♦ అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండేలా 70 శాతం ప్రధాన సిలబస్
♦ రాష్ట్రాల అవసరాలకు తగినట్లు 30 శాతం వరకు మార్పులకు అవకాశం
♦ ఈ నెల 23న హైదరాబాద్‌లో జరిగే సమావేశంలో ఖరారు
♦ కేంద్రానికి నివేదిక.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు

 దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్‌కు ఒకే ప్రధాన సిలబస్ అమల్లోకి రాబోతోంది. అయితే ఆయా రాష్ట్రాల స్థానిక పరిస్థితులు, అవసరాలకు తగినట్లుగా కొంత వరకు సిలబస్‌ను చేర్చే అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు జాతీయ స్థాయిలో ఇంటర్‌లో కామన్ సిలబస్, కామన్ ప్రశ్నపత్రాల విధానం, కామన్ వెయిటేజీ విధానం అమల్లోకి తెచ్చేందుకు చర్యలు మొదలయ్యాయి. దీనిపై కేంద్ర మానవ వనరుల శాఖ రెండు నెలల కింద ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ఇంటర్ బోర్డుల కార్యదర్శులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. అన్ని రాష్ట్రాల్లోనూ కామన్ కోర్ సిలబస్ ఉండాలని స్పష్టం చేసింది.

సిలబస్‌లో మార్పులు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కన్వీనర్‌గా సిలబస్ సమీక్ష కమిటీని నియమించింది. కన్వీనర్‌గా ఉన్న తెలంగాణ బోర్డు కార్యదర్శి నేతృత్వంలో... రాష్ట్రంలోని సబ్జెక్టు నిపుణులతో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించారు. బుధ వారం కూడా భేటీ అయి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సిలబస్‌లో ఎలాంటి మార్పులు అవసరమన్న అంశంపై చర్చించారు. ఇక ఈనెల 23న అన్ని రాష్ట్రాల ఇంటర్ బోర్డు కార్యదర్శులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించారు.

ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుత సిలబస్, పరీక్షల విధానం, మార్కుల విధానాలను సమీక్షించి... కేంద్రం ఆదేశించిన ప్రకారం 70 శాతం కామన్ కోర్ సిలబస్ ఉండేలా సిఫారసులతో కూడిన నివేదికను సిద్ధం చేయనున్నారు. దానికి కేంద్ర మానవ వనరుల శాఖ ఆమోదం రాగానే అమల్లోకి వస్తుందని, వచ్చే విద్యా సంవత్సరం నుంచే (ఈ ఏడాది జూన్ నుంచి) అమలు చేసే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.

 మార్పులు ఎలా ఉంటాయంటే..
 ప్రస్తుత సిలబస్‌ను సమీక్షించి.. అఖిల భారత స్థాయిలో అన్ని పోటీ, ప్రవేశపరీక్షలకు అనుగుణంగా 70 శాతం కామన్ కోర్ సిలబస్ ఉండేలా చర్యలు చేపడతారు. దీనిని అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా అమలు చేయాలి. మిగతా 30 శాతం వరకు వివిధ రాష్ట్రాలు తమ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకునే వెసులుబాటు ఇస్తారు. అదనంగా చేర్చుకోవడం ఇష్టం లేకపోతే 70 శాతం కామన్ సిలబస్‌తోనే ఇంటర్‌ను కొనసాగించే వెసులుబాటు ఇస్తారు. అందులో జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో పరిగణనలోకి తీసుకునే సిలబస్ కచ్చితంగా ఉండేలా చూస్తారు.

 సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లోనే మార్పులు
 కామన్ కోర్ సిలబస్‌ను తీసుకురావడంలో భాగంగా బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణితం సిలబస్‌లో మార్పులు తెస్తారు. భాషలు, ఆర్ట్స్ గ్రూప్‌లలో మార్పులపై చర్యలు చేపట్టడం లేదు.  బేసిక్ కాన్సెప్ట్‌లు, వాటిల్లో కచ్చితంగా చదవాల్సిన అంశాలకు 70 శాతం సిలబస్‌లో స్థానం కల్పిస్తారు. 23న హైదరాబాద్‌లో జరిగే సమావేశంలో ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో ఉన్న సిలబస్‌ను సమీక్షించి.. కామన్ కోర్ సిలబస్‌ను నిర్ణయిస్తారు. దాని ప్రకారం ఏయే రాష్ట్రాలు ఏ మేరకు మార్పులు చేసుకోవాలన్నది నిర్ధారిస్తారు.  ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు ప్రస్తుతం పరిగణనలోకి తీసుకుంటున్న సిలబస్, మార్కుల విధానాన్ని సమీక్షించి కామన్ విధానం రూపొంది స్తారు. దీంతోపాటు కామన్ ప్రశ్నపత్రం విధానం తెస్తారు. ఉదాహరణకు 2 మార్కు ల ప్రశ్నలు ఎన్ని ఇవ్వాలి, 5 మార్కులు, 10 మార్కులు, వ్యాసరూప ప్రశ్నలు, బిట్స్ ఎన్ని ఉండాలనేది నిర్ణయిస్తారు.

Post a Comment

Powered by Blogger.