- స్టాక్ మార్కెట్ కుప్పకూలడంతో పశ్చిమ గోదావరి జిల్లాలో నష్టం
- బంగారానికి మాత్రం మంచిరోజు
తణుకు: స్టాక్ మార్కెట్ మరోసారి జిల్లాను షేక్ చేసింది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇన్వెస్టర్లు హడలెత్తిపోయారు. బుధవారం స్టాక్‌మార్కెట్ భారీ నష్టాలతో ముగియడంతో ఇన్వెస్టర్లు నష్టాల బాట పడ్డారు. ఈ పరిస్థితుల్లో అయినకాడికి షేర్లు అమ్ముకున్నారు. 20 నెలల కనిష్టస్థాయికి పతనం కావడంతో ఈ నష్టం జిల్లాలో రూ.వంద కోట్లు పైబడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎక్కువ ధరకు కొనుగోలు చేసి తక్కువ ధరకు విక్రయించుకున్నవారు మాత్రం తీవ్రంగా నష్టపోయారు. ఐదు నెలలుగా సెన్సెక్స్ హెచ్చు తగ్గులకు లోనవుతుండగా బుధవారం ఒక్కరోజే 600కు పైగా పాయింట్లు నష్టపోవడంతో చిన్నస్థాయి ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోయారు. మొత్తమ్మీద 2071 షేర్లు నష్టపోగా 543 షేర్లు మాత్రంం లాభాల దిశగా కొనసాగాయి. మరో 138 షేర్లు స్థిరంగా ఉన్నాయి.
జిల్లాపై తీవ్ర ప్రభావం...
సెన్సెక్స్ ప్రభావం జిల్లాపై తీవ్రంగానే చూపింది. ముఖ్యంగా తణుకు, భీమవరం, ఏలూరు, నరసాపురం, తాడేపల్లిగూడెం పట్టణాల్లో ట్రేడింగ్ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో సుమారు 200 పైగా స్టాక్ బ్రోకింగ్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో నిత్యం దాదాపు రెండు లక్షల మంది ఇన్వెస్టర్లు లావాదేవీలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుత పరిస్థితులతో ట్రేడింగ్‌లో పాల్గొంటున్న ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. బుధవారం ఉదయం నుంచి నెలకొన్న పరిణామాలు, సెన్సెక్స్ పడిపోతున్న తీరుపై మథనపడుతున్నారు. ప్రారంభం నుంచి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను నిండా ముంచింది. డాలరుతో రూపాయి మారకం విలువ 28 నెలల కనిష్టానికి పడిపోయింది.
బుధవారం సాయంత్రానికి రూపాయి మారకం విలు రూ.68 వద్ద కొనసాగుతోంది. 2013 ఆగస్టులో డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 68.85కు పడిపోగా తిరిగి ఇప్పుడు ఆ స్థాయికి పడిపోయింది. దీంతోపాటు చమురు ధరలు పడిపోతుండటం వంటి అంశాలు అంతర్జాతీయ పరిణామాలు దీనికి ప్రధాన కారణంగా నిలిచాయని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇది ఇలా ఉండగా బంగారం ధర మాత్రం బుధవారం ఒక్కరోజులోనే పది గ్రాములు రూ.340 పెరిగి రెండు నెలల గరిష్టానికి చేరుకుంది. పెళ్లిళ్ల సీజన్ ముందుండటం, బంగారం వ్యాపారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో రూ. 26,690కు చేరుకుంది.
రాబోయే రోజుల్లో లాభాలు
ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుని ఒకట్రెండు రోజుల్లో మంచి వ్యాపారం జరుగుతుంది. తద్వారా రాబోయే రోజుల్లో లాభాలు రావచ్చని ఆశిస్తున్నాం. ఇప్పటి వరకు లాభాల్లో ఉన్న కొన్ని షేర్లు నష్టాలు రావడంతో అయినకాడికి అమ్ముకున్నాం.
Post a Comment