు
మహానగర పాలకమండలి ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి సర్వసైన్యాన్ని మోహరించింది. తెలంగాణ క్యాబినెట్ మొత్తంతో పాటు తొమ్మిది మంది లోక్‌సభ సభ్యులు, 50 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్, డీసీసీబీ చైర్మన్లందరికీ ఒక్కొక్క డివిజన్ చొప్పున బాధ్యతలు అప్పగించింది. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశనం చేసింది. ఇప్పటికే పలు దఫాలుగా తమకు కేటాయించిన ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు..గురువారం నుండి పార్టీ అభ్యర్థుల ప్రచారానికి మరింత ఊపు తేనున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలంతా పార్టీలో అసంతృప్తితో ఉన్న నాయకులను దారికి తేవటంతో పాటు, ఆయా కాలనీలు, బస్తీల వారిగా ఉన్న సామాజిక వర్గాల ఓట్లను వీలైనంత మేర రాబట్టే దిశగా స్థానిక వ్యూహాన్ని అమలు చేస్తారు. అలాగే ప్రత్యర్థి పార్టీల్లో అసంతృప్త నాయకులను చేరదీసే లక్ష్యంగా పనిచేయనున్నారు.
కాంగ్రెస్.. నియోజకవర్గ ఇన్‌చార్జిలపైనే భారం
గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిలపైనే పూర్తి భారం మోపింది. ప్రచార వ్యూహం మొత్తాన్ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీల ఆధ్వర్యంలో రూపొందిస్తున్నారు. ఏఐసీసీ నేతలు దిగ్విజయ్‌సింగ్, గులాం నబీ ఆజాద్‌లకు తోడు అజ హారుద్దీన్, రేణుకాచౌదరి, సినీనటుడు చిరంజీవి, ఏపీ నాయకులు రఘువీరారెడ్డి, నాదెండ్ల మనోహర్‌లను ప్రచారంలోకి దింపనున్నారు. మరోవైపు గత సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులే నియోజకర్గంలో స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచార బాధ్యతలను మీద వేసుకున్నారు.
ముఖేషగౌడ్(గోషామహల్), దానం నాగేందర్((ైఖైరతాబాద్), దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి(ఎల్బీనగర్), బండారి లక్ష్మారెడ్డి(ఉప్పల్), కూన శ్రీశైలం గౌడ్(కుత్బుల్లాపూర్), ఎం.భిక్షపతియాదవ్(శేరిలింగంపల్లి), విష్ణువర్ధన్‌రెడ్డి(జూబ్లీహిల్స్), హన్మంతరావు(అంబర్‌పేట)లు జీహెచ్‌ఎంసీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు.
ఎంఐఎం.. కొత్త ప్రాంతాలపై దృష్టి
కొత్త ప్రాంతాలకు విస్తరించే లక్ష్యంగా ఎంఐఎం ప్రచార వ్యూహాన్ని రూపొందించింది. ఎంపీ అసదుద్దీన్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీలిద్దరే స్టార్ క్యాంపెయినర్లుగా మారారు. కొత్త ప్రాంతాలకు విస్తరించే లక్ష్యంతో ఎంపీ అసదుద్దీన్ పక్కాగా ప్రచార వ్యూహాన్ని రూపొందించుకున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, అంబర్‌పేట, కుత్బుల్లాపూర్, ముషీరాబాద్ నియోజకవర్గాలపై దృష్టి సారించారు. వీటికి తోడు చార్మినార్ నియోజకవర్గంలోని శాలిబండ, ఘాన్సీబజార్, పురానాపూల్ డివిజన్లలోనూ గట్టి ప్రత్యర్థులు ఉండటంతో అసద్ ఎక్కువ సమయాన్ని కేటాయించేలా వ్యూహం రూపొందించారు.
బీజేపీ.. బస్తీ, కాలనీ సభలపై ఆశలు
తెలుగుదేశం పార్టీతో మిత్ర భేదం భారతీయ జనతా పార్టీ క్యాడర్‌ను ఒకింత నిరుత్సాహానికి గురి చేసింది. దీనికి తోడు బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థులను చివరి నిమిషం వరకు ప్రకటించని అంశం కూడా పార్టీలో ఒకింత అయోమయానికి కారణమైంది. ఈ అయోమయాన్ని, నిరుత్సాహాన్ని దూరం చేసే దిశగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి బరిలో దూకనున్నారు.
ఇందుకు ఆయన అస్త్రశస్త్రాలను సిద్ధం చేశారు. తనతో పాటు కేంద్రమంత్రి దత్తాత్రేయ, బీజేఎల్‌పీ నేత లక్ష్మణ్‌లతో పాటు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులను కలుపుకుని ప్రచారాన్ని హోరెత్తించే సన్నాహాల్లో నిమగ్నం అయ్యారు. ముఖ్యంగా బస్తీ, కాలనీ సభలతో పాటు ప్రచారం చివరలో మరో భారీ సభను నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నారు.
టీడీపీ.. పెద్ద సవాలే...
కీలకమైన జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అంటీముట్టనట్లుగా ఉంటున్న వైనం క్యాడర్‌ను నిరుత్సాహానికి, గందరగోళానికి గురిచేసింది. నిజాం కళాశాలలో నిర్వహించిన సభలో పాల్గొన్న బాబు..క్యాడర్ కాదు కదా..లీడర్లలోనూ నమ్మకాన్ని కల్పించలేకపోయారని పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాబు వస్తే కానీ ఎన్నికల ప్రచారం వేడెక్కదని నగర నాయకులు తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 28,29,30 తేదీల్లో బాబు నగర పర్యటనను ఖరారు చేశారు. మరికొన్ని చోట్ల నారా లోకేష్ పాల్గొననున్నారు.
మొత్తంగా సీట్ల పంపకం నుండి, అభ్యర్థుల ఎంపిక వరకు అన్నీ తానై వ్యవహరించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి బీజేపీతో తమ క్యాడర్‌ను సమన్వయం చేసే బాధ్యతల్ని చేపట్టనున్నారు. ఈ సమన్వయమే ఇప్పుడు టీడీపీకి పెద్ద సవాల్!
Post a Comment