కాన్‌బెర్రా: నాలుగో వన్డేలో అనూహ్య పరాజయం కెప్టెన్ ధోనిని కూడా ఇరకాటంలో పడేసింది. ఒక వైపు మ్యాచ్ ఓడగా, కీలక సమయంలో డకౌట్‌తో తాను కూడా దానికి కారణమయ్యాడు. అన్ని వైపులనుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఓటమి భారాన్ని అతను తనపై వేసుకున్నాడు. ‘నాకు కోపం రావడం లేదు కానీ బాగా నిరాశ చెందాననేది వాస్తవం. ఓటమికి నేను బాధ్యత వహిస్తున్నా. నేను అవుట్ కావడం మ్యాచ్ ఫలితం మార్చింది. ’ అని ధోని మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు.
 నొప్పి తగ్గే వరకు రహానేను బ్యాటింగ్‌కు పంపలేకపోయామని, అతను ఆలస్యంగా బరిలోకి దిగడం కూడా మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపించిందని కెప్టెన్ అన్నాడు. ఇంతటి ఒత్తిడిలో కొత్త కుర్రాళ్లు ఆడటం కష్టమని గుర్‌కీరత్, రిషి ధావన్‌లకు మద్దతు పలికిన మహి... జడేజాను మాత్రం విమర్శించాడు. ‘లోయర్ ఆర్డర్‌లో జడేజా బ్యాట్స్‌మెన్‌కు తగిన సూచనలిస్తూ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తే బాగుండేది. కానీ అతను ఆ పని చేయలేదు’ అని చురక అంటించాడు.

Post a Comment

Powered by Blogger.